హైదరాబాద్ : 27/06/2021
రేవంత్ రెడ్డి ముందున్న ముళ్లు.. సవాళ్లు ఇవే!
ఇల్లు అలకగానే పండగ కాదు.. ఇప్పుడు రేవంత్ రెడ్డిదీ ఇదే పరిస్థితి. కొత్త అధ్యక్షుడిగా ముందుకు సాగే బాటలో ప్రస్తుతం ఆయన ఎదుట అనేక ముళ్లు, సవాళ్లు ఉన్నాయి. ఒక రకంగా ఇకపై తెలంగాణలో కాంగ్రెస్ కు ఇప్పుడు రేవంత్ చీఫ్ కాకముందు.. అయిన తర్వాత అన్న పరిస్థితులు రాబోతున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ముందున్న మొదటి అతి పెద్ద సవాల్… అసంతృప్తులను చల్లార్చడం.
రేవంత్ రెడ్డిని పార్టీ చీఫ్‌గా ప్రకటించగానే.. ఓ వర్గంలో ఇప్పటికే అగ్గిరాజుకుంది. అలా ఎలా ఇస్తారంటూ బాహటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఆయన అప్పర్ హ్యాండ్‌ను ఇష్టపడని కొందరు పార్టీ వీడే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇప్పుడు వారందరినీ మేనేజ్ చేయడం రేవంత్ రెడ్డికి అతి పెద్ద, ముఖ్యమైన టాస్క్‌గా మారనుంది. ముఖ్యంగా బయటివాళ్లకు పీసీసీ ఇస్తే ఊరుకోబోమన్న వీహెచ్.. పీసీసీ పదవి కోసం చివరి వరకూ పోటీపడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అధ్యక్ష పదవి ఇవ్వకపోతే బీజేపీలోకే అంటూ చెప్పిన రాజగోపాల్ రెడ్డి, పార్టీలో ఉండాలా వద్దా అని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకునే జగ్గారెడ్డి వంటి నేతలతో పాటు తన నాయకత్వాన్ని విబేధించే మిగిలిన వారితో రేవంత్ రెడ్డి ఎలా సఖ్యత సాధిస్తారు?వారిని కలుపుకొని ముందుకు ఎలా సాగుతారన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.
రేవంత్ రెడ్డి ముందున్న మరో సవాల్.. కోవర్టులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పాలిట అతి పెద్ద సమస్యగా మారిందిది. కాంగ్రెస్ వ్యూహాలన్ని కూడా ఇప్పటిదాకా ముందుగానే కేసీఆర్‌కు తెలిసిపోయేవి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ తమ మేనిఫెస్టోని ప్రకటించకముందే.. అది టీఆర్ఎస్ భవన్‌లో కనిపించిందన్న మాటలు వినిపించాయి. కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో కొనసాగే నేతలు.. అధికారపార్టీ పట్ల అనధికార విధేయత చూపిస్తున్నారనే విమర్శలు, అభిప్రాయాలు సొంత పార్టీలోనే ఇప్పటికీ ఉన్నాయి. అలాాంటి వారికి రేవంత్ రెడ్డి ఎలా చెక్‌పెడతారన్నది కూడా ఇంట్రెస్టింగ్ థింగ్. ఇదే సమయంలో ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఊరటనిచ్చే సంగతి ఒకటుంది. మొన్నటివరకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌నే ఏకంగా.. కేసీఆర్‌కు అనుకూలంగా నడుచుకుంటున్నారన్న విమర్శ వినిపించేది..కానీ రేవంత్ రెడ్డి విషయంలో అలా అనుకునే ఆస్కారం చాలా తక్కువ. ఆది నుంచి టీఆర్ఎస్‌తో రేవంత్ రెడ్డికి పార్టీపరంగా, వ్యక్తిగతంగా చాలా వైరం ఉంది. కానీ పోరాడేందుకే సరైన వేదిక, బలం దొరకలేదు. ఇప్పడు ఆ రెండూ ఆయన చేతిలో న్నాయి. ఇకపై ప్రభుత్వంపై ఆయన సాగించే పోరాటంలో పార్టీ శ్రేణులు, సాధారణ ఓటర్లు కూడా ద్వంద్వర్థాలను వెతికే అవకాశాలు కూడా తక్కువే. ఇది ఆయనకు చాలా బలంగా మారనుంది.
ఇక రేవంత్ రెడ్డి ముందున్న మరో అతి పెద్ద సవాల్ ఆధిపత్య పోరు లేదా వర్గపోరు. మొదటి నుంచి కాంగ్రెస పాలిట శనిలా దాపురించింది ఈ సమస్య. కాంగ్రెస్‌లో ఎవరిని అధ్యక్షుడిగా చేసినా.. ఆ పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా మరో వర్గం ఏర్పడేది. ఇప్పటికీ ఆ పార్టీలో రెండు, మూడు వర్గాలు కనిపిస్తాయి. పాత నాయకులు, కొత్త నాయకులు అనో లేక.. రెడ్డి, బీసీ అంటూ మరో వర్గమో కనిపించేది. ఇక ఎన్నికలు వస్తే చాలు.. ముఖ్యమంత్రి పదవి విషయంలో గ్రూపులుగా విడిపోయే అలవాటు ఆ పార్టీలో కనిపిస్తుంది. ఇలాంటి బహునాయకత్వ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి ఇంటా, బయటా అనేక చాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. మరి వాటికి ఎలా చెక్‌పెడతారో చూడాలి.
No comments:
Post a Comment