Saturday, August 29, 2026

వేతన చెల్లింపులో జాప్యం, ఫారమ్-16 జారీపై చర్యలు తీసుకోవాలని TGHRC సిఫార్సు_

*ప్రెస్ రిలీజ్*

*వేతన చెల్లింపులో జాప్యం, ఫారమ్-16 జారీపై చర్యలు తీసుకోవాలని TGHRC సిఫార్సు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 28:

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC), గౌరవ చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన, HRC No.4763 of 2021లో 28.07.2026 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు వేతనం దీర్ఘకాలం చెల్లించకపోవడం, తద్వారా ఆదాయపు పన్ను సంబంధిత ఇబ్బందులు ఎదురైన అంశంపై కమిషన్ విచారణ జరిపింది.
ఫిర్యాదుదారు 23.10.2015 నుండి 24.02.2017 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC)లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశారు. సంబంధిత కాలానికి సంబంధించిన రూ.14,24,488/- వేతనం అక్టోబర్, 2018లో ఆయన మునుపటి పోస్టింగ్ స్థలం నుండి లాస్ట్ పే సర్టిఫికేట్ (LPC) అందిన అనంతరం ఒకేసారి చెల్లించబడింది. అలాగే, Form-16, బిల్లు వారీ వివరాలు, TDS చెల్లింపుల వివరాలు సకాలంలో అందకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు అందినట్లు ఫిర్యాదుదారు తెలిపారు.
సంబంధిత అధికారుల నివేదికలను పరిశీలించిన కమిషన్, వేతనం చెల్లించడంలో ఒక సంవత్సరానికి పైగా జాప్యం జరిగినట్లు పేర్కొంది. ఉద్యోగి బదిలీ అయినప్పుడు సర్వీస్ రిజిస్టర్ , ఎల్పిసి LPC తదితర సేవా రికార్డులను సకాలంలో బదిలీ చేసి, వేతన చెల్లింపులో అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత పరిపాలనా అధికారులపై ఉందని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, సంబంధిత ఇంజనీర్-ఇన్-చీఫ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ మరియు కమిషనర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైపు జాప్యం ఉన్నట్లు కమిషన్ అభిప్రాయపడింది.
మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 18 కింద తన అధికారాలను వినియోగిస్తూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదుదారుడి వేతన చెల్లింపులో జరిగిన జాప్యం మరియు అక్టోబర్, 2015 నుండి ఫిబ్రవరి, 2017 వరకు కాలానికి Form-16 జారీ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది.
*పై సిఫార్సుతో కేసులో తదుపరి చర్యలను కమిషన్ ముగించింది.*

No comments:

Post a Comment