Tuesday, April 12, 2022

జీవో 111 క్లోజ్‌.. ప్లానేంటో చెప్పిన కేసీఆర్‌..!

జీవో 111 క్లోజ్‌.. ప్లానేంటో చెప్పిన కేసీఆర్‌..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

__111 జీవోపై కేసీఆర్‌ కీలక ప్రకటన

– జీవో ఎత్తివేతకు కేబినెట్‌ ఆమోదం
– త్వరలో సీఎస్‌ నేతృత్వంలో కమిటీ
– 111 జీవో రద్దు ఎవరికి లాభం..?

జీవో 111 జీవోను ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్ వేదికగా కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్‌. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు కేసీఆర్‌. 111 జీవోను రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో సీఎస్‌ నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు స్పష్టం చేశారు కేసీఆర్‌.

జీవో 111 ఏంటి? ఎందుకొచ్చింది?

1996 నాటికి హైద‌రాబాద్ అభివృద్దిని అంచ‌నా వేసి తాగునీటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌నే ఉద్దేశంతో.. జంట జలాశయాలను కాపాడటానికి 111 జీవోను తీసుకొచ్చారు. దాదాపు లక్షా 32 వేల ఎకరాల భూమి ఈ జీవో పరిధిలోని ఉంది. అదంతా 84 గ్రామాల్లో విస్తరించి ఉంది. 1908లో మోక్ష‌గుండం విశ్వేశ‌ర‌య్య హైద‌రాబాద్ కు వ‌చ్చే వ‌ర‌ద‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఉస్మాన్ సాగ‌ర్, హిమ‌య‌త్ సాగ‌ర్ ను నిర్మించారు.కేవ‌లం పైపుల‌తోనే 4 వంద‌ల ఏళ్ల చ‌రిత్ర ఉన్న న‌గ‌రానికి మంచి నీళ్లు అందించేలా ప్లాన్ చేశారు. అయితే తాగునీరు పొల్యుషన్ కాకుండా ఉండ‌టంతో పాటు.. ప‌శ్చిమ క‌నుమ‌ల నుంచి వ‌చ్చే గాలి శీతోష్ణస్థితిని మార్చేస్తుంద‌ని అన్ని న‌గ‌రాల కంటే ఇక్కడ భిన్న‌మైన వాతావార‌ణం ఉంటుంద‌ని.. ఈ ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు, ఫ్యాక్టరీలు పెట్టినా పర్యావరణ హితం కాదనే సదుద్దేశంతో 111 జీవోకి ప్రాణం పోశారు.

జీవో ఎత్తేస్తే నష్టమా?

111 జీవో ఎత్తేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. అదే జరిగితే ఈ 26 ఏళ్ల అభివృద్ధికి ఆ ప్రాంతం త‌ట్టుకోవడం కష్టమని చెబుతున్నారు నిపుణులు. 111 ఎత్తివేస్తే హైద‌రాబాద్ కి ఊపిరితిత్తుల్లాంటి జ‌లాశ‌యాల‌కు ఉరి పోసిన‌ట్లేనని అంటున్నారు. 111 ప్రకారం.. 84 గ్రామాల్లోని వ్య‌వ‌సాయ భూముల్లో ఎలాంటి భ‌వంతులు నిర్మించ‌రాదు. లే అవుట్స్ ఏర్పాటు చేయ‌కూడ‌దు. చెక్ డ్యాములు, లిఫ్ట్‌ ఇరిగేష‌న్ ప‌నులు చేప‌ట్ట‌కుండా స్థానిక సంస్థల ఆథారిటీకి ఆ బాధ్య‌త ఇచ్చారు. ఉస్మాన్ సాగ‌ర్ నుంచి ఆసీఫ్ న‌గ‌ర్ వ‌ర‌కు ఉన్న నాలాకు 100 ఫీట్ల వ‌ర‌కు నిర్మాణాలు చేప‌ట్ట‌రాద‌ని జీవోలో స్ప‌ష్టంగా ఉన్నా.... ఇప్పటికీ అతిక్ర‌మిస్తూనే వస్తున్నారు. అందుకు రాజకీయ నేతలే ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. జీవో 111ను అతిక్రమించిన అక్రమ నిర్మాణాల్లో ఎందరో ప్రముఖుల నిర్మాణాలు కూడా ఉండటంతో ఆ జీవోను ఎత్తివేయిస్తామని కొందరు నేతలు హామీలిస్తూ వచ్చారు. వారిలో కేసీఆర్‌ కూడా ఒకరు. ఇప్పుడు అనుకున్నది చేస్తున్నారు.

జీవో ఎత్తివేత ఎవరికి లాభం?

ఈ జీవో రద్దు వల్ల స్థానికులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు కేసీఆర్‌. కానీ.. అసలైన లబ్ధి అక్రమార్కులకు, రియల్‌ ఎస్టేట్‌ ముఠాకు జరుగుతుందని అంటున్నారు నిపుణులు. అయినా.. 111 జీవోని ఎత్తివేయడం అంత ఈజీ ప్రాసెస్‌ కాదని వివరిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్ర‌కారం 111 జీవో ఏరియాలోని 84 గ్రామాల్లో గ్రామకంఠం త‌ప్ప.. మ‌రెక్క‌డా అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్ట‌రాదు. దీనిపై 2000 సంవ‌త్స‌రంలోనే సుప్రీం సివిల్ అప్పీల్ పిటిష‌న్ పై స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఉల్లంఘించిన వారిపై 2,500 కేసులు కోర్టు ధిక్క‌ర‌ణ కింద హైకోర్టులో విచార‌ణ కొనసాగుతున్నాయి.వీటన్నింటిపై ఏరోజూ కోర్టుకు స‌మాధానం చెప్పలేదు. కానీ.. ఇప్పుడు ఎత్తివేస్తామంటే కోర్టుల్లో క‌నీసం 5 ఏళ్ల విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంటుంది. మరోవైపు జీవో పరిధిలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో కేసీఆర్‌ కుటుంబసభ్యులకు చెందినవి కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఈ జీవో విషయంలో కేసీఆర్‌ ప్రజలను మభ్య పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment