Saturday, August 8, 2026

అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!_

*అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!*

*వి.సి. సజ్జనార్ ఐపిఎస్ - డిజి మరియు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 08:

"ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇది. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలుగా ఆగస్టు 1వ తారీకు 50శాతం స్పెషల్ డిస్కౌంట్ "1st August Special - 50% OFF", "రెంట్ బాయ్‌ఫ్రెండ్ - యువర్ పర్సనల్ కంపానియన్" అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట ప్రచారం చేస్తున్నారు.ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తూ.. ఒక గంట కాఫీ మీటింగ్‌కు రూపాయలు 499, సినిమా డేట్‌కు రూపాయలు 1,249, షాపింగ్‌కు తోడుగా రావడానికి రూపాయలు 1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు రూపాయలు 1,999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి రూపాయలు 4,499 అంటూ కేటుగాళ్లు ఒక పెద్ద ధరల పట్టికనే మీ ముందుకు తెచ్చారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు.
ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలుపెడతారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు.ఆన్‌లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది.ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టిసారించింది. వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలి. స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది.కేటుగాళ్లు ఇచ్చే ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోకండి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ గానీ, కలవడం కానీ చేయవద్దు, ముందస్తుగా రూపాయి కూడా చెల్లించవద్దు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేయండి లేదా "సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్" cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.

No comments:

Post a Comment