హైదరాబాద్ : 25/06/2021
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలి: అజిత్ దోవల్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. తజికిస్తాన్ రాజధాని డషంబేలో ఎనిమిది దేశాల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా దీటుగా ఎదుర్కోవాలన్నారు. అందుకోసం ఎస్‌సీవో, యాంటీ టెర్రర్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరాలని సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలన్న దోవల్.. ఉగ్రవాద దాడుల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌లో తరచూ దాడులకు పాల్పడే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి దోవల్ ఒక కార్యాచరణను ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
No comments:
Post a Comment