Friday, October 14, 2022

ఓయు విద్యార్థుల పిటిషన్ పై.... హైకోర్టులో విచారణ

*ఓయు విద్యార్థుల పిటిషన్ పై.... హైకోర్టులో విచారణ*

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టళ్లలో విద్యుత్, మంచినీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. పునరుద్ధరించకపోతే రేపు వర్సిటీ రిజిస్ట్రార్ హైకోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపింది.
ఓయూ హాస్టల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ''దసరా సెలవుల కోసం విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లి వచ్చేలోగా హాస్టళ్లలో విద్యుత్, మంచినీటి సరఫరా, మెస్ సుదపాయాన్ని నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సెలవులను ఈనెల 26వ తేదీ వరకు పొడిగించారు. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు హాస్టల్‌ వసతి లేకపోతే ఈనెల 27 నుంచి జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం కాలేరు'' అని విద్యార్థుల తరఫున న్యాయవాది సీహెచ్.రవికుమార్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం వర్సిటీ హాస్టళ్లలో వెంటనే విద్యుత్, మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

టీఆరెఎస్ కు బిగ్ షాక్....బీజేపీ లోకి బూర నర్సయ్య గౌడ్....?

*టీఆరెఎస్ కు బిగ్ షాక్....బీజేపీ లోకి బూర నర్సయ్య గౌడ్....?*

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది… టీఆర్ఎస్‌ కీలకంగా భావిస్తున్న మునుగోడు బైపోల్‌ సమయంలో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు మాజీ ఎంపీ, టీఆర్ఎస్‌ సీనియర్‌ నేత బూర నర్సయ్యగౌడ్..మునుగోడు ఉప ఎన్నికలో నిన్న టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఇవాళ ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు.. భారతీయ జనతా పార్టీలో చేరడానికే ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు.కాగా, 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన.. 2019ల్లో మరోసారి పోటీ చేసినా.. కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో.. ఆయన పేరు తెరపైకి వచ్చింది.. మునుగోడు టీఆర్ఎస్‌ టికెట్‌ను ఆశించారు బూర నర్సయ్యగౌడ్‌.. కానీ, ఆయనకు నిరాశ తప్పలేదు.. ప్రగతి భవన్‌కు పిలిపుంచుకుని మాట్లాడిన సీఎం కేసీఆర్‌… బీఆర్‌ఎస్‌లో మీ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పినట్టుగా.. ఆ తర్వాత మీడియాకు బూర నర్సయ్య గౌడ్‌ చెప్పిన విషయం తెలిసిందే.. కానీ, ఉన్నట్టుండి.. కారు పార్టీకి షాక్‌ ఇచ్చారు బూర.. ఇక, నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి తరుణ్ చుగ్‌ను భేటీ అయ్యారు బూర నర్సయ్య గౌడ్.. ఢిల్లీ వెళ్లిన ఆయన.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్టు తెలుస్తోంది.. అక్కడే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఢిల్లీలో సీయం కేసీఆర్... కాలక్షేపం

*ఢిల్లీలో సీయం కేసీఆర్... కాలక్షేపం*

*జాతీయ పార్టీ ప్రకటన తర్వాత*

*తొలిసారి దేశ రాజధానికి కానరాని హడావుడి..*

*కలవని ఇతర పార్టీల నాయకులు*

*పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనుల పరిశీలనతోనే సరి*
న్యూఢిల్లీ, : ''భారతదేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయడానికే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నా.. బీఆర్‌ఎ్‌సతో కలిసి ముందుకు సాగేందుకు దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముందుకువస్తున్నారు''..విజయదశమినాడు జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలివి! ఆ ప్రకటన తర్వాత తొలిసారి బుధవారం ఆయన ఢిల్లీకి వచ్చారు. కానీ 2 రోజులుగా ఆయన ఇక్కడ తన అధికారిక నివాసానికే పరిమితమయ్యారు!

ఈ 2 రోజుల్లో ఏ రాజకీయ పక్షానికి చెందిన నేతా ఆయన్ను కలవడానికి రాలేదు. ఢిల్లీలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన కేసీఆర్‌.. గురువారం ఆ పనులపై సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ డిజైన్ల మ్యాపును అధ్యయనం చేసి, వాస్తు ప్రకారం పలు మార్పు చేర్పులను సూచించినట్లు తెలిసింది.

అలాగే.. టీఆర్‌ఎస్‌ ఎంపీ సురేశ్‌ రెడ్డి గురువారం ఆయన్ను కలుసుకున్నారు. ఇంతకు మించి ఏ హడావుడీ కనిపించట్లేదు. ఎలాంటి రాజకీయ సందడీ లేదు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, October 13, 2022

తెలంగాణలో జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ఇదే!

తెలంగాణలో జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ఇదే!

హైదరాబాద్‌: భారత్‌ జోడో యాత్ర 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. 31న హైదరాబాద్‌లోకి రానున్న ఈ యాత్ర తెలంగాణలో 375 కిలోమీటర్లు సాగుతుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, మియాపూర్, BHEL, పటాన్ చెరువు, ఔటర్‌ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి రిజర్వు ఫారెస్ట్, జోగిపేట్, శంకరంపేట్, మద్దునూర్ వరకు సాగనుంది. 

Wednesday, October 12, 2022

ఏటు తేలని హిజాబ్ వివాదం,బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జిలు.

ఏటు తేలని హిజాబ్ వివాదం,బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జిలు.

ఢిల్లీ:హిజాబ్ అంశంపై పరస్పర భిన్న తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు ధర్మాసనం. న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధూలియా వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. కర్నాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా జస్టిస్ సుధాన్షు ధులియా మాత్రం హైకోర్టు తీర్పును తోసిపుచ్చారు. భిన్న అభిప్రాయాలతో కూడిన తీర్పు నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి కేసు బదిలీ చేయాలని జడ్జీలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫార్సు చేశారు.ఒక న్యాయమూర్తి హిజాబ్ నిషేధాన్ని సమర్థించగా, మరొకరు వ్యతిరేకించారు. తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సమర్థిస్తూ కర్నాటక హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీం ద్విసభ్య ధర్మాసంన దీనిపై ఎటూ తేల్చలేదు.ఇద్దరూ విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దీంతో విస్తృత ధర్మాసనానికి ఈ కేసు విచారణ వెళ్లనుంది.

Ccourtesy by : Q న్యూస్ మీడియా 

Tuesday, October 11, 2022

16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఫిబ్రవరిలో మెయిన్స్‌

16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఫిబ్రవరిలో మెయిన్స్‌


16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఫిబ్రవరిలో మెయిన్స్‌
  • గ్రూప్‌-1లో తొలిసారి బయోమెట్రిక్‌
  • మూడు రోజుల్లో ప్రాథమిక ‘కీ’
  • బబ్లింగ్‌లో తప్పులుంటే నో కరక్షన్‌
  • 2 గంటల ముందే రావాలి
  • త్వరలో గ్రూప్‌-2, 3
  • నమస్తే తెలంగాణతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 11 (నమస్తే తెలంగాణ): గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. 16వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష జరగనున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1లో టీఎస్‌పీఎస్సీ కీలక మార్పు చేసింది. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశ పెట్టబోతున్నది. తొలిసారిగా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా జంబ్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్ల గురించి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్ధన్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పరీక్ష నిర్వహించే తీరు, కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన మాటల్లోనే..

మాస్‌ కాపీయింగ్‌కు చెక్‌…
గ్రూప్‌-1 పరీక్షల్లో కొత్తగా ఎన్నో సవరణలు చేశాం. ప్రశ్నలను భారీగా జంబ్లింగ్‌ చేశాం. ఇప్పటివరకూ ఏ, బీ, సీ, డీ సిరీస్‌ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఇకపై ఎక్కువ సిరీస్‌లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశాం. ఆ ప్రశ్నలను కంప్యూటర్‌లో జంబ్లింగ్‌ చేశాం. ఉదాహరణకు.. రాము, రాజేశ్‌ పక్కపక్కనే కూర్చున్నారు. రాముకు ఒకటో నంబర్‌లో ఒక ప్రశ్న వస్తే.. రాజేశ్‌కు అదే ఒకటో నంబర్‌లో మరో ప్రశ్న వస్తుంది. రాముకు 1వ నంబర్‌లో వచ్చిన ప్రశ్నకు 4 చాయిస్‌లు ఒకలా ఉంటే.. రాజేశ్‌కు అదే ప్రశ్నకు 4 చాయిస్‌లు రివర్స్‌లో వస్తాయి. తద్వారా మాస్‌ కాపీయింగ్‌కు చెక్‌ పెట్టాం.

బబ్లింగ్‌లో తప్పులుంటే..
బబ్లింగ్‌ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎవరైనా తమకు కేటాయించిన నంబర్‌ను ఓఎంఆర్‌ షీటులో సరిగా బబ్లింగ్‌ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్‌ సంతకాలు లేకపోయినా అతని పేపర్‌ను మూల్యాంకనం చేయబోం. ఈ విషయంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు కూడా ఉన్నాయి.

మూడు రోజుల్లో ప్రాథమిక ‘కీ’
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ముగిసిన మూడురోజుల్లో ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తాం. ఈ నెల 20లోపు ‘కీ’ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఆ తర్వాత నిపుణుల కమిటీ ఫైనల్‌ ‘కీ’ని ప్రకటిస్తుంది. గ్రూప్‌ -1 పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఓఎమ్మార్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతాం. పరీక్షకు హాజరైన వారందరి ఓఎమ్మార్‌ షీట్లను అభ్యర్థులు చూసుకోవచ్చు. కీతో పోల్చుకుని ఎన్ని మార్కులొస్తాయో తెలుసుకోవచ్చు. ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా ఫలితాల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం.

హాల్‌ టికెట్‌పై ఫొటో సరిగా లేకుంటే..
దరఖాస్తు సమయంలో కొంతమంది ఫొటోలు సరైనవి ఇవ్వలేదు. ఫలితంగా హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా లేకపోతే.. అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకొని గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించుకుని పరీక్ష కేంద్రానికి రావాలి. అప్పుడే ఆ అభ్యర్థిని పరీక్షకు అనుమతిస్తాం. అందరూ త్వరగా www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సందేహాలుంటే టీఎస్‌పీఎస్సీని సంప్రదించాలి.

