హైదరాబాద్ : 26/06/2021
GISP Portal: విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. వివరాలివే..
విదేశాల్లో విద్యనభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్థం కేంద్రం ఓ పోర్టల్ ను తీసుకురానుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
- Courtesy :NEWS18 TELUGU
విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్నారా? మీరు ఎంచుకున్న యూనివర్సిటీలు, కళాశాలల గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారా? ఆయా సంస్థలకు గుర్తింపు, స్కాలర్షిప్ అవకాశం, ఎడ్యుకేషన్ లోన్, మెడికల్ ఇన్సూరెన్స్ ఆప్షన్లు ఉంటాయా? మీరు వెళ్లాలనుకున్న దేశంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలతో సతమతం అవుతుంటారు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే ఇండియన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. ఈ ఇబ్బందులను దూరం చేసేందుకు ముందుకు వచ్చింది భారత ప్రభుత్వం. విదేశాల్లోని విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘గ్లోబల్ ఇండియన్ స్టూడెంట్స్ పోర్టల్ (GISP)’ అనే ప్లాట్‌ఫాంకు రూపకల్పన చేసింది. ఈ పోర్టల్‌లో విదేశీ విద్యాసంస్థల్లో చదవాలనుకునే భారత విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ పోర్టల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం, బిడ్ డాక్యుమెంట్ విశ్లేషణను న్యూస్18 మీకు అందిస్తోంది.
కొత్త పోర్టల్‌కు సంబంధించిన పూర్తి కార్యాచరణ, ఇతర వివరాలను కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంట్‌లో వివరించింది. ఈ పోర్టల్‌లో విద్యార్థులు నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక మాడ్యూల్ ఉంది. ఇందులో యూనివర్సిటీలు, కళాశాలలు, కోర్సులు, వాటిని అందిస్తున్న దేశాలు, ఆయా సంస్థలకు సంబంధించిన లింక్‌లతో.. పూర్తి సమాచారాన్ని అందించనున్నారు.
విద్యార్థులు దేని గురించి ఆరా తీస్తారు?
లోన్ మంజూరు చేసే విషయంలో బ్యాంకులు సైతం ఈ పోర్టల్ సేవలను వినియోగించుకోవచ్చు. ఇందులో పేర్కొన్న విదేశీ విద్యాసంస్థలు, వాటిల్లో చదివే విద్యార్థుల ప్రామాణికతను బ్యాంకులు GISP డేటా ఆధారంగా సులభంగా ధ్రువీకరించుకోవచ్చు. అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందించే ఏజెన్సీల వివరాలు కూడా జీఐఎస్‌పీ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.
విదేశాల్లో పరిస్థితుల సమాచారం కూడా..
విద్యార్థులు వెళ్లాలనుకునే వివిధ దేశాల రాజకీయ, ఆర్ధిక పరిస్థితులను.. ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న భారత విద్యార్థుల సంఖ్య వంటి వివరాలను GISP పోర్టల్ అందిస్తుంది. ఆయా దేశాల్లో విద్యార్థులు ఉండాలనుకుంటున్న ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి, భాషా సమస్యతో పాటు సామాజిక, రాజకీయ, జీవన పరిస్థితులు.. అక్కడి ఆహారపు అలవాట్లు.. వంటి పూర్తి వివరాలను ఈ ప్లాట్‌ఫాం ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. వివిధ దేశాల గురించి విద్యార్థులు తరచుగా అడిగే ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాలు కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.
విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే భారత విద్యార్థులకు అన్ని విధాలుగా సేవలందించే ఉమ్మడి ప్లాట్‌ఫాంగా జీఐఎస్‌పీ పోర్టల్‌ను తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వం బిడ్ డాక్యుమెంట్‌లో పేర్కొంది. ఈ పోర్టల్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని ఎన్‌ఐసి ప్లాట్‌ఫామ్ హోస్ట్ చేస్తుంది. ఈ వెబ్‌సైట్ భద్రత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
GISP ఎవరికి అవసరం?
ప్రస్తుతం దాదాపు 11 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నట్లు అంచనా. ఈ క్రమంలో ఎంతోమంది విద్యార్థులు విదేశీ విద్యాసంస్థల గురించి సరైన సమాచారం తెలుసుకోకుండా, నకిలీ యూనివర్సిటీలలో నమోదు చేసుకొని మోసపోయారు. ఇలాంటి విద్యా సంస్థలు అక్కడి ప్రభుత్వాల అనుమతి తీసుకోకుండా పనిచేస్తుంటాయి. దీంతో యాజమాన్యాలపై సంబంధిత దేశంలోని అధికారులు చర్యలు తీసుకుంటే.. మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి.
విదేశాల్లో ఉండే ఇలాంటి నకిలీ యూనివర్సిటీలు, విద్యా సంస్థల గురించి భారత ఎంబసీలు ఎప్పటికప్పుడు విద్యార్థులను హెచ్చరిస్తూ.. సలహాలు, సూచనలు జారీ చేస్తాయి. ఇతర దేశాల్లో పనిచేసే కొన్ని భారతీయ సంస్థలు సైతం విద్యార్థులకు సేవలందిస్తాయి. వారి వెబ్‌సైట్‌లో అసలైన విద్యాసంస్థల వివరాలను పొందుపరుస్తున్నాయి. మన అధికారులు అక్కడి విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కూడా సందర్శిస్తూ.. భారతీయ విద్యార్థుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి అన్ని రకాల సేవలను GISP పోర్టల్‌లో కేంద్రీకృతం చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం పనిచేస్తోంది. అన్ని దేశాల్లోని విద్యా సంస్థల సమాచారం ఈ ప్లాట్‌ఫాం ద్వారా లభిస్తుంది.
GISP ఏర్పాటుకు ముందు విదేశాంగ శాఖ అధికారులు.. కేంద్ర విద్యా శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. వంటి సంస్థలను సంప్రదించింది. విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల డేటాబేస్‌ను రూపొందించడానికి 2015లో "స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్"ను విదేశాంగ శాఖ అభివృద్ధి చేసింది. ఇందులో భారత విద్యార్థులు విదేశాల్లో చదువుతున్న కోర్సులు, విద్యా సంస్థ, విదేశాల్లో వారు ఉంటున్న ప్రాంతం చిరునామా, కోర్సు వ్యవధి.. వంటి విషయాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు నకిలీ యూనివర్సిటీలు, ఫేక్ ఏజెంట్లు, విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు పోర్టల్‌ను సైతం రూపొందించారు. అయితే ఈ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జీఐఎస్‌పీ పోర్టల్‌ను భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
No comments:
Post a Comment