హైదరాబాద్ : 27/06/2021
మరియమ్మ, ఆమె కుమారుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ?
దొంగతనం కేసులో అరెస్టయిన దళిత మహిళ.. లాకప్‌డెత్ కావడం ఇప్పుడు పెద్ద దుమారం లేపుతోంది. కేసు హైకోర్టు దాకా వెళ్లడం.. సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీస్‌శాఖ మెడకు చుట్టుకుంటోంది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల వరుస ఆందోళనలతో ఉన్నతాధికారులు ఒక్కొక్కరిని బాధ్యులను చేస్తూ సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. మరియమ్మ, అతని కుమారుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా.. చనిపోయేంత వరకు దెబ్బలు కొట్టారా.. చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది.. ఇందులో పోలీసుల పాత్ర.. దీనిపై లోతుగా పరిశీలిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సాక్షి, యాదాద్రి(నల్లగొండ): అడ్డగూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ బాలశౌరి ఇంట్లో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లకుంటకు చెందిన మరియమ్మ వంట మనిషిగా పనిచేస్తోంది. ఈ నెల 3న మరియమ్మ దగ్గరికి తన కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు శంకర్ వచ్చారు. 5వ తేదీ పాస్టర్ పనిమీద హైదరాబాద్‌కు వెళ్లాడు. 6వ తేదీన తిరిగి వచ్చాడు. తన ఇంట్లో రూ.2 లక్షల దొంగతనం జరిగిందని 16న అతను అడ్డగూడూరు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందు రోజే మరియమ్మ కుమారుడితో కలిసి స్వగ్రామమైన కోమట్లకుంటకు వెళ్లిపోయింది. పోలీసులు పాస్టర్‌కు చెందిన కారులోనే 17న కోమట్లకుంటకు వెళ్లి మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు శంకర్‌ను 18న ఉదయం 8 గంటలలోపు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. అయితే డబ్బు పోయిన రోజుకు, పోలీస్ కేసు నమోదైన రోజుకు మధ్యలో పది రోజుల గడువు ఉంది. ఈ సమయంలో పాస్టర్, మరియమ్మల మధ్య డబ్బు విషయంలో ఏం జరిగిందో బయటికి పొక్కనీయడం లేదు.
మీకేం పని ఇళ్లకు వెళ్లండి..
మరియమ్మ, ఆమె కుమారుడు, మరో యువకుడిని అడ్డగూడూరుకు తీసుకువచ్చే సమయంలోనే తీవ్రంగా కొట్టారని సమాచారం. దొంగతనం సొమ్మును రికవరీ చేసే క్రమంలో ఇంటరాగేషన్ పేరుతో మరోమారు స్టేషన్‌లో థర్ఢ్ డిగ్రీ ప్రయోగించారని తెలుస్తోంది. ఇంటరాగేషన్ కోసం ప్రత్యేకంగా ఉంచిన రబ్బర్‌టైర్ బెల్ట్‌తో ‘పోలీస్’శైలిలో కొట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తమను కొట్టవద్దని మరియమ్మ వేడుకున్నట్లు తెలుస్తోంది. కుమారుడిని నడుంకింది భాగంలో కొడుతుండగా అడ్డుకోబోయిన ఆమెను పోలీసులు పక్కకు నెట్టేశారు. మహిళా పోలీస్‌లు లేకుండానే కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక పెద్దగా ఏడుస్తూ అరుస్తుండడంతో పోలీస్‌స్టేషన్ చుట్టుపక్కల ఇళ్లలోని మహిళలు ‘ఏమైంది.. మహిళను ఎందుకు కొడుతున్నారు’ అని ప్రశ్నించగా ‘మీకేం పని ఇళ్లలోకి వెళ్లండ’ని పోలీస్‌లు వారిని బెదిరించినట్లు సమాచారం. అప్పటికే ఆమె కుప్పకూలిపోయిందని, కిందపడిపోయిన మరియమ్మను ఇద్దరు కానిస్టేబుళ్లు చేతులకింద బెల్ట్ పెట్టి పోలీస్ స్టేషన్‌లోకి బలవంతంగా ఎత్తుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు.
స్పందించిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం
మరియమ్మ లాకప్‌డెత్‌పై ప్రజా సంఘాలు, ప్రతిపక్షపార్టీలు ఆందోళనకు దిగాయి. హైకోర్టు సైతం ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆలేరు కోర్టును ఆదేశించింది. అదేవిధంగా రీపోస్ట్‌మార్టం చేయించాలని, బాధ్యులైన పోలీ సులపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సీఎం కేసీఆర్ లాకప్‌డెత్‌పై విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అడుగడుగునా పోలీసులపై ఆరోపణలు
► స్పృహ కోల్పోయిన మరియమ్మను పోలీసులు 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.
► నాడి పరిశీలించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, పల్స్ దొరకడం లేదని చెప్పడంతో హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి 11 గంటలకు తరలించారు.
► అక్కడ పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. మృతదేహం మార్చురీలో ఉండగానే పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.
► కొందరు నాయకుల సహకారంతో కేసును తారుమారు చేసే ప్రయత్నాలు జరిగాయి.
► 11 గంటలకు తీసుకువచ్చిన మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయకుండా జా ప్యం చేయడం వెనక పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
► జిల్లాలోని ఓ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికా రి ఆస్పత్రి వద్దకు వచ్చి బాధితులు, మరికొంత మందితో చర్చించారని సమాచారం.
► అదేరోజు రాత్రి కాంగ్రెస్ ఎస్సీసెల్ నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడం, 19వ తేదీ మరుసటి రోజు వివిధ ప్రజా సంఘాలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
► వైద్యులు మరియమ్మ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్ట్‌మార్టం జాప్యం వెనుక పోలీసుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
► మరియమ్మ పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా రాలేదని భువనగిరి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రకాష్ ‘సాక్షి’తో చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు మరియమ్మ అవవయాల ను పంపించామన్నారు. మరో వైపు హైకో ర్టు ఆదేశాల మేరకు రీపోస్ట్‌మార్టం చేయాల్సి ఉంది.
పాస్టర్‌నే వాహనం అడిగిన పోలీసులు
మరియమ్మను తీసుకువచ్చేందుకు కారు కావాలని పోలీసులు..సదరు పాస్టర్‌ను అడగగా తన సొంతకారును అప్పచెప్పినట్లు తెలిసింది. అయితే కొంచెం పెద్ద వాహనం కావాలని, ఈ కారు చిన్నగా ఉండడంతో సరిపోదని తిరిగి ఇచ్చేశారు. దీంతో సదరు పాస్టర్ బొలెరోను సమకూర్చినట్లు సమాచారం. ఆ వాహనంలోనే పోలీసులు కోమట్లకుంటకు వెళ్లి నిందితులను తీసుకువచ్చారు.
పోలీసులపై చర్యలు ప్రారంభం
దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ కేసులో పోలీసులపై చర్యలు ప్రారంభం అయ్యాయి. చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్యను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ మహేశ్ భగవత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అడ్డగూడురు ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుళ్లు జానయ్య, రైటర్ రషీద్‌లను ఈనెల 19న భువనగిరి డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆ తరువాత సస్పెండ్ చేశారు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జడ్జితోపాటు పోలీస్‌శాఖ పరంగా మరికొంత మంది పోలీస్ అధికారులపై విచారణ ప్రారంభించారు.
No comments:
Post a Comment