Tuesday, September 8, 2026

దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను అవమానించేలా మాట్లాడటం కరెక్ట్ కాదు _

*స్పీకర్‌ను కించపరిచేలా, అసభ్య పదజాలంతో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాసనసభ గౌరవానికి అవమానకరం - మంత్రి దామోదర్ రాజనర్సింహ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 07:

అసెంబ్లీ స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్సీ బూతులు తిడుతూ, అమర్యాదకరంగా మాట్లాడటాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్రంగా ఖండించారు.స్పీకర్‌ను కించపరిచేలా, అసభ్య పదజాలంతో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాసనసభ గౌరవానికి అవమానకరం అని మంత్రి పేర్కొన్నారు.రాజకీయ విభేదాలు ఉండవచ్చు. విధానాలపై విమర్శలు చేయవచ్చు. కానీ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు. ప్రత్యేకించి, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను అవమానించేలా మాట్లాడటం అత్యంత ఆందోళనకరమైన విషయం అని మంత్రి అన్నారు.దళితులు ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి ఎదిగి, అత్యున్నత పదవులను అలంకరించినప్పటికీ వారిపై వివక్ష, చిన్నచూపు, అవమానకరమైన వ్యవహారశైలి ఇంకా కొనసాగుతుండటం దురదృష్టకరమన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఏళ్లు అవుతున్నా ఇప్పటికి కూడా దళితుల పట్ల ఇలాంటి మానసిక వివక్ష కొనసాగడం బాధాకరం అని దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, గౌరవం కల్పించినప్పటికీ, దళితులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వారిని ఇంకా చిన్నచూపు చూసే మనస్తత్వం కొనసాగడం సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశమన్నారు.
ఒక దళితుడు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలకు గురికావడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం మాత్రమే కాదని, దళిత సమాజం పట్ల ఉన్న వివక్షపూరిత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు. ప్రజాప్రతినిధులు తమ హోదా, బాధ్యతలను గుర్తించి మాట్లాడాలని, పరస్పర గౌరవాన్ని పాటించాలని ఆయన సూచించారు. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు.సదరు ఎమ్మెల్సీ గారిపై శాసనసభ నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారిని మంత్రి కోరారు.

No comments:

Post a Comment