Thursday, April 28, 2022

ఆ తిట్లు, వాయిస్‌ నావి కావు! ఆడియో లీక్‌ పై మహేందర్‌ రెడ్డి స్పందన!

ఆ తిట్లు, వాయిస్‌ నావి కావు! ఆడియో లీక్‌ పై మహేందర్‌ రెడ్డి స్పందన!

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మమేందర్‌ రెడ్డిపై గుర్రుగా ఉన్నాయి పోలీస్‌ వర్గాలు. తాండూరు సీఐని ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఆడియో ఒకటి వైరల్‌ అవడమే దానికి కారణం. ఈ క్రమంలోనే మహేందర్‌ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్‌ లో కేసు కూడా నమోదైంది. 353, 504,506 ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐకి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో మహేందర్‌ రెడ్డి మీడియా ముందుకొచ్చారు.

తాండూరులోని భద్రేశ్వర స్వామి జాతర కార్యక్రమంలో తన ముందు రౌడీ షీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలోనే తాను సీఐతో మాట్లాడానని చెప్పారు. వైరల్ అవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదని.. అసలు.. తాను సీఐని తిట్టలేదని వివరణ ఇచ్చారు.
తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మహేందర్‌ రెడ్డి. పోలీసులు నోటీసులు ఇస్తే విచారణను ఎదుర్కొంటానని.. పోలీసులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఈ నకిలీ ఆడియో వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
ఇదంతా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేయిస్తున్నారని ఆరోపించారు మహేందర్‌ రెడ్డి. గత ఎన్నికల్లో రోహిత్‌ చేతిలోనే ఈయన ఓడిపోయారు. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన రోహిత్‌.. తర్వాత టీఆర్‌ఎస్‌ లో చేరారు. దీంతో మహేందర్‌ రెడ్డి తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడుప్పుడు ఇలా అధికారులతో దుర్భాషలాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ చాలామంది అధికారులను ఇలాగే తిట్టారని ఆయన వ్యతిరేకులు చెబుతున్నారు. అయితే.. తాజాగా బయటకొచ్చిన ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అంతా రోహిత్‌ రెడ్డి కుట్రగా ఆయన ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment