హైదరాబాద్ : 08/06/2021
జర్నలిస్టు రఘుది కిడ్నాపే- ఇదిగో సాక్ష్యం- డీజీపీ గారూ ఇప్పుడేమంటారు?
జర్నలిస్ట్ రఘు అరెస్ట్ వ్యవహరానికి ముందు భారీ కుట్రే జరిగిందా…? అధిక ఫీజుల స్టోరీలపై రఘుపై ఆగ్రహంగా ఉన్న మెడికల్ మాఫియా, కొంత మంది ఎమ్మెల్యేలు కలిసి రఘును అంతమొందించేందుకు కిడ్నాప్ కు ప్రయత్నించారా…? రఘును ఎత్తుకెళ్లిన ఏపీకి చెందిన ఫ్యాన్సీ నెంబర్ కార్లు ఎవరివి…? రఘు కిడ్నాప్ వ్యవహరం కాస్త ఆలస్యం అయినా తెలంగాణ బార్డర్ దాటించే వారా…? కిడ్నాప్ వ్యవహరం బెడిసి కొట్టడంతోనే అరెస్ట్ చూపించారా…?
ఇప్పుడు ప్రశ్నలన్నింటికి రఘును కిడ్నాప్ చేసే సమయంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్ అవుననే సమాధానం ఇస్తోంది. జర్నలిస్టుగా రఘు ఏకకాలంలో మెడికల్ మాఫియా, ల్యాండ్ మాఫియాపై ఆధారాలతో సహ పోరాటం చేస్తున్నాడు. కరోనా కష్టకాలంలో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ ఉన్న ఆసుపత్రుల బండారాన్ని బయటపెట్టాడు. గిరిజనులు ఏం చేయగలరులే… అన్న ధీమాతో ఎమ్మెల్యేలు చేస్తున్న భూ ఆక్రమణలను, మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ భూ భాగోతాన్ని ప్రజల ముందుంచాడు. ఈ కథనాలు ఆపాలని బెదిరింపులు వచ్చినా రఘు వెనక్కి తగ్గలేదు. అందుకే రఘును అంతమొందించేందుకు కిడ్నాప్ కు తెరతీశారని ముందు నుండి రఘు సన్నిహిత జర్నలిస్టులు అనుమానిస్తున్నారు.
ఫ్యాన్సీ నెంబర్లున్న ఏపీకి చెందిన ప్రైవేటు కారుల్లో కిడ్నాప్?-
రెండు కార్లలో వచ్చిన నలుగురైదుగురు కిరాయి రౌడీలు… రోడ్డు పక్కన పండ్లు కొనుగోలు చేస్తున్న రఘును ఎత్తుకెళ్లారు. మొదట ఇద్దరు వ్యక్తులు వెనకనుండి వచ్చి రఘును కారెక్కించే ప్రయత్నం చేయగా, రఘు ప్రతిఘటించాడు. దీంతో మరో ఇద్దరు వచ్చి రఘును కారులోకి ఎక్కించి తీసుకెళ్లినట్లు సీసీటీవీలో క్లియర్ గా రికార్డు అయ్యింది. ఈ కిడ్నాప్ లో ఉపయోగించిన రెండు కార్లు ప్రైవేటువే కాగా, ఏపీకి చెందిన ఫ్యాన్సీ నెంబర్లున్న కార్లు.
ఉదయం 9.45నిమిషాలకు రఘును కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు. దీంతో రఘు కిడ్నాప్ పై జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఘాటుగా స్పందించారు. ప్రశ్నిస్తే చంపేస్తారా…? కిడ్నాప్ పై డీజీపీ సమాధానం చెప్పాలి, వెంటనే పోలీసులు కిడ్నాపర్ల చెర నుండి రఘును కాపాడాలి, రఘును ఎత్తుకెళ్లింది మెడికల్, భూ మాఫియాలో ఉన్న నేతలే అంటూ మండిపడ్డారు. ఒక్కసారిగా అలజడి రేగింది. జర్నలిస్టులంతా రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో మఠంపల్లి పోలీసులం 12.45నిమిషాలకు అరెస్ట్ చేశాం అంటూ రఘు భార్యకు సమాచారం ఇచ్చారు.
కిడ్నాపర్లు పోలీసులెప్పుడయ్యారు…?
తెలంగాణలో పోలీసులు కిరాయి గుండాల అవతారం ఎత్తారా…? లేదా కిరాయి గుండాలనే ఏర్పాటు చేసుకొని అరెస్టులు చేస్తున్నారా…? లేదా కిడ్నాపర్లు పోలీసులు అయ్యారా…? జర్నలిస్టు రఘు అరెస్ట్ సమయంలో బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ చూసిన ప్రతి ఒక్కరికి కలిగే ప్రశ్న ఇదే. రఘును కిడ్నాప్ చేస్తున్న సమయంలో అక్కడ ఎవరికీ పోలీస్ డ్రెస్ లేదు. పోలీసుల అధికారిక వాహనాలు లేవు. స్థానిక పోలీసులు కనిపించలేదు. ఫ్యాక్షనిస్టులు ఎత్తుకెళ్లినట్లు ఎత్తుకెళ్లారు. మఠం పల్లి పోలీసులు చెప్పిందే నిజం అయితే వారి అధికారిక వాహనాలు ఏమయ్యాయి, పోలీసు డ్రెస్సులు ఏమయ్యాయి, ప్రైవేటు వాహనాలు ఎవరిచ్చారు, రోడ్డుపై ఎందుకు ఎత్తుకెళ్లినట్లు అనే అనుమానాలు జర్నలిస్టుల్లో వ్యక్తం అవుతున్నాయి.
అయితే, కిడ్నాప్ ను నిశితంగా పరిశీలిస్తే… రఘును కిడ్నాప్ చేసింది అధికార నేతలున్న మాఫియానే అని, రఘును తెలంగాణ బార్డర్ దాటించే ప్రయత్నం చేశారని, కానీ ఈలోపు మీడియాలో రఘు కిడ్నాప్ వ్యవహరం రచ్చ రచ్చ కావటంతో చేసేదేమీ లేక తనపై ఉన్న పాత కేసులో అరెస్ట్ చూపించారని జర్నలిస్టులు అనుమానిస్తున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహరంపై డీజీపీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. డీజీపీ గారు… ఎత్తుకెళ్లింది కిడ్నాపర్లు కాదని చెప్పగలరా, వారు పోలీసులే అయితే ఎలా కిడ్నాప్ చేయాలో చూపించారా అని మండిపడుతున్నారు. మీరు అరెస్ట్ చేసింది నిజమే అయితే… ఇలా కూడా అరెస్ట్ చేయటం మీ రూల్ బుక్ లో ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఓ నిఖార్సైన జర్నలిస్టుపై మీ రాక్షస క్రీడ ఎంత వరకు సమంజసమో జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment