*జపాన్ సంస్థతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ భాగస్వామ్యం*
*హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సూత్రప్రాయ అంగీకారం*
*హైదరాబాద్‌కు రావాలని హెచ్‌ఐటీ ప్రతినిధులకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆహ్వానం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 28:
తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించేందుకు జపాన్‌లోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్నామని శక్తి మరియు గనులు శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇందులో భాగంగా హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హెచ్‌ఐటీ), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ) మధ్య భాగస్వామ్యానికి సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు.జపాన్ పర్యటనలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం శుక్రవారం హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించింది. ఈ సందర్భంగా సంస్థ నాయకత్వంతో తెలంగాణలో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల తయారీపై విస్తృతంగా చర్చించింది.తొలిదశలో పరస్పర అవగాహనతో భాగస్వామ్యాన్ని ప్రారంభించి.. తెలంగాణకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సహకార రంగాలను సంయుక్తంగా గుర్తించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.
హెచ్‌ఐటీ–వైఐఎస్‌యూ భాగస్వామ్యంలో విద్యార్థుల పరస్పర మార్పిడి కార్యక్రమాన్ని కీలకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా తెలంగాణ విద్యార్థులకు జపాన్‌లోని సాంకేతిక విద్యా విధానం, ప్రయోగశాల ఆధారిత శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానమైన విద్యా విధానంపై ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకునే అవకాశాలు కూడా కల్పించనున్నారు.అధ్యాపకులు, శిక్షకుల నైపుణ్యాభివృద్ధి, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (టీఓటీ), స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు, పరిశోధన, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుభవం వంటి అంశాల్లోనూ సహకారాన్ని పరిశీలించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. తెలంగాణలో స్థానిక అవసరాలు, భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్య రంగాలను ఎంపిక చేయనున్నారు. అధునాతన తయారీ, మొబిలిటీ, ఆటోమొబైల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీలు, పర్యావరణ సాంకేతికత వంటి రంగాల్లో ప్రత్యేకంగా సహకారం పెంచుకోవడంపై చర్చించారు. హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ రంగంలోని సామర్థ్యాలు.. తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు అనుకూలంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.కేవలం సంప్రదాయ విద్యా మార్పిడికి పరిమితం కాకుండా.. నైపుణ్యాలు, ఉపాధి సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పరిశ్రమల అవసరాలకు నేరుగా ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జపాన్ సాంకేతికత, తయారీ రంగం, పరిశ్రమల ఆధారిత విద్యా విధానంలోని ఉత్తమ పద్ధతులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా అమలు చేయాలని అన్నారు.
తరగతి గది, ప్రయోగశాల విద్యను వాస్తవ పరిశ్రమల సవాళ్లు, పరిశోధనతో అనుసంధానించే హెచ్‌ఐటీ విధానంపై తెలంగాణ ప్రతినిధి బృందం ప్రత్యేక ఆసక్తి చూపింది. ఇలాంటి విధానాలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు తెలంగాణ సాంకేతిక విద్యా వ్యవస్థలో ఎలా అమలు చేయవచ్చనే అంశంపై చర్చించారు.
**హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానం**
హెచ్‌ఐటీ ప్రతినిధులను హైదరాబాద్‌కు వచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని సందర్శించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. తదుపరి చర్చల ద్వారా భాగస్వామ్యానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
డిసెంబరులో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’లో పాల్గొని.. తెలంగాణతో మరిన్ని సంస్థాగత, పారిశ్రామిక భాగస్వామ్యాలను పరిశీలించాలని హెచ్‌ఐటీ ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు.జపాన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, పరిశ్రమలతో నేరుగా సంస్థాగత సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఈ భాగస్వామ్యం మరో కీలక ముందడుగని మంత్రి తెలిపారు. ప్రపంచస్థాయి సాంకేతిక విద్య, నైపుణ్యాలు, పరిశ్రమల అనుభవాన్ని తెలంగాణ యువతకు అందించేందుకు ఇటువంటి భాగస్వామ్యాలను మరింత విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment