*22/ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం*
*ప్రతి కేసును వేగంగా పరిష్కరించాలి*
*ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి పొంగులేటి*
*అధికారులకు టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం*
*మాభూమి మాకు దక్కింది ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు -22 ఏ దరఖాస్తుదారులు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 19:
22/ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22/ఎ జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి 22/ఎ అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు సబ్ రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు.అనంతరం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.22/ఎ జాబితాలో భూమి ఉందనే కారణంతో మాత్రమే రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం లేదా తిరస్కరించడం చేయవద్దని ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. సంబంధిత భూమి 22/ఎ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటి? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
22/ఎభూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను కూడా పరిరక్షిస్తూ, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
*“నా భూమి నాకు దక్కింది.. -ప్రభుత్వానికి కృతజ్ఞతలు”*
22/ఎ సమస్యను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్న ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్షంగా లబ్ధి పొందిన పోచారం గ్రామానికి చెందిన రాకేష్ తన అనుభవాన్ని వెల్లడించారు.“నేను 2022లో పోచారం గ్రామంలో వంద గజాల స్థలం కొనుగోలు చేశాను. ఇటీవల ఆ స్థలాన్ని విక్రయించేందుకు నార్లపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాను. మొదట డాక్యుమెంట్ రైటర్‌ను సంప్రదించగా, మీ భూమి22/ఎ లో ఉందని చెప్పారు. దీంతో కొంత ఆందోళనకు గురయ్యాను. అయితే మూడు, నాలుగు రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి మీ భూమికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ఈ రోజు నేను ఆ స్థలాన్ని కొనుగోలుదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేశాను. నా భూమి నాకు దక్కేలా సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు” అని తెలిపారు.“ క్లియరెన్స్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం”.నారపల్లి సబ్ రిజిస్ట్రార్ సునీల్ మాట్లాడుతూ.. పోచారం గ్రామంలోని సర్వే నంబర్ 50ను ఏపీ హౌసింగ్ బోర్డు భూమిగా పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్‌లో22/ఎ జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని తెలిపారు. ఇటీవల కలెక్టర్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. వెంటనే గతంలో రిజిస్ట్రేషన్ కోసం మమ్మల్ని సంప్రదించిన వారికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నాం. వారు కార్యాలయానికి వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం” అని సబ్ రిజిస్ట్రార్ సునీల్ తెలిపారు.మా సొసైటీలోని 300 ప్లాట్లకు పూర్తి విముక్తి కలిగింది- చక్రపాణి (కొనుగోలుదారు).కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీలోని నెంబర్ 80సిలోగల 250 గజాల స్దలాన్ని నెలరోజుల క్రితం కొనుగోలు చేశాను. అయితే రిజిస్ట్రేషన్ కోసం కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఆభూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ చేయలేదు. తాజాగా ప్రభుత్వ చర్యల కారణంగా నిన్ననే నాకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఈ రోజు వెళ్లగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అంతేగాక మా సొసైటీలోని 300 ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు- అని చక్రపాణి అనే కొనుగోలుదారు తెలిపారు. ప్రభుత్వ సకాల చర్యల వల్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది- రాజేంద్రప్రసాద్.బాలా నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని మూసాపేట్‌లో గల రెయిన్‌బో విస్టాలో ఉన్నప్లాట్ నెంబర్ 804 ను విక్రయించేందుకు కొద్దికాలం క్రితం యజమాని వెంకట విజయ్‌కుమార్ ప్రయత్నించారు. అయితే 22ఎ నిషేధిత జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేషన్ జరగలేదు. వెంకట విజయ్‌కుమార్ ఆస్ట్రేలియా వెళ్లిపోతూ తన మామ రాజేంద్రప్రసాద్‌కు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈనెల 12న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఈరోజు రాజేంద్రప్రసాద్ వెళ్లి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే...
మా అల్లుడు సేల్ చేద్దామనుకున్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వస్తే... 22ఎ కింద గవర్నమెంట్ నిషేధం విధించిందని చెప్పినందున ఆ రోజు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ తర్వాత నా అల్లుడు నా పేరు మీద స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. అది ఇంకా చాలా కాలమే పడుతుందేమో అనుకున్నాం గానీ... అదృష్టవశాత్తూ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకున్నందున వెంటనే ఒక వారం రోజుల్లోనే ఇది క్లియర్ అయ్యి... అనుకూలంగా తేలింది. ఈ రోజు రిజిస్ట్రేషన్ కోసం వచ్చాం, రిజిస్ట్రేషన్ కూడా మాకు సంతృప్తి కరంగా పూర్తిగా అవుతుంది. ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి - శ్రీనివాస్.బాలా నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని మూసాపేట్‌లో గల వైష్ణవి ఎస్టేట్ ప్రతినిధి శ్రీనివాస్ మూసాపేట సర్వే నెంబర్ 108లోగల భూమిని విక్రయించేందుకు రాగా 22ఎ నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తిరస్కరించారు. తాజాగా ప్రభుత్వ చర్యలు కారణంగా ఈరోజు శ్రీనివాస్ తన భూమికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ..
మాకు 2005 లో సీలింగ్ పర్మిషన్ వచ్చింది. మేము రిజిస్ట్రేషన్ కి అప్పటినుంచి ప్రయత్నం చేస్తున్నాము. . తాజాగా రెండు వారాల క్రితం మూసాపేట్ బాలానగర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కి వెళ్తే 22ఎ లో పెట్టామని చెప్పారు. మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యాము. ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ అది క్లియర్ చేశారు. దాంతో ఈ రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాము. ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ అయింది. థాంక్యూ వెరీ మచ్.పలు సర్వే నెంబర్లలో నిషేధం తొలగింపు - ఎస్.ఆర్.వో
బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో గల సర్వే నెంబర్లు 101/1, 101/2, 102, 108, 109, 112, 81 లో ఉన్న సుమారు 3000 చదరపు మీటర్ల స్దలంపై ఉన్న 22ఎ నిషేధం తొలగిపోయింది. ఈ సర్వే నెంబర్లలో ఉన్న భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుపుకోవచ్చునని బాలా నగర్ సబ్ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
అధికారుల ఆదేశాలతో వెంటనే రిజిస్ట్రేషన్.మేము ఏజీ కాలనీ, గుండ్ల పొచంపల్లిలోని .గౌరీశంకర్ వద్ద మేము ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది.మేము జూలై ఆరు నాడు ఇక్కడ రిజిస్ట్రేషన్ కి రాగా 22ఎ నిషేధిత జాబితా పేరిట రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
అప్పటినుంచి మేము కలెక్టర్ ఆఫీస్ కి, అక్కడ ఇక్కడ తిరుగుతుంటే... ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి, క్లియర్ చేయమని సబ్-రిజిస్ట్రార్ గారికి చెప్పారు. ఆ వెంటనే సబ్ రిజిస్ట్రార్ మేడమ్ గారు మాకు ఫోన్ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేసి మాకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది అని ఒక దరఖాస్తుదారు తెలిపారు.
No comments:
Post a Comment