ప్రతి అరగంటకూ అలెర్ట్‌ చేస్తాం
పరీక్ష హాలులోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించం. పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు కూడా ఉండవు. అందుకే ప్రతి అరగంటకు ఓ సారి అలర్ట్‌ చేసేలా గంట మోగిస్తాం. పరీక్ష కేంద్రంలోకి చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి. మెహిందీలు వేసుకొని వస్తే అనుమతించం. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైనప్పుడు ఆ అభ్యర్థి వేలిముద్రలు తీసుకుంటాం. మళ్లీ మెయిన్‌ పరీక్షకు వచ్చినప్పుడు బయోమెట్రిక్‌ తీసుకుంటాం. వేలిముద్ర తీసుకోగానే అభ్యర్థి ఫొటోతోపాటు పూర్తి వివరాలు తెలిసిపోతాయి. ఎవరైనా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. అభ్యర్థిపై జీవితకాల నిషేధం విధిస్తాం.

ఫిబ్రవరిలోనే మెయిన్స్‌
గ్రూప్‌-1 పరీక్ష ఫలితాలను రెండునెలల్లోనే విడుదల చేస్తాం. ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరో నెల ఆలస్యం కావచ్చు. ఫిబ్రవరిలోనే మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తాం. క్వాలిఫై మార్కుల కోసం నిర్వహించే ఇంగ్లిష్‌ పరీక్షను సైతం మెయిన్స్‌లో భాగంగానే నిర్వహిస్తాం. గ్రూప్‌-1లో సెలక్ట్‌ అయ్యే అభ్యర్థులు భవిష్యత్తులో ఐఏఎస్‌లుగా కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. త్వరలోనే గ్రూప్‌ -2, 3 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్లు ఇస్తాం. దీనికోసం కావాల్సిన కసరత్తు పూర్తయింది. గిరిజన రిజర్వేషన్ల కోసం వెయిట్‌ చేస్తున్నాం. అవి ఖరారు కాగానే నోటిఫికేషన్లు ఇచ్చేస్తాం. అభ్యర్థులు ఎవరూ దళారుల మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు.

తొలిసారిగా సీసీ కెమెరాలు
రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో ఉండి కెమెరాలను టీఎస్‌పీఎస్సీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. ప్రశ్నపత్రాలను ప్రత్యేక నిఘాలో ఉంచేలా ఏర్పాటుచేశాం. పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌, టీఎస్‌పీఎస్సీ అధికారి సమక్షంలో ప్రశ్నపత్రం ఓపెన్‌ చేస్తాం. దీన్ని మొత్తం వీడియో తీస్తాం. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్‌ షీట్‌ను సీల్‌ చేసేటప్పుడు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తాం. ప్రతికేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని టీఎస్‌ఆర్టీసీకి సూచించాం. హైదరాబాద్‌ సహా నగరాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాం.

రెండు గంటల ముందే రండి
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహిస్తాం. 10.15 నిమిషాల వరకే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తాం. గ్రూప్స్‌ వంటి పరీక్ష రాసే అభ్యర్థులకు సమయపాలన ఎంతో అవసరం. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఒక్కొక్కరి బయోమెట్రిక్‌కు సుమారు 15 సెకన్ల సమయం పడుతుంది. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలలోపే పరీక్ష కేంద్రానికి రావాలి. అలా రావడం వల్ల.. టెన్షన్‌ పడకుండా ప్రశాంతంగా పరీక్ష రాయొచ్చు.

Courtesy by : నమస్తే తెలంగాణ మీడియా 

బుల్లెట్లు దూసుకెళ్లినా.... ముష్కరులను వదలని...... జాగిలం

*బుల్లెట్లు దూసుకెళ్లినా.... ముష్కరులను వదలని...... జాగిలం*

మాతృదేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణాల మీదకు వచ్చినా వెనకడుగు వేయరు సైనికులు. వారి శిక్షణలో ఓ జాగిలం కూడా అదే తరహా నిబద్ధతను కనబరిచింది.జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు నక్కినట్లు సోమవారం విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ముష్కరులను గుర్తించే పనిని అధికారులు జూమ్‌ అనే జాగిలానికి అప్పగించారు. దీంతో అది ఉగ్రవాదులను గుర్తించి, వారిపై దాడి చేసింది.

ఈ క్రమంలో రెండు తూటాలు శరీరంలోంచి దూసుకెళ్లినా అది పోరాటాన్ని ఆపలేదు. ఇంతలో భద్రతా దళాలు అక్కడికి చేరుకుని, ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదులను గుర్తించి, మట్టుబెట్టడంలో జూమ్‌కు కఠిన శిక్షణ ఇచ్చామని, ఇంతకుముందు కూడా చాలా ఆపరేషన్లలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించిందని అధికారులు తెలిపారు. గాయపడిన జాగిలాన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️