ఇంటర్నెట్‌డెస్క్(ఈనాడు తాజా వార్తలు ట్విట్టర్): వ్యాక్సిన్ పంపిణీ, వైరస్ కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజారోగ్య నిపుణుల బృందం నివేదిక సమర్పించింది. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నవాళ్లకే తొలుత టీకాలు వేయాలని ప్రజారోగ్య నిపుణుల బృందం కేంద్రానికి సూచించింది. అందరికీ వ్యాక్సిన్ వేయడం సముచితం కాదని పేర్కొంది. ప్రణాళికా రహితంగా టీకా పంపిణీ నిర్వహిస్తే కొత్తరకం స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే కొవిడ్ బారిన పడ్డవారికి వ్యాక్సిన్ అవసరం లేదని అభిప్రాయపడింది.
ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోషియేషన్, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ ప్రివెంటివ్, సోషల్ మెడిసిన్, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ ఎపిడెమాలజిస్ట్స్, ఎయిమ్స్ వైద్యులు, కొవిడ్‌పై ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ సభ్యులతో కూడిన బృందం ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక నివేదిక సమర్పించింది. అందరికీ టీకా వేయడం కంటే, లక్షిత వర్గాలకు ప్రాధాన్య క్రమంలో టీకా ఇవ్వడం వల్ల మేలు జరుగుతుందని నిపుణుల బృందం తెలిపింది. యువత, చిన్నారులకు ఇప్పుడు టీకా పంపిణీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. సామూహికంగా, విచక్షణారహితంగా, అసంపూర్తిగా ఈ క్రతువు నిర్వహిస్తే వైరస్ మ్యుటేషన్లతో కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే కరోనా బారిన పడ్డవారికి టీకా అనవసరమని నిపుణులు స్పష్టం చేశారు. టీకా అనేది కరోనాపై శక్తిమంతమైన ఆయుధమని దాన్ని వాడకుండా అట్టి పెట్టుకోకూడదని, అలాగని విచక్షణారహితంగా ఉపయోగించకూడదని కేంద్రానికి సూచించింది. స్వల్ప ఖర్చుతో అత్యధిక ప్రయోజనాలు రాబట్టుకునేలా టీకా పంపిణీని వ్యూహాత్మకంగా వాడుకోవాలని నిపుణులు పేర్కొన్నారు.
డెల్టా వేరియంట్ ప్రభావంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని తగ్గించడం వంటి అవకాశాలను పరిశీలించాలని నిపుణుల బృందం కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరణాలను తగ్గించడంపై దృష్టి సారించాలని కేంద్రానికి సూచించింది. కొవిడ్‌తో మరణిస్తున్న వారిలో వృద్ధులు, ఊబకాయులు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతకు టీకా వేయడం ఆర్థికంగా ప్రయోజనకరం కాదని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment