Wednesday, June 9, 2021

ప్ర‌ధాని మోడీకి జ‌ర్న‌లిస్ట్ ర‌ఘు భార్య లేఖ‌

హైదరాబాద్ : 09/06/2021

Q News సౌజన్యంతో (తీన్మార్ మల్లన్న)

ప్ర‌ధాని మోడీకి జ‌ర్న‌లిస్ట్ ర‌ఘు భార్య లేఖ‌
మాన్యశ్రీ నరేంద్రమోదీజీ,

గౌరవనీయ భారత ప్రధానమంత్రి, న్యూఢిల్లీ

ఆదరణీయ మోదీజీ,

విషయం: నా భర్త రఘు గంజి, జర్నలిస్ట్ కిడ్నాప్ మరియు హత్యాయత్నం గురించి
…….
జర్నలిస్ట్ అయిన నా భర్త రఘు గంజి ని, జూన్ 3వ తేదీన కొందరు గుర్తు తెలియని దుండగులు హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతం నుంచి బలవంతంగా అపహరించారు.
పట్టపగలే అందరూ చూస్తుండగానే ఆ దుండగులు నా భర్తను దౌర్జన్యంగా లాక్కెళ్లి ఒక కారులోకి తోసేశారు. అంతేగాకుండా ముఖానికి ముసుగేసి కాళ్లూ చేతులూ బంధించారు.
కేవలం సెకన్ల వ్యవధిలోనే రఘును కిడ్నాప్ చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తులు, అంతే వేగంతో కారును మల్కాజ్ గిరి ప్రాంతం నుంచి వేరే చోటుకు తీసుకెళ్లారు. కొద్దిసేపట్లోనే రఘును మరో కారులోకి తరలించారు. నల్గొండ జిల్లా పోలీసుల ప్రోద్బలంతోనే కిడ్నాపర్లు ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు ఆ తర్వాత అర్థమైంది.

అదృష్టవశాత్తూ ఆ సమయంలో, ఆ చుట్టుపక్కలే వున్న మల్కాజ్ గిరి స్థానికులు తక్షణమే స్పందించటంతో రఘుకు పెనుముప్పు తప్పింది. స్థానికుల సమాచారంతో రఘు కిడ్నాప్ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో కంగుతిన్న నల్గొండ పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో నా భర్తను అదేరోజు సాయంత్రం హుజూర్ నగర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాల్సి వచ్చింది.
( కిడ్నాప్ నకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు ఈ దురాగతాన్ని కళ్లకు కడతాయని, ఈ విజ్ఞప్తికి ఆ దృశ్యాలు జతచేశాను)
ఇక హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వెళ్లే దారిలో కిడ్నాపర్లు రఘును పదేపదే కొన్ని విషయాలపై తీవ్రంగా బెదిరించటం జరిగింది. వాటిలో ప్రధానమైంది ఇకపై ఎప్పుడూ తెలంగాణలోని భూఆక్రమణలకు సంబధించిన వార్తలు కవర్ చేయొద్దనటం, అంతేకాదు రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న పెద్దలు, వారి అడుగులకు మడుగులొత్తే వ్యక్తుల ప్రోద్బలంతో… ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతూ పోతున్న వేల కోట్ల ప్రాజెక్టుల అక్రమాలపై ఇకపై కథనాలిస్తే ప్రాణాలు దక్కవంటూ హెచ్చరించారు.

