*ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సామాజిక బాధ్యతపై అవగాహన అవసరం: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 29:
రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎమ్డిసి హైదరాబాద్ మారతాన్ (NMDC Hyderabad Marathon – 2026)లో భాగంగా 5కే రన్ విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎచ్ఐసీసీ HICC నుంచి హైటెక్స వరకు నిర్వహించిన ఈ పరుగు కార్యక్రమంలో సుమారు 6,100 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పరుగు కార్యక్రమాన్ని “Run for a Cause” అనే సందేశంతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నప్పటికీ, నిర్వాహకులు మరియు పోలీసు సిబ్బంది సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్, సీఎంసీ కమిషనర్ శ్రీమతి సృజన, విద్యార్థులు, రన్నర్లు మరియు సామాన్య ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. క్రమం తప్పకుండా పరుగు, నడక వంటి శారీరక వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అదే విధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా సమాజంలో సేవాభావాన్ని మరింత పెంపొందించవచ్చని పేర్కొన్నారు.పిల్లలు సెల్‌ఫోన్‌లకు ఎక్కువ సమయం కేటాయించకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకునేలా *“సెల్‌ఫోన్ వద్దు – పుస్తకమే ముద్దు”* అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. కథల పుస్తకాలు, ఇతర పుస్తకాలు, రాత సామగ్రిని అవసరమైన వారికి అందించడం ద్వారా పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు వారి జ్ఞానాన్ని విస్తరించేందుకు దోహదపడుతుందని అన్నారు.రోహిణి ఫౌండేషన్ చేపట్టిన “పవర్ అఫ్ 100” కార్యక్రమం ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరి చిన్న సహకారం కూడా ఒక పెద్ద సానుకూల మార్పుకు దోహదపడుతుందనే సందేశాన్ని అందించారు. *“100 People – ₹100 Each – One Powerful Change”* అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యత, సమిష్టి భాగస్వామ్యం మరియు సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేశారు.సుమారు 6,100 మంది పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రోహిణి ఫౌండేషన్ నిర్వాహకులు, NMDC Hyderabad Marathon నిర్వాహకులు, రన్నర్లు, విద్యార్థులు, ప్రజలు మరియు సైబరాబాద్ పోలీస్ సిబ్బందికి సైబరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment