Wednesday, August 26, 2026

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR: ప్రజాస్వామ్య హక్కులకు తీవ్రమైన ముప్పు_

*స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR: ప్రజాస్వామ్య హక్కులకు తీవ్రమైన ముప్పు*

*సీతారాం ధూళిపాళ - వ్యవస్థాపక చైర్మన్ ది సిటిజన్స్ కౌన్సిల్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 25:

ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పారదర్శకత, నిష్పక్షపాతత్వం మరియు పౌరుల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణపై తీవ్రమైన సందేహాలను కలిగిస్తోంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత SIR నిర్వహించడం, అందులో ఓటర్లు తమ వివరాలను పరిశీలించి, తప్పులను సరిచేసుకునేందుకు కేవలం 40 రోజుల సమయం ఇవ్వడం ఆందోళనకరం. ముఖ్యంగా ప్రతి ఓటరుకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు తగిన విధమైన ముందస్తు సమాచారాన్ని అందించడంలో స్పష్టత లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంద అని సీతారాం ధూళిపాళ  (వ్యవస్థాపక చైర్మన్ ది సిటిజన్స్ కౌన్సిల్)అన్నారు. ఈ సందర్బంగా సీతారాం ధూళిపాళ మాట్లాడుతూ మరింత తీవ్రమైన విషయం ఏమిటంటే, SIR ముసాయిదా ఓటర్ల జాబితా మరియు సవరణలకు సంబంధించిన నోటీసులను ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా, ప్రతి ఓటరే స్వయంగా ఆన్‌లైన్‌లోకి వెళ్లి తన పేరు, వివరాలను పరిశీలించి, తప్పులను గుర్తించి, నిర్ణీత గడువులో సవరణలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. ప్రభావిత ఓటర్లకు SMS, WhatsApp, పోస్టు లేదా ఇతర అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందించే సమగ్ర వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, ఫారం 6, ఫారం 7, ఫారం 8లను సంబంధిత బిఎల్ఓ BLO ద్వారా రూట్ చేయాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో ఓటర్లకు సహాయం చేయాల్సిన అనేక మంది బిఎల్ఓ BLOలకే ఆన్‌లైన్ నోటీసులు, సవరణల ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడం తీవ్రమైన లోపం.బిఎల్ఓ BLOలకే సరైన సమాచారం లేని పరిస్థితిలో సామాన్య ఓటర్లు ఈ ప్రక్రియను ఎలా అర్థం చేసుకుని పూర్తి చేయగలరు?అని ప్రశ్నించారు.
*ఇది ఒక ప్రాథమిక ప్రజాస్వామ్య ప్రశ్నను లేవనెత్తుతోంది:*

ఆన్‌లైన్ నోటీసును చూడలేకపోయినందుకు లేదా సవరణకు సంబంధించిన గడువు తెలియకపోయినందుకు ఒక నిజమైన ఓటరు తన ఓటు హక్కును కోల్పోవడం న్యాయమేనా? ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఓటు హక్కును పరిరక్షించాలి కానీ డిజిటల్ అవరోధంగా మారకూడదు. ముఖ్యంగా వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, డిజిటల్ సదుపాయాలు లేదా అవగాహన లేని ప్రజలు ఈ ప్రక్రియలో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.అందువల్ల ECI ప్రభావిత ఓటర్లకు వ్యక్తిగతంగా మరియు ధృవీకరించగలిగే విధంగా సమాచారం అందించడం, BLOలకు సమగ్ర శిక్షణ ఇవ్వడం, ఆఫ్‌లైన్‌లో కూడా సవరణలకు అవకాశం కల్పించడం, తగినంత సమయం ఇవ్వడం మరియు ఏ నిజమైన ఓటరి పేరును తొలగించే ముందు సమర్థవంతమైన అభ్యంతరం/అప్పీల్ అవకాశం కల్పించడం అత్యవసరం.డెడ్‌లైన్లు, ఆన్‌లైన్ నోటీసుల ద్వారా ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయదు. ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటర్ల జాబితాలో కొనసాగేందుకు న్యాయమైన అవకాశం కల్పించడమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం.అందువల్ల SIR ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా, ఓటర్‌ అనుకూలంగా మరియు రాజ్యాంగబద్ధంగా జవాబుదారీతనంతో నిర్వహించాలి. ఎన్నికల జాబితా సవరణ పేరుతో ఒక్క నిజమైన ఓటరు కూడా తన ప్రజాస్వామ్య హక్కును కోల్పోకుండా ECI తక్షణ చర్యలు తీసుకోవాలి.

No comments:

Post a Comment