నా భర్తను ప్రమాదంలోకి నెట్టిన పరిశోధనాత్మక కథనాలివే :

హైదరాబాద్ లో చట్ట విరుద్దంగా ఆక్రమించిన భూములకు సంబంధించి ప్రధానంగా.. పుప్పాల గూడలో వేల ఎకరాల నిర్వాసితుల భూముల ఆక్రమణ, కూకట్ పల్లి ప్రాంతంలోని ఐడిపిఎల్/ హిందూజా/ గల్ఫ్ ఆయిల్ భూముల్లో 500 ఎకరాల దురాక్రమణ, హైదరాబాద్ హైటెక్ సిటీలో ఐకియా సమీపంలో 43 ఎకరాల ఆక్రమణ, వివిధ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలు దోపిడీ. వీటితో పాటు కొవిడ్ పేరుతో సామాన్యుల నుంచి లక్షల్లో ఫీజులు గుంజి, వారిని పీల్చి పిప్పి చేసిన వ్యవహారంపై రఘు చేసిన పరిశోధన. ఒక్కమాటలో చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి, అధికార దుర్వినియోగానికి రఘు కిడ్నాప్ ఉదంతం చిన్న ఉదాహరణ మాత్రమే.

నా భర్తను హుజూర్ నగర్ జైల్లో పెట్టడంతో ఆగని పోలీసులు, ఆ తర్వాత మరికొన్ని అక్రమ కేసులు బనాయించి అతన్ని చెప్పాపెట్టకుండా నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా, నా భర్తను జైల్లోనే వుంచేందుకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై అతన్ని నోరు విప్పకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అర్థమవుతోంది.
నా భర్తపై వీళ్లు చేసే ఆరోపణలు సక్రమమే అయితే, అతను అందించిన కథనాలపై పరువునష్టం దావా వేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా లేనిపోని క్రిమినల్ కేసుల్లో ఇరికించటం, పైగా బెయిల్ రాని విధంగా సంబంధంలేని సెక్షన్లు పెట్టడం గమనిస్తే, ఒక్క నా భర్త మాత్రమే కాదు ఇకపై ఈ రాష్ట్రంలో ఏ జర్నలిస్ట్ లేదా ఏ పౌరుడూ నిజం మాట్లాడే ధైర్యం చేయకుండా భయభ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోందనేది సుస్పష్టం.

జర్నలిస్టులు మాత్రమే కాదు, సాధారణ పౌరులకు సైతం కనీస పౌరహక్కులు లేని తెలంగాణ రాష్ట్రంలో, నిజాలను నిర్భయంగా చెప్పే నా భర్త రఘు ప్రాణానికి రక్షణ లేదనిపిస్తోంది. భూకబ్జాకోరులు, బడా కాంట్రాక్టర్లు, ఇంకా వీళ్ల కొమ్ము కాసే పాలకపక్షంలోని కొన్ని పెద్దతలకాయలు .. వీళ్లందరి ఒక అక్రమ కలయిక తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. అందుకు ఇవాళ రఘుకు పట్టిన గతే ఒక ప్రత్యక్ష ఉదాహరణ.

ప్రజల పక్షాన గళం వినిపించే రఘు గంజి లాంటి జర్నలిస్ట్ లకు రక్షణ కల్పించాలని, ముఖ్యంగా అక్రమ కేసుల్లో అనవసరంగా జైలుపాలైన రఘుకు తక్షణం విముక్తి కలిగేలా అవసరమైన చర్యలను వేగంగా తీసుకోవాలని తమరిని వేడుకుంటున్నాను.

గౌరవ ప్రధానిగా మీరు తీసుకునే ఈ చర్యతో తెలంగాణలో నియంతృత్వ ధోరణులకు తెరపడుతుందనే గట్టి నమ్మకం, ఆశ మాకున్నాయి. కేవలం రఘు విడుదల మాత్రమే కాకుండా, ఇకపై తెలంగాణలో జర్నలిస్టులు జనం పక్షాన నిజం మాట్లాడే పరిస్థితులు కల్పిస్తారని, అధికార దుర్వినియోగాన్ని అరికట్టి, తెలంగాణలో పౌరహక్కులకు ఊపిరి పోస్తారని ఆకాంక్షిస్తూ, విన్నవిస్తున్నాను.

కృతజ్ఞతలతో

లక్ష్మీ ప్రవీణ
 

No comments:

Post a Comment