Thursday, August 27, 2026

వార్త రాస్తే.. వేటాడతారా?!అవినీతిని ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు చేస్తారా?_

*జర్నలిస్టు నేలపాటి రవిపై పాశవిక దాడి*

తలకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవి

గురువారం రాత్రి కాపుకాచి దాడికి పాల్పడిన దుండగులు

*‘వెలుగులో లోన్ దందా’ కథనంతో కక్షగట్టారన్న ఆరోపణ*

*కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో దాడి.. హత్య చేస్తామంటూ హెచ్చరికలు*

*దాడి వెనుక  పీసీ పల్లి వెలుగు అధికారుల హస్తం?!*

వార్త రాస్తే.. వేటాడతారా?!

అవినీతిని ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు చేస్తారా?

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

దాడి వెనుక అధికారుల ప్రేరేపణ ఉందన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలి

*తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం డిమాండ్*

*మార్కాపురం/కనిగిరి* : ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం అత్యంత దారుణమని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మార్కాపురం జిల్లా పీసీ పల్లి వెలుగు కార్యాలయంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ‘వెలుగులో లోన్ దందా’ పేరుతో వార్త ప్రచురించినందుకు జర్నలిస్టు నేలపాటి రవిపై కొందరు వ్యక్తులు గురువారం రాత్రి కాపుకాచి కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు రవి ఆరోపించారు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయాలైనట్లు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

దాడి సమయంలో తనపై తీవ్రంగా దాడి చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాస్తే చంపేస్తామని బెదిరించినట్లు రవి వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది.

వెలుగు కార్యాలయంలోని అక్రమాలను ప్రశ్నిస్తూ వార్త రాసినందుకే తనపై దాడి జరిగిందన్న రవి ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సంఘం పేర్కొంది. జర్నలిస్టులు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలని, వార్తలు రాసినందుకు వారిపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

అదేవిధంగా, ఈ దాడి వెనుక వెలుగు శాఖకు చెందిన కొందరు అధికారుల ప్రేరేపణ ఉందన్న ఆరోపణలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని సంఘం డిమాండ్ చేసింది. ఆరోపణలు వాస్తవమైతే బాధ్యులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, దాడిని ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పాత్రపై కూడా విచారణ జరపాలని సంఘం కోరింది. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధిత జర్నలిస్టుకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
జర్నలిస్టులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, జర్నలిస్టుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం స్పష్టం చేసింది.
SOURCE 

No comments:

Post a Comment