Tuesday, September 29, 2026

త‌మ్మిడికుంట‌తో పాటు సున్నం చెరువును ప‌రిశీలించిన‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌_

*చెరువుల ప‌రిస‌రాల‌నూ అభివృద్ధి చేయండి*

*త‌మ్మిడికుంట‌తో పాటు సున్నం చెరువును ప‌రిశీలించిన‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 29:

సున్నం చెరువుతో పాటు.. త‌మ్మిడికుంట ప‌రిస‌రాల‌ను అభివృద్ధి చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అధికారుల‌ను ఆదేశించారు. చెరువుల్లో పూడిక పూర్తి స్థాయిలో తొల‌గించ‌డంతో పాటు.. లోతు పెంచ‌డం ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్‌.. చెరువుల చెంత చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై దృష్టి సారించాల‌ని సూచించారు. చెరువుల‌ చుట్టూ బ‌ల‌మైన ఫెన్సింగ్‌, చుట్టూ పాత్‌వే, గ్రీన‌రీ పెంచే ప‌నుల‌ను మంగ‌ళ‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. ద‌స‌రా పండ‌గ రోజుల్లో ఈ రెండు చెరువులను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో చెరువుల అభివృద్ధిని స‌మీక్షించారు. సున్నం చెరువు ఇన్‌లెట్ కాలువ‌తో పాటు.. అక్క‌డ క‌ల్వ‌ర్టు నిర్మించి ర‌హ‌దారి నిర్మాణ ప‌నులు వెంట‌నే పూర్తి చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. గాయ‌త్రిన‌గ‌ర్‌, బోర‌బండ ప్రాంతాల నుంచి చెరువుకు వ‌చ్చే దారుల‌ను కూడా అభివృద్ధి చేయాల‌ని సూచించారు. చెరువు అభివృద్ధితో పాటు.. ప‌రిస‌రాల‌ను కూడా సుంద‌రంగా తీర్చి దిద్దాల్సిన‌వ‌స‌రం ఉంద‌న్నారు. సున్నం చెరువుకు ఆనుకుని ఉన్న ఆంజ‌నేయ గుడి అభివృద్ధిని కూడా ప‌రిశీలించారు. ఒక‌ప్ప‌టి సున్నం చెరువుకు - నేటికీ ఎంతో మార్పు క‌నిపించింద‌ని.. స్థానికులు ఈ సంద‌ర్భంగా హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌ల‌సి అభినందించారు. పూర్తి స్థాయిలో నీరుంటే మ‌రింత న‌య‌న‌మ‌నోహ‌రంగా ఉండేద‌ని పేర్కొన్నారు. ఎన్నో ఆటంకాల‌ను, అవ‌రోధాల‌ను అధిగ‌మించి చెరువును ఇంత సుంద‌రంగా తీర్చిదిద్దిన హైడ్రాకు అభినంద‌న‌లు తెలిపారు. ఎన్ క‌న్వెన్ష‌న్‌ను తొల‌గించి త‌మ్మిడి కుంటను అభివృద్ధి చేసిన తీరును కూడా ప‌లువురు ఈ సంద‌ర్భంగా మెచ్చుకున్నారు. త్వ‌ర‌లో ప్రారంభానికి సిద్ధం చేస్తున్న ఈ రెండు చెరువుల చెంత చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌న‌ల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు.. సీఎంసీ క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి సృజ‌న స‌మీక్షించారు. సీఎంసీ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మీక్ష‌లో సీఎంసీ, హైడ్రా అధికారులు కూడా  పాల్గొన్నారు.

No comments:

Post a Comment