హైదరాబాద్ : 24/06/2021
ప్చ్ “లాభం” లేదు.. సర్కార్ ధరలపై ‘ప్రైవేట్’ అసంతృప్తి
కరోనా వైరస్ చికిత్సకు తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసి ధరలపై రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో కరోనా ట్రీట్‌మెంట్ చేయడం సాధ్యం కాదని అంటున్నాయి. ప్రభుత్వం ఏకపక్షంగా రేట్లను ఫిక్స్ చేసిందని.. తమను సంప్రదించకుండానే, తమ అభిప్రాయం సేకరించకుండానే జీవో జారీ చేయడం సరికాదని తప్పుబడుతున్నాయి. జీవోను సవరించాల్సిందేనని.. ధరల్లో మార్పులు చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అంతేకాదు ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే.. ఆ ధరల్లో చికిత్స అందించడం కష్టమేనని తేల్చి చెబుతున్నాయి. ఈ విషయంపై సర్కార్‌తో చర్చించి.. తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులతోనే కరోనా కట్టడి సాధ్యం కాదని భావించే ప్రభుత్వం.. ప్రైవేట్ ఆస్పత్రలు సాయం కోరిందని, ప్రభుత్వం అడిగినట్టుగా తాము తమ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల కోసమే ప్రత్యేకంగా బెడ్లను కేటాయించి సహకరించామని గుర్తు చేస్తున్నాయి. అలాంటిది ఇంతటి కీలక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కనీసం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరైంది కాదని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం కరోనా ట్రీట్‌మెంట్ చేయడం కన్నా.. బెడ్లను ఖాళీగా ఉంచుకోవడమే మంచిదని అంటున్నాయి. సాధారణంగా ఒక్కో కరోనా బాధితుడికి కోలుకునే వరకూ చికిత్స అందించాలంటే రూ.3 లక్షల వరకూ ఖర్చు అవుతుందని గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ చెప్పిన మాటలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రస్తావిస్తున్నాయి.
కరోనాకు అందించే క్రమంలో ఏయే ప్రొటోకాల్ పాటించాల్సి వస్తుందో.. రోగులకు ఏమేం సదుపాయాలు కల్పించాల్సి వస్తుందో ఇప్పటికే ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నివేదిక సమర్పించాని యాజమానాలు చెబుతున్నాయి. ఆరోగ్యశాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీష్ రావు కూడా దాన్ని పరిశీలించి.. తాము చెబుతున్న అంశాల్లో వాస్తవం ఉందని అంగీకరించారని.. కానీ చివరికి చేయాల్సింది చేశారని ఆక్రోశం వెళ్లగక్కుతున్నాయి. త్వరలో థర్డ్ వేవ్ రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్న వేళ.. ప్రైవేట్ ఆస్పత్రులు పెడుతున్న మెలికను విప్పడం సర్కార్‌కు సవాల్‌గా మారేలా ఉంది. మరీ జీవోలో మార్పులు చేస్తుందా.. లేదా అదే ధరల్లో చికిత్స అందించాలని ఆదేశిస్తుందా చూడాలి.
No comments:
Post a Comment