Monday, April 11, 2022

వరి.. కారు పార్టీకి ఉరి కానుందా?

వరి.. కారు పార్టీకి ఉరి కానుందా?

Courtesy by : తొలివెలుగు మీడియా website

--చంద్రబాబును గుర్తు చేస్తున్న కేసీఆర్‌

– ఏసీలు, కూలర్ల కింద ధర్నాలు
– 2019 సీన్‌ రిపీట్‌ అవుతుందా?
– బాబుకు జరిగినట్టే కేసీఆర్‌ కు జరుగుతుందా?
– వరి వార్‌.. సారు మెడకే చుట్టుకుంటుందా?

ఎండవేడి తట్టుకునేందుకు టెంట్లు, కూలర్లు.. వందల మందితో ఢిల్లీలో ధర్నా.. వారికి విందులు, వినోదాలు.. ఫ్లైట్‌, ఇతర ఖర్చులు.. కేసీఆర్‌ నిరసన అంటే ఆ మాత్రం కాస్ట్లీగానే ఉండాలి అనేలా సాగింది టీఆర్‌ఎస్‌ ధర్నా. అయితే.. కేంద్రంపై సారు వ్యవహరిస్తున్న తీరు.. తన పాత బాస్‌ చంద్రబాబును గుర్తు చేస్తున్నట్లే ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఆయన కూడా ఇలాగే 2019 ఎన్నికల సమయంలో కేంద్రంపై పోరుబాట పట్టి.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు

2014 ఎన్నికల సమయంలో కలిసి పోటీకి దిగి 2019 ఎన్నికల సమయానికి మోడీ సర్కార్‌ పై యుద్ధం ప్రకటించారు చంద్రబాబు. ప్రత్యేక హోదా నినాదంతో ధర్మ పోరాటం అంటూ పోరు బాట పట్టారు. బీజేపీయేతర శక్తులన్నింటినీ ఏకం చేసేందుకు శతవిథాలా ప్రయత్నించారు. కానీ.. మోడీపై ఆయన యుద్ధం ఫెయిల్‌ అయింది.జాతీయ రాజకీయాల మాట అటుంచితే రాష్ట్రంలోనే చావు దెబ్బ తిని అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు.

2014 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీకి దిగినా.. పార్లమెంట్‌ లో ఏ బిల్లుకు అడ్డు చెప్పలేదు కేసీఆర్‌. కేంద్రంతో సఖ్యతగానే ఉంటూ వచ్చారు. అయితే.. రాను రాను రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకోవడం.. జాతీయ రాజకీయాల ఆశ ఉండడంతో కేంద్రంపై యుద్ధానికి దిగారు కేసీఆర్‌.అందులోభాగంగానే ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోడీ సర్కార్ పై పోరుబాట పట్టారు. అచ్చం చంద్రబాబు తరహాలోనే కూలర్లు, ఏసీల కింద ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ముచ్చటగా మూడోసారి 95 నుండి 105 స్థానాలు దక్కించుకోవాలని చూస్తున్నారు కేసీఆర్‌. పీకే సూచనలతో అధికార పార్టీ అయి కూడా ప్రతిపక్ష నేతల మాదిరిగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. కేంద్ర పరిపాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రజలను తయారుచేస్తే మళ్లీ అధికారం తమ హస్తగతం అవుతుందనేది కేసీఆర్‌ భావనగా చెబుతున్నారు విశ్లేషకులు.అయితే.. చంద్రబాబు కూడా ఇలాగే ఆలోచించి బొక్కబోర్లా పడ్డారని.. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ కూడా అలాగే అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు.


No comments:

Post a Comment