హైదరాబాద్ : 29/06/2021
నేడు వర్చువల్ లో బల్దియా కౌన్సిల్ మీటింగ్.. బీజేపీ హాజరయ్యేనా..?
చాలా రోజుల తర్వాత జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదించనుంది. అయితే ఈ వర్చువల్ సమావేశంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రత్యక్ష సమావేశాలే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు, మంత్రుల టూర్లకు లేని అభ్యంతరాలు.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు అడ్డొచ్చాయా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆన్ లైన్ మీటింగ్ అంటే.. జాయిన్ అయ్యామా.. విన్నామా.. వెళ్లామా అన్నట్లుగానే ఉంటుంది. ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉండదు. అదే కరోనా రూల్స్ పాటిస్తూ మీటింగ్ పెడితే సమస్యలపై చర్చించ వచ్చనేది బీజేపీ నేతల వాదన. వర్చువల్ వల్ల ఉపయోగం ఉండదని అంటున్నారు. అయితే అధికారులు మాత్రం 150 మంది కార్పొరేటర్లు ఆన్ లైన్ లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు.
గ్రేటర్ ఎన్నికలకు ముందే అప్పటి స్టాండింగ్ కమిటీ రూ.5,600 కోట్ల బడ్జెట్ ను ఆమోదించింది. జనరల్ బాడీలోనూ ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. కరోనా కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి పక్కాగా కౌన్సిల్ మీటింగ్ పెట్టి దాన్ని ఆమోదింపజేయాలని చూస్తున్నారు. అందుకే వర్చువల్ మీటింగ్ పెట్టారు. అయితే దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది.
నిజానికి హైదరాబాద్ సమస్యలపై చిట్టా ప్రిపేర్ చేశారు బీజేపీ నేతలు. కౌన్సిల్ మీటింగ్ లో ప్రశ్నల వర్షం కురిపించాలని ప్లాన్ చేసుకున్నారు. పక్కాగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు వర్చువల్ మీటింగ్ అనేసరికి.. ఏం చేయలేని పరిస్థితి. అందుకే ఈ సమావేశం ప్రత్యక్షంగా జరపాలని డిమాండ్ చేస్తున్నారు. వర్చువల్ మీటింగే జరుగుతుందని మేయర్ విజయలక్ష్మి స్పష్టంచేశారు. డివిజన్లలో ఏవైనా సమస్యలుంటే.. తన దృష్టికి తీసుకురావాలని అన్ని పార్టీల కార్పొరేటర్లకు సూచిస్తున్నారామె
No comments:
Post a Comment