Saturday, August 22, 2026

సామాన్యుడిలా బైక్‌పై వచ్చి.. కేబీఆర్ వన్ వే ట్రాఫిక్‌ను పరిశీలించిన నగర సీపీ సజ్జనర్_

*సామాన్యుడిలా బైక్‌పై వచ్చి.. కేబీఆర్ వన్ వే ట్రాఫిక్‌ను పరిశీలించిన నగర సీపీ సజ్జనర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 20:

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో కొత్తగా అమల్లోకి తెచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సాధారణ పౌరుడిలా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయి ట్రాఫిక్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్డు నంబర్ 45 వరకు రెండు సార్లు బైక్‌పై తిరుగుతూ ట్రాఫిక్ ను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం వేళల్లో కూడా మరోసారి ట్రాఫిక్ సరళిని పర్యవేక్షించారు. అగ్రసేన్‌ చౌరస్తా, ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు తదితర కూడళ్ల వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని అన్నారు. బుధవారం నుంచి వన్‌వే విధానాన్ని అమలులోకి తెచ్చామని, మొదటి రోజు లేన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ, గురువారం నాటికి రాకపోకలు పూర్తిగా సాఫీగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది సిబ్బందిని కూడా మోహరించినట్లు వివరించారు.
జీహెచ్‌ఎంసీ, నిర్మాణ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటూ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పనులు పూర్తయ్యేంత వరకు నగరవాసులు సహకరించాలని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment