Saturday, June 26, 2021

తెలకపల్లి రవి : రేవంత్‌ రెడ్డికి పిసిసి పీఠం, ఇంటా బయిటా సవాళ్లు

హైదరాబాద్ : 27/06/2021

తెలకపల్లి రవి : రేవంత్‌ రెడ్డికి పిసిసి పీఠం, ఇంటా బయిటా సవాళ్లు

tv మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

తెలంగాణ పిసిసి అద్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి నియామకం కాంగ్రెస్‌లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ముఖ్య పరిణామం అవుతుంది. ఎడతెగని వివాదాలను అంతర్గత విభేదాలను పక్కనపెట్టి అధిష్టానం రేవంత్‌ను ఎంపిక చేయడంలో ఆయనపై విశ్వాసంతో పాటు ఆ పార్టీ పరిస్తితి కూడా అర్థమవుతుంది. ఎప్పటినుంచో వున్న పిసిపి పీఠం ఆశిస్తున్న హేమాహేమీలను కాదని, గత ఎన్నికల ముందు టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌నే ఎంచుకున్నారంటే కెసిఆర్‌ ప్రభుత్వాన్ని ఢీకొనగల సత్తా ఆయనకే వుందని నాయకత్వం భావించిందన్న మాట. బండిసంజయ్‌ అద్యక్షుడైనా దుబ్బాక జిహెచ్‌ఎంసి ఫలితాలతో దూకుడుగా వున్న బిజెపి ముందు కాంగ్రెస్‌ నిలవలేకపోతున్నదనే భావన పెరుగుతున్న నేపథ్యం కూడా వారి సోనియా గాంధీ రాహుల్‌గాంధీల దృష్టిలో వుండొచ్చు. సామాజిక కోణంలో రెడ్డివర్గానికి చెందిన వారినే నియమించాలంటే ఎందరో పోటీ పడుతున్నారు. కాని ఆర్థిక వనరుల సమీకరణ, సమస్యలపై చొరవతో రంగంలోకి దిగడం ప్రభుత్వాన్ని తీవ్రభాషలో ఢీకొనడం ఇవన్నీఆయనకు అదనపు అర్హతలై వుండాలి. ఆయనతో పాటు అయిదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లనూ పలువురు ఉపాద్యక్షులు కమిటీల బాధ్యులను నియమించారు గనక వారందరినీ కలుపుకొని పావలసినభాధ్యత భారం ఆయనపై వుంటాయి.

టికాంగ్రెస్‌లో యువ నాయకులు క్రియాశీల ప్రతినిధులు అనేకమంది రేవంత్‌నే కోరుతున్నా అధిష్టానం సమయం తీసుకుంది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేసి చాలా కాలం గడిచినా ఒక దశలో జీవన్‌రెడ్డిని నియమించినట్టే వార్తలు వచ్చినా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పేరిట నిలిపివేసి ఈ నిర్నయం ప్రకటించింది.ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకులంతా పూర్తిగా ఆమోదిస్తారని కాదు గాని ఒకసారి ప్రకటన వెలువడ్డాక వారికి వేరే గత్యంతరం వుండదు. ఏడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాంగ్రెస్‌ నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి కారణంకూడా రేవంత్‌ రానుండడమేనని ఒక భావన బలంగావుంది. ఓటుకు నోటు కేసుతో సహా చాలా విషయాల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చాలా అంశాల్లోరేవంత్‌పై కేంద్రీకరించడం గత ఎన్నికల ముందు ఐటి దాడులు,ఆయన కూడా అదే స్థాయిలో కెటిఆర్‌ భూముల వంటి అంశాలపై కేసులు వేయడం ఘర్షణను పెంచింది. ఇప్పుడు కూడా ఇవన్నీ కొనసాగుతున్నాయి.

టిడిపిలో వుండగా చంద్రబాబుకు బాగా సన్నిహితుడైన రేవంత్‌ కాంగ్రెస్‌లోకి వచ్చాక కూడా ఆ పాత శక్తుల అండదండలు కాపాడుకుంటున్నారు. మీడియాలోనూ ఒక భాగం ఆయనకు బాగా మద్దతునిస్తుంది. మరోవైపున పార్టీ సీనియర్ల సహకారం పైన చెప్పిన కేసుల ప్రభావం దేశవ్యాపితంగా కాంగ్రెస్‌ బలహీనపడుతున్న స్తితి ఇవన్నీ ఆయన ముందున్న సవాళ్లు అవుతాయి. ఎక్కువ మందిని కలుపునిపోవడం, సంయమనంతో అడుగులేయడంపై ఆయన భవిష్యత్‌ గమనం ఆధారపడివుంటుంది. టిడిపిలో దక్కని అద్యక్ష పదవి కాంగ్రెస్‌లో దక్కించుకున్న రేవంత్‌ మారిన దేశ రాష్ట్ర రాజకీయ పరిస్తితిలో ఎలా నెట్టుకువస్తారో చూడాల్సిందే.

No comments:

Post a Comment