హైదరాబాద్ : 30/06/2021
ఉత్తమ పీఎస్‌గా తాడూరు ఠాణా
- బెస్ట్ పోలీస్‌స్టేషన్లు, సిబ్బందికి పురస్కారాలు
- డీజీపీ మహేందర్‌రెడ్డి చేతులమీదుగా అందజేత
హైదరాబాద్,(నమస్తే తెలంగాణ): విధుల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్‌స్టేషన్లు, పోలీస్ సిబ్బందికి డీజీపీ మహేందర్‌రెడ్డి పురస్కారాలు అందజేశారు. ఫంక్షనల్ వర్టికల్ విధానం అమలులో బెస్ట్ పోలీస్‌స్టేషన్లలో నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు ఠాణా తొలిస్థానంలో, కోదాడ టౌన్ పోలీస్‌స్టేషన్ రెండు, రామగుండం పోలీస్‌స్టేషన్ మూడు, అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఆయా ఠాణాల ఎస్‌హెచ్‌వోలకు డీజీపీ మంగళవారం ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉత్తమంగా పనిచేసిన 223 మంది సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌కమిషనర్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి శాంతిభద్రతలు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సైబర్ నేర పరిశోధనలో సిబ్బంది శిక్షణ కోసం రూపొందించిన ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సైబర్ భద్రత మన బాధ్యత
భవిష్యత్తులో సైబర్ నేరాల ముప్పే ఎక్కువగా ఉండబోతున్నందున సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మూడో సైబర్ కాంగ్రెస్‌ను మంగళవారం ఆయన వెబినార్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 1,650 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,300 మంది విద్యార్థులు, 1,650 మంది టీచర్లను సైబర్ అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. వీరందరికీ పదినెలలపాటు సైబర్ సేఫ్టీ అంశాలపై శిక్షణ ఇస్తారు. సైబ్‌హర్-3 పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ.. సైబర్ సేఫ్టీ శిక్షణలో కీలకంగా పనిచేస్తున్న అడిషనల్ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి, సహకారం అందిస్తున్న విద్యాశాఖ ఉన్నతాధికారులను అభినందించారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, యంగిస్థాన్ ఫౌండర్ డైరెక్టర్ అరుణ్ డేనియల్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్‌టాండన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment