బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం: కరోనావైరస్‌తో బాల కార్మికులు ఇంకా పెరుగుతారా?
కరోనావైరస్ వ్యాప్తి నడుమ పతనమైన ఆర్థిక వ్యవస్థ మరింత మంది పిల్లల్ని కార్మికులుగా మార్చే ముప్పుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) హెచ్చరిస్తోంది.
పిల్లల నుంచి బాల్యాన్ని, వారి గౌరవాన్ని దోపిడీ చేయకుండా అడ్డుకునే బాల కార్మిక చట్టాలను ఆర్థిక ఇబ్బందులు నీరు గార్చే ముప్పుందని, ఇది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి చాలా ప్రమాదకరమని ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవంనాడు ఐఎల్‌వో ఓ నివేదిక విడుదల చేసింది.
"పిల్లలను పనుల్లో పెట్టకుండా అడ్డుకునే నిబంధనలు, చట్టాలకు చాలా దేశాలు కోరలు పీకేస్తున్నాయని మేం ఆందోళన పడుతున్నాం." అని ఐఎల్‌వోకు చెందిన బాల కార్మిక వ్యవస్థ నిపుణుడు బెంజమిన్ స్మిత్.. బీబీసీకి వివరించారు.
"ఇప్పటివరకూ సాధించిన విజయాలను కోవిడ్-19 పేరుతో తుంగలోకి తొక్కేయకూడదు. ఆ దిశగా పడుతున్న అడుగులను సహించేది లేదు"
ఎంత మంది పిల్లలు పనిచేస్తున్నారు?
బాల కార్మిక వ్యవస్థను ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనగా ఐఎల్‌వో నిర్వచించింది. కరోనావైరస్ వ్యాప్తి నడుమ చాలా కుటుంబాలు పేదరికంలో పడటంతో బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది.
ప్రస్తుతం 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 15.2 కోట్ల మంది పిల్లలను బాల కార్మిక వ్యవస్థ పీడిస్తోందని సంస్థ వెల్లడించిన తాజా గణాంకాలు చెబుతున్నాయి.
వీరిలో సగం మంది అనారోగ్యకర పరిస్థితుల్లో ప్రమాదకర పనులు చేస్తున్నారు.
ఆఫ్రికాలో బాల కార్మికులు పనిచేయడం సర్వసాధారణం. 2016 అంచనాల ప్రకారం.. ఇక్కడ ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు బాల కార్మికులున్నారు.
బాల కార్మికుల్లో ఎక్కువమంది కుటుంబ వృత్తులు, వ్యాపారాల్లోనే ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్నారని ఐఎల్‌వో వివరించింది. దీన్ని అడ్డుకునేందుకు ఐరాస తీసుకొచ్చిన నిబంధనలను 180కిపైగా దేశాలు ఆమోదించాయి.
2025నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోనూ నిర్దేశించారు. ఆ దిశగా ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయని బాలల హక్కులను పర్యవేక్షిస్తున్న సంస్థలు చెబుతున్నాయి.
అయితే, కరోనావైరస్ వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం అవుతున్న కుటుంబాలపై ఆర్థికంగా చాలా ఒత్తిడి పడుతోందని స్మిత్ ఆందోళన వ్యక్తంచేశారు.
"కోవిడ్-19 వల్ల ఆర్థిక వ్యవస్థలు కుదేలవడంతో బాల కార్మిక వ్యవస్థపైనున్న నిషేధాన్ని ఎత్తివేయాలనే వాదన బలడపడుతోంది. ఫలితంగా ప్రపంచ దేశాలు చట్టాలను నీరుగార్చే ముప్పుంది."
"అడుగులు సరైన దిశలో పడకపోతే.. ఓ తరాన్ని మనం కోల్పోతాం అని ఓ నిపుణుడు వ్యాఖ్యానించారు."
"2000 నుంచి 2016 మధ్య ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య 38 శాతం వరకు తగ్గింది. అంటే పనిచేస్తున్న పిల్లల సంఖ్య 9.4 కోట్ల మంది వరకూ తగ్గింది."
అయితే కొన్ని దేశాలు వ్యతిరేక దిశలోనూ నడుస్తున్నాయి. 2014లో కార్మికులకు ఉండాల్సిన కనీస వయసును బొలివియా 14 నుంచి పదేళ్లకు తగ్గించింది. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. మానవ హక్కుల సంస్థలు తీవ్రమైన విమర్శనాస్త్రాలూ సంధించాయి.
మరికొన్ని దేశాలు కూడా బాల కార్మిక వ్యవస్థను చట్టబద్ధం చేశాయి. అయితే అక్కడ బాల కార్మికులు పెద్ద సంఖ్యలో లేరు.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ నిషేధం విధించాల్సిన అవసరం ఏముందని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. "ఈ నిషేధం ప్రమాదకరం, అనవసరం" అని అంతర్జాతీయ విద్యావేత్తల బృందమొకటి వ్యాఖ్యానించింది.
వారి వాదన ఏమిటి?
పిల్లలకు అన్నిసార్లూ పని చేటు చేస్తుందని అనుకోకూడదని కొందరు అంతర్జాతీయ విద్యావేత్తలు అంటున్నారు. వారు అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీకి చెందిన మాజీ సెనేటర్ టామ్ హార్కిన్ కేసును ప్రస్తావిస్తుంటారు.
బంగ్లాదేశ్‌లో ఓ సంస్థ బాల కార్మికుల సాయంతో దుస్తులను తయారీ చేస్తుందని 1993లో టీవీ ఛానెల్ బయటపెట్టింది. ఈ సంస్థకు దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌తో వ్యాపార సంబంధాలున్నాయి. దీంతో ఇలా బాల కార్మికులతో తయారు చేయించే ఎలాంటి వస్తువునూ దిగుమతి చేసుకోకూడదని హార్కిన్ ఓ బిల్లు తీసుకొచ్చారు.
పదేళ్లపాటు చాలా ప్రయత్నాలు చేసినా ఈ బిల్లు ఆమోదం పొందలేదు. అయితే, బిల్లు ప్రతిపాదించిన వెంటనే బంగ్లాదేశ్‌లో చాలా సంస్థలు కార్మికులను విధుల నుంచి తొలగించాయి.
దాదాపు 50,000 మంది పిల్లలు ఆనాడు రోడ్డున పడ్డారని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ప్రొఫెసర్ జో బోయ్‌డెన్ చెప్పారు.
"బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశంతో హార్కిన్స్ బిల్లును తీసుకొచ్చారు. పనులు చేయడం మాన్పిస్తే.. పిల్లలు పాఠశాలకు వెళ్తారని అనుకున్నారు. అయితే ఆ తర్వాత చేపట్టిన ఓ అధ్యయనంలో.. అక్కడ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలలో చేరినట్లు కనిపించలేదని తేలింది." అని 2018లో బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బోయ్‌డెన్ వివరించారు.
"చాలామంది పిల్లలు వ్యభిచారం, ఇటుకల తయారీ లాంటి ప్రమాదకర పనుల్లో అడుగుపెట్టారు. ఈ పనులతో పోలిస్తే బట్టల తయారీ పరిశ్రమల్లో పని చేయడం చాలా మేలు." అని ఆమె వ్యాఖ్యానించారు. ఇథియోపియా, భారత్, పెరు, వియత్నాంలలో బాల కార్మిక వ్యవస్థపై ఆమె వరుస అధ్యయనాలు చేపట్టారు.
"పిల్లలు రోజువారి జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులకు చట్టాలు సమాధానాలు చెప్పలేవు" అని ఆమె నమ్ముతున్నారు.
పేద దేశాల్లో మేలు జరుగుతోందా?
చాలా మంది చదువు, పనిని కలిపి చూస్తారని బోయ్‌డెన్ వివరించారు. "పనిచేస్తే వచ్చే డబ్బును ఇంట్లో ఇవ్వడంతోపాటు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ కొనుక్కోవడానికి ఉపయోగిస్తారు."
మా అధ్యయనాల్లో పాల్గొన్న కొంత మంది విద్యార్థులు పనిచేయడానికీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని ఆమె వివరించారు.
"పేద దేశాల్లో పనిచేస్తున్న పిల్లలు.. చాలా మంది నెమ్మదిగా పనుల్లోకి అడుగుపెడుతున్నారు. వారిలో చాలా మందికి మంచి నైపుణ్యాలున్నాయి" అని ఆమె వివరించారు.
"డబ్బులు ఎలా జాగ్రత్తగా ఖర్చుపెట్టాలో వారికి తెలుసు. అంతేకాదు వస్తువుల్ని విక్రయించడంలోనూ వారు నైపుణ్యం సాధించారు."
బాల కార్మిక వ్యవస్థపైనున్న నిషేధాన్ని ఎత్తివేయాలని వాదిస్తున్నవారిలో కొందరు బాల కార్మికులు ఉన్నారు. బాల కార్మిక చట్టాలు తమ హక్కులను కాల రాస్తున్నాయని వారు వాదిస్తున్నారు.
"అలా చేయడంలో అర్థంలేదు"
అయితే, బాల కార్మిక వ్యవస్థకు సంబంధించిన ఏ నిబంధనా నిరుగారకూడదని ఐఎల్‌వోకు చెందిన బెంజమిన్ స్మిత్ అంటున్నారు.
ప్రపంచంలోని ఒక్క చిన్నారి కూడా బాల కార్మిక వ్యవస్థ పాలిట పడకుండా అడ్డుకోవడం అసాధ్యమని ఆయన అంగీకరించారు. మరోవైపు పేద దేశాల్లో ఇది చిన్నారులకు జీవన ఆధారం కావొచ్చని కూడా అన్నారు. అయితే, ప్రస్తుత చట్టాల్లో మాత్రం ఎలాంటి మార్పులూ చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
"కొంత మంది చిన్నారులు తప్పక పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని మాకు తెలుసు. వారు పనిచేస్తేనే వారి కుటుంబం కడుపు నిండుతుంది. ఆ విషయాన్ని మేమూ ఒప్పుకుంటున్నాం."
"అయితే వారి కోసమని ప్రపంచంలో మిగతా చిన్నారులకు రక్షణ కల్పిస్తున్న చట్టాలను నీరు గార్చకూడదు."
"బాల కార్మిక వ్యవస్థ పేదరికాన్ని మరింత పెంచుతుంది. పిల్లల బాల్యాన్నీ దోపిడీ చేస్తుంది."
No comments:
Post a Comment