*విధి నిర్వహణలో గాయపడిన కానిస్టేబుళ్లకు సీపీ సజ్జనర్ పరామర్శ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 29:
విధి నిర్వహణలో భాగంగా డ్రగ్స్ తనిఖీల సమయంలో గాయపడిన హెచ్-న్యూ కానిస్టేబుళ్లు ఎన్.మహేందర్ యాదవ్, ఎమ్.వంశీధర్‌లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరామర్శించారు. లంగర్‌హౌజ్, ప్రశాంత్‌నగర్‌లోని ఆ కానిస్టేబుళ్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వారి ఆరోగ్య పరిస్థితిని, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విధి నిర్వహణలో వారు చూపిన తెగువను ప్రశంసించారు. వారికి మనోధైర్యం కల్పిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ పరామర్శలో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కూడా సీపీ వెంట ఉన్నారు.ఈ నెల 26న ఆబిడ్స్ తిలక్‌రోడ్డు ప్రాంతంలో డ్రగ్స్ సమాచారంతో 'హెచ్-న్యూ' బృందం తనిఖీలకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న నీలిరంగు బలేనో కారు (TG 12 8766) డ్రైవర్.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వాహనాన్ని అత్యంత వేగంగా రివర్స్ చేస్తూ వారిపైకి దూసుకొచ్చాడు.ఈ ప్రమాదంలో కారు చక్రం కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్ వంశీధర్‌కు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.మరోవైపు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ప్రాణాంతక దాడికి పాల్పడి పరారైన కారు డ్రైవర్‌పై ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment