హైదరాబాద్ : 06/06/2021
మిక్సోపతి’కి అనుమతి లేదు : ఐఎంఏ
డెహ్రాడూన్ : తేలిక పాటి, లక్షణాలు లేని రోగులకు పంపిణీ చేసే కొవిడ్-19 కిట్‌లో పతంజలి తయారు చేసిన కరోనిల్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేర్చింది. ఈ నిర్ణయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అల్లోపతి మందులు ఉండే కరోనా కిట్‌లో ఆయుర్వేదానికి చెందిన ‘కరోనిల్’ను చేర్చడంతో అది ‘మిక్సోపతి’ అవుతుందని ఎద్దేవా చేసింది. కరోనిల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించలేదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కేంద్రం మార్గదర్శకాల్లో సైతం ఆయుర్వేద ఔషధాలను చర్చలేదని చెప్పింది.
గతంలో సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల్లో అల్లోపతి, ఆయుర్వేదాన్ని కలుపడం ఆమోదయోగ్యం కాదని చెప్పిందని పేర్కొంది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ కోరింది. ఇదిలా ఉండగా.. ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న స్వల్ప, తేలిక పాటి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులకు ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ కొవిడ్ కిట్‌ను అందజేస్తోంది. కిట్‌లో థర్మా మీటర్, పారాసెటమాల్ మాత్రలు, విటమిన్ డీ, జింక్, ఐవర్ మెక్టిన్ మాత్రలు ఉన్నాయి. ఇటీవల అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి నుంచి బాబారాందేవ్, ఐఎంఏ మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. ఈ క్రమంలో కరోనిల్‌ను కొవిడ్ కిట్‌లో రోగులకు పంపిణీ చేయడంపై ఐఎంఏ మండిపడుతున్నది.
No comments:
Post a Comment