Friday, June 18, 2021

నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై 209 కేసులు


హైదరాబాద్ : 19/06/2021

నకిలీ విశ్వరూపం!


ABN ఆంధ్రజ్యోతి మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

  • నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై 209 కేసులు
  • 320 మంది అరెస్టు.. 4 లైసెన్సుల సస్పెన్షన్‌
  • అయినా కుప్పలుగా మార్కెట్లోకి నకిలీ విత్తనాలు
  • హైబ్రిడ్‌ పేరుతో సాధారణ వెరైటీల విత్తనాలు

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు నకిలీ విత్తన విక్రేతలపై దాడులు చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన విత్తనాలను సీజ్‌ చేస్తున్నారు. అయినా, నకిలీ దందా ఆగడం లేదు. రాష్ట్రంలో నకిలీ విశ్వరూపం ఏ స్థాయిలో ఉందంటే.. ఇప్పటి వరకూ 3,091 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, 20,562 క్వింటాళ్ల ఇతర విత్తనాలను పట్టుకున్నారు. 1,004 క్వింటాళ్ల పత్తి, 5,509 క్వింటాళ్ల ఇతర విత్తనాలను సీజ్‌ చేశారు. మరో మాటలో చెప్పాలంటే, ఇప్పటి వరకూ రూ.76.30 కోట్ల విలువైన 23,572 క్వింటాళ్ల విత్తనాలను పట్టుకున్నారు. రూ.7 కోట్ల విలువైన 3,600 క్వింటాళ్ల విత్తనాలను సీజ్‌ చేశారు. ఇప్పటికే 209 కేసులు నమోదు చేసి, 320 మందిని అరెస్టు చేశారు. నలుగురి లైసెన్సులను సస్పెండ్‌ చేశారు. అయినా, నకిలీలలు ఆగడం లేదు.


జర్మినేషన్‌, జెనెటిక్‌ ప్యూరిటీ కీలకం

వానాకాలం సాగు నేపథ్యంలో.. కొంగొత్త పేర్లు, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లు, దొంగ లేబుళ్లతో వ్యాపారులు రైతులను నయవంచనకు గురి చేస్తున్నారు. సాధారణ వెరైటీలనే హైబ్రిడ్‌ పేరుతో అంటగడుతున్నారు. జెర్మినేషన్‌ పెద్దగా లేకపోయినా.. జెనెటిక్‌ ప్యూరిటీ తక్కువ ఉన్నా.. రైతులకు విక్రయిస్తున్నారు. నిజానికి, సాధారణ పత్తి విత్తనాలైనా, హైబ్రిడ్‌ విత్తనాలైనా జెనెటిక్‌ ప్యూరిటీ 90ు ఉండాలి. జెర్మినేషన్‌ 75ు తప్పనిసరి. ఇతర విత్తనాలకు 98ు ఫిజికల్‌ ప్యూరిటీ, 90ు జెనెటిక్‌ ప్యూరిటీ, 75% జెర్మినేషన్‌ ఉండాలి. కానీ, నిషేధిత బీటీ-3 విత్తనాలు, జెర్మినేషన్‌ ఫెయిల్యూర్‌ అయిన విత్తనాలను అమ్మేస్తున్నారు. పత్తి గింజల క్రయ విక్రయాలకు 100 నుంచి 120 కంపెనీలకు లైసెన్సులు ఇచ్చారు. వీటికి అనుబంధ కంపెనీలైతే పుట్టగొడుగుల్లా ఉన్నాయి. తెలంగాణతోపాటు.. కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, ఏపీకి చెందిన పలు కంపెనీలు సీడ్‌ బిజినెస్‌ చేస్తున్నాయి. మిర్చి విత్తనాలకైతే నిర్ణీత ధర అంటూ ఏదీ లేదు. సుమారు 20 కంపెనీలు ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తున్నాయి.

 

నీలి రంగు ట్యాగ్‌ ట్రూత్‌ఫుల్‌ సీడ్‌

సాధారణంగా నాలుగు రకాల విత్తనాలు మార్కెట్లో ఉంటాయి. తొలుత శాస్త్రవేత్తలు న్యూక్లియస్‌ సీడ్‌ తయారు చేస్తారు. వాటి నుంచి బ్రీడర్‌ సీడ్‌, ఫౌండేషన్‌ సీడ్‌, సర్టిఫైడ్‌ సీడ్‌ లేదా ట్రూత్‌ఫుల్‌ సీడ్‌ ఉత్పత్తి చేస్తారు. బ్రీడర్‌ సీడ్‌ బ్యాగు బంగారు-పసుపు రంగులో ఉంటుంది. ఫౌండేషన్‌ సీడ్‌కు తెలుపు రంగు ట్యాగ్‌ ఉంటుంది. ట్రూత్‌ఫుల్‌ సీడ్‌కు లేత ఆకుపచ్చ రంగు లేబుల్‌ ఉంటుంది. దీనిని సర్టిఫై చేస్తే ఆకుపచ్చతోపాటు నీలిరంగు ట్యాగ్‌ వేస్తారు. ట్యాగ్‌ నంబర్‌, క్రాప్‌ నంబర్‌, వెరైటీ, లేబుల్‌, లాట్‌ నంబర్‌, బరువు, ప్యూరిటీ శాతం, తేమ శాతం, జెర్మినేషన్‌ శాతం.. ఇలా అన్ని వివరాలు తప్పనిసరిగా ఉండాలి. విక్రయించే వ్యాపారి దుకాణం ముందు స్టాక్‌ బోర్డు, దానిపై స్టాక్‌ వివరాలు రాయాలి. ప్రతి రోజు సీడ్‌ ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌, క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ వివరాలు సమగ్రంగా ఉండాలి. ఈ నిబంధనలేవీ పాటించకుండానే రాష్ట్రంలో విత్తన విక్రయాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment