*ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 27:
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, దేశ విదేశాల నుంచి మన రాష్ట్రాన్ని సందర్శిస్తున్న పర్యాటకులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.“తెలంగాణకు ఉన్న అపారమైన సహజ, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ పర్యాటక పటంలో మరింత ఉన్నత స్థానంలో నిలపాలన్నది ప్రజాప్రభుత్వ సంకల్పం. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, కోటలు, జలపాతాలు, అటవీ ప్రాంతాలు, వన్యప్రాణి అభయారణ్యాలు, చెరువులు, జానపద కళలు, పండుగలు తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నాయి.
రామప్ప, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి, అలంపూర్, మేడారం, హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు వంటి అనేక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
తెలంగాణ టూరిజం పాలసీ 2025-30 ద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తూ, కొత్త పర్యాటక ప్రాజెక్టులు, అడ్వెంచర్ టూరిజం, క్యారవాన్ పార్కులు, వే-సైడ్ అమినిటీస్, ఎకో టూరిజం తదితర రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజంతో పాటు వారసత్వ పర్యాటకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం.
పర్యాటకులకు మెరుగైన వసతులు, సౌకర్యవంతమైన ప్రయాణం, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధిలో స్థానిక ప్రజలు, పర్యాటక రంగ సంస్థలు, హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, కళాకారులు, హస్తకళాకారులు, యువత భాగస్వామ్యం ఎంతో కీలకం. మన వారసత్వాన్ని కాపాడుకుంటూ, ప్రకృతిని పరిరక్షిస్తూ, స్థానిక సంస్కృతికి గౌరవం ఇస్తూ స్థిరమైన పర్యాటక అభివృద్ధిని సాధిద్దాం.
తెలంగాణకు వచ్చే ప్రతి పర్యాటకుడికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ, మన రాష్ట్ర ప్రత్యేకతలను ప్రపంచానికి చాటుదాం. తెలంగాణను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను” అని ముఖ్యమంత్రి గారు ఒక సందేశంలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment