Monday, June 28, 2021

దళిత మంత్రం… ఉప ఎన్నిక వేళ కేసీఆర్ తంత్రం

హైదరాబాద్ : 28/06/2021

దళిత మంత్రం… ఉప ఎన్నిక వేళ కేసీఆర్ తంత్రం

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
దళిత మంత్రం… ఉప ఎన్నిక వేళ కేసీఆర్ తంత్రం

– మంత్రాలకు చింతకాయలు రాలుతాయా
– కేసీఆర్ మాటలు దళితులు నమ్ముతారా..!
– దళిత సీఎం .. హామీ గాయం మానిందా!
– ప్రత్యేక రాష్ట్రంలో దళితులు క్షేమమేనా..!
– మరియమ్మ, నేరెళ్ల వంటి ఉదంతాల సంగతేంటి..?
– విపక్షాలపై కేసీఆర్ దళితాస్త్రం

దళితుల పై కెసిఆర్ కు ప్రేమ నిజమేనా…కాదా…! ఇది తేల్చుకోవాల్సింది అక్షరాలా దళిత సోదరులే. ఉద్యమ సమయం నుంచి గద్దెనెక్కేదాకా సారు మాటలు, గాల్లో కట్టిన మూటలు.. శుష్కమైన హామీలు.. ఆఖరికి తెలంగాణ వచ్చాక జరుగుతున్న ఘటనలు అన్నీ బేరీజు వేసుకోవాల్సింది …సారు టక్కుటమారాల్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా దళితులదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దళితుల ఆర్ధిక స్వాలంబన కోసం తాను కట్టుబడి ఉన్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికైనా ఈ ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి సలహాలను తీసుకున్నాడు .దీనితో అయన గొప్ప ప్రజాస్వామ్య వాది అనుకుంటే పొరపాటే .హుజురాబాద్ ఎన్నికల వేళ ఇలాంటి డ్రామాలు మాములే అనికూడా అంతా అనుకుంటున్నారు. ఆదివారం ప్రగతిభవన్ లో దళితుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం సుదీర్ఘంగా 11 గంటల పాటు సాగింది. కేసీఆర్ కి దళితుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీనినిబట్టి అర్ధం అవుతుందని ఎవరైనా అనుకుంటే పొరపాటే. కేసీఆర్ ను ఇక్కడే అర్ధం చేసుకోవాలి, లేదంటే అయన బుట్టలో పడతామని దళిత నేతలే అంటున్నారు..సమావేశానికి హాజరైన విపక్ష నాయకులు కేసీఆర్ ఆతిథ్యానికి మంత్ర ముగ్ధులయ్యారు. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రతిపక్ష నాయకులు భజన చేయడం వారి రాజకీయ అవగాహనా లోపానికి అద్దం పడుతుందని కూడా వారు మండిపడుతున్నారు. కొత్తగా ప్రకటించిన పథకంపై అందరూ అహో ఓహో అని చంకలు గుద్దుకోవడం విపక్షాల దిగజారుడు తనానికి నిదర్శనం అని అంటున్నారు.

ఓటు బ్యాంకు పాలిటిక్స్ తప్ప కేసీఆర్ కు నిజాయితీ లేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ దళితుల ఓట్ల కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టాడు. కాకపోతే ఈసారి అఖిలపక్ష సమావేశం పెట్టి ప్రకటించాడు అని అంటున్నారు. ఎందుకంటే ఇదంతా డ్రామా, కేసీఆర్ టక్కుటమార విద్య, గోకరణ గజకరణ విద్య అని విపక్షాలు విమర్శించకుండా ముందే వారికి చెక్ పెట్టాడు అని విమర్శిస్తున్నారు. కేసీఆర్ సమావేశానికి పిలిస్తే చాలు అన్నట్లు గా కేసీఆర్ ను పొగడ్తలలో ముంచెత్తే విపక్షాలు కూడా టీఆరెస్ లో చేరితే పోలా అని చురకలంటిస్తున్నారు. సమావేశానికి వెళ్లకపోతే ప్రతిపక్షాలకు దళితులు అభివృద్ధి చెందడం ఇష్టం లేదని దుమ్మెత్తి పోస్తారు అనే విమర్శకు భయపడితే వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాల్సింది. అలా కాకుండా భజన చేయడానికి వెళ్లినట్లు ఉందనేది వారి వాదన. విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటిదాకా దళితులకు జరిగిన అన్యాయాన్ని సమావేశంలో కేసీఆర్ కు గుర్తు చేయాలి. తాము ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారో దానికి కేసీఆర్ ఏమన్నాడో కూడా మీడియా ముఖంగా చెప్పాలి. లేదంటే సీఎం కార్యాలయం విడుదలచేసిన ప్రెస్ నోట్ ద్వారా ప్రతిపక్షాలకు రాజకీయంగా నష్టం జరుగుతుంది అని దళిత సంఘాలు హితవు పలుకుతున్నాయి. సీఎం కార్యాలయం తమకు అనుకూలంగా ఉండే విషయాలనే మీడియాకు రిలీజ్ చేస్తుంది. వాటినే మేము పరిగణనలోకి తీసుకొని మాట్లాడతాము అని అంటున్నారు.

కొత్త పథకం ద్వారా ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతుబంధు మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కూడా కేసీఆర్ మళ్ళీ పాత పాటే పాడాడు. సమైక్య రాష్ట్రంలో దళితులు గోసపోయారు.. తెలంగాణ వచ్చాకే వారి బతుకులలో వెలుగు నిండింది అన్నారు. ఇది ముమ్మాటికీ అబద్ధం. ఒక సామాన్య దళిత కుటుంబం లో జన్మించి నీతి నిజాయితీ గా ప్రజలకు సేవ చేస్తున్న దళిత బిడ్డ అయిన దామోదర్ సంజీవయ్యను నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ కు ఉంది. ఈ విషయాన్ని అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రతినిధి గట్టిగా ప్రస్తావించారా…? ప్రస్తావించకపోతే ఎందుకు ప్రస్తావించలేకపోయారో చెప్పాలని నిలదీస్తున్నారు.. ఉద్యమ సమయంలో దళితుడిని సీఎం చేసి తాను కాపలా కుక్కలా ఉంటాను అని కేసీఆర్ అన్నాడు. తెలంగాణ రాగానే ప్లేటు ఫిరాయించి తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కి దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచారు. దళితులకు పాలన చేయడం సాధ్యం కాదు అనేలా వ్యవహరించారు. ఇది వాస్తవం కాదా! దీనిపై వామపక్షాలు కేసీఆర్ ను నిలదీయవచ్చు గా సమావేశంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. కేసీఆర్ అంటే భయమా లేక తాము చేసుకునే పైరవీలకు విఘాతం కలుగుతుందని భయమా అని దళిత నాయకులు అడుగుతున్నారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణను ఎలా బాగుచేసుకోవాలో తనకు తెలిసినట్లు గా ఎవరికీ తెలియదు అన్నట్లు మాట్లాడాడు. అది నిజమని అనుకుంటే దళితుడిని సీఎం చేసి తాను ప్రభుత్వ సలహామండలి అధ్యక్షుడిగా ఉంటూ సలహాలు సూచనలు చేస్తూ తెలంగాణను బంగారు తెలంగాణ గా చెయ్యవచ్చు గా అని అంటున్నారు. కానీ కేసీఆర్ కు అహంకారం అడ్డు వచ్చింది. ఆయనలోని అగ్రకులతత్వం బయటకు వచ్చింది. అందుకే తానే సీఎం కావాలని అనుకున్నాడు. మొక్కుబడిగా దళితుడిని డిప్యూటీ సీఎం చేసి చేతులు దులుపుకున్నాడు. అదికూడా మొదటి టర్మ్ మాత్రమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక అదికూడా లేదు. దీనినిబట్టి కేసీఆర్ కు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని అంటున్నారు.

కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను విపక్షాలు మరిచిపోయాయా..? దళితుడిని ముఖ్యమంత్రి
ని చేసే విషయం పక్కనపెడితే.. కనీసం మంత్రి వర్గంలో సముచిత స్థానం కూడా కల్పించలేదని విషయం గుర్తు లేదా..? అని దళిత సంఘాలు
అడుగుతున్నాయి. మొదటిసారి మంత్రివర్గంలో మాదిగ నేతకు ప్రాధాన్యత ఇచ్చి కేబినెట్ లో ఒకరికి అవకాశం ఇస్తే.. రెండోసారి మాల కులానికి చెందిన నేతకు అవకాశం ఇచ్చారు. అంటే ఇస్తే ఎవరో ఒకరికి తప్ప.. రెండింటికి చెందిన నాయకులకు ఇవ్వలేదు. దీన్ని బట్టే కేసీఆర్ వైఖరి ఏంటో అర్థం అవుతుందని అంటున్నాయి. పైగా విపక్ష నాయకులు ఇదంతా మర్చిపోయి.. కేసీఆర్ పెట్టిన భోజనం చేసి వచ్చారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అదే తన సామజిక వర్గానికి చెందినవారికి ముగ్గురికి అవకాశం ఇచ్చాడని గుర్తు చేస్తున్నారు.

ఎంపీగా ఓడిపోయిన వినోద్ కు కేబినెట్ హోదా కల్పించారని.. అలాంటి కేసీఆర్ కు దళితుల మీద ప్రేమ ఉందంటే ప్రతిపక్షాలు ఎలా నమ్మాయని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఒకే ఒక్కసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంకుబండ్ దగ్గరకు వచ్చి విగ్రహానికి దండ
వేశాడు. ఆ తరువాత ఎప్పుడూ అటువైపు చూడలేదు. 120 అడుగుల విగ్రహం పెడతానని చెప్పి ఐదేళ్లు అయింది. ఇంతవరకు అతీగతీ లేదు.
నిన్నకాక మొన్న ప్రకటించిన వీవీ విగ్రహాన్ని మాత్రం నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేశారు. తెలంగాణ బిడ్డ దేశాన్ని నడిపించిన మహానుభావుడు.. అనేక సంస్కరణలు తెచ్చి దేశాన్ని ఆర్ధిక పురోభివృద్ధికి కృషి చేసిన నాయకుడు.. ఆయన విగ్రహాన్ని పెట్టడాన్ని తాము కూడా స్వాగతిస్తామని అంటున్నారు దళితులు. కాకపోతే అంటేద్కర్ విగ్రహ ఏర్పాటుకే ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్ కు దళితుల మీద నిజంగా ప్రేమ ఉంటే.. తెలంగాణ భవన్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. దానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది గాంధీ అయితే.. దళితులకు స్వేచ్ఛ తీసుకొచ్చింది అంబేద్కర్ అని.. అలాంటి మహోన్నత వ్యక్తి ఫోటోను తెలంగాణ భవన్ లో ఎందుకు పెట్టలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా చిన్న విషయం అని అనుకోవచ్చు.. కానీ.. తమకు మాత్రం పెద్ద విషయం అని అంటున్నారు దళితులు. దీన్నిబట్లే కేసీఆర్ ఆలోచనలు
ఎలా ఉన్నాయో అద్దం పడుతున్నాయని చెబుతున్నారు.

దళితులకు మూడు ఎకరాలు భూమి అన్నారు. ఏమైంది..? అదేమంటే భూమి దొరకడం లేదని చెబుతున్నారు. రేపు కొత్తగా ప్రవేశపెట్టిన
పథకానికి కూడా నిధులు లేవు అంటే ఏం చేయాలి..? నిజానికి ఇప్పుడు అసలు నిధులు ఉన్నాయా..? అనేది ప్రశ్న. అనేక సంక్షేమ పథకాలకు నిధుల కొరత వెంటాడుతోంది. అప్పులు చేసి వాటిని అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా దళితుల కోసం సంక్షేమ పథకాన్ని ప్రవేశ
పెట్టారు. దీనికి బాలారిష్టంలోనే నిధుల కొరత వెంటాడడం ఖాయమని భావిస్తున్నారు దళిత నేతలు. అగ్రవర్ణాల పిల్లలు, దళిత పిల్లలు ఒకేచోట చదవాలని.. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి ఎన్నాళ్లవుతుంది. ఇంతవరకు కేసీఆర్ ఏం చేశారు. బీసీ, ఎస్సీ, మైనార్టీల వారీగా గురుకులాలు
పెట్టి చేతులు దులుపుకున్నారు. మరియమ్మ లాకప్ డెత్ పై స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం సమర్ధించాల్సిందే. ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయితే బాధ్యులైన పొలీస్ అధికారులను సర్వీస్ నుండి తొలిగిస్తానని హెచ్చరించడం స్వాగతించ తగ్గ పరిణామమే.. కాకపోతే ఇలాంటిదే కేటీఆర్ నియోజకవర్గంలోని నేరెళ్లలో జరిగింది. కానీ.. నేటివరకు కేసీఆర్ స్పందించలేదు. విచారణకు ఆదేశించలేదు. ఆ కుటుంబాలను ఆదుకోలేదని గుర్తు చేస్తున్నారు దళితులు. దీనిపై ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టే స్పందించలేదా..? ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉందని స్పందించారా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు దళితులు.

పోలీసులు పెట్టిన చిత్రహింసలకు నేరెళ్ల దళిత యువకులు.. జీవిత కాలం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నెలకు వేల రూపాయల మందులు ఖర్చు చేస్తున్నారు. అలాంటి పోలీసు అధికారులను ఎందుకు రక్షిస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని అంటున్నారు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగంగా రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలో పాల్గొన్న భారతిపై.. పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఆమె చనిపోయింది. ఆ సంఘటనపై కేసీఆర్ ఎందుకు విచారణకు ఆదేశించలేదని అడుగుతున్నారు. పైగా మాదిగల ఉద్యమాన్ని చీల్చి కేసీఆర్ ఆనంద పడ్డాడని అంటున్నారు ఎమ్మార్పీఎస్ నేతలు. దళిత ఉద్యమాలు బలంగా ఉండడం కేసీఆర్ కు ఇష్టం ఉండదని మండిపడుతున్నారు. మొత్తంగా ఆయన మాటలు కోటలు దాటతాయి ఆచరణలో మాత్రం గడప దాటదని సెటైర్లు వేస్తున్నారు. ఏ పథకానికైనా వేల కోట్లు కేటాయిస్తున్నట్లు
ప్రకటిస్తారు. కానీ ఖర్చు చేయడానికి నిధులు ఉండవు. కేసీఆర్ విశ్వసనీయత రోజురోజుకీ మసకబారుతుందని.. కాకపోతే తన వ్యూహాలతో ప్రతిపక్షాలను ప్రజలను బోల్తా కొట్టిస్తూ కాలం గడుపుతున్నాడని విమర్శిస్తున్నారు. ఇది కూడా ఎక్కువ రోజులు నడవదని… దళితులు ఓట్లు వేసే యంత్రాలుగా మారొద్దని సూచిస్తున్నారు ఎమ్మార్పీఎస్ నేతలు.

No comments:

Post a Comment