Monday, September 21, 2026

ఉన్నతమైన కుటుంబం, తండ్రి ఐఏఎస్ ఆఫీసర్, తాను మాత్రం రాజీలేని విద్యార్థి ఉద్యమాలు చేసిన విద్యార్థి పరిషత్ నాయకుడు_

*అశ్రునయనాలతో మా ప్రియతమ భాస్కర్ అన్నకు శ్రద్ధాంజలి - ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్*

*ఏబీవీపీ కార్యకర్తల గుండెల్లో భాస్కర్ అన్న అంటే ఏనుగంత బలం, అపారమైన విశ్వాసం, ఆయన ఒక టైగర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 20:

ఈ జీవన ప్రయాణంలో ఎంతోమందిని కలుస్తుంటాం. కానీ కొందరు మాత్రమే చిరస్మరణీయమైన జ్ఞాపకాలుగా, గుండెల్లో నిలిచిపోయే అనుబంధాలుగా మిగిలిపోతారు. వారిలో భాస్కర్ అన్న ఒకరు. 1985-86 సమయంలో, నల్లగొండ నుండి, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన కొత్తలో భాస్కర్ అన్నను కలిశాను. తాను అప్పటికే పెద్ద నాయకుడు అనే గర్వం లేకుండా, నవ్వుతూ, హుందాగా,  ఆప్యాయతతో పలకరింపు ఆయన ప్రత్యేక లక్షణం.. నాడు హైదరాబాద్ నగరంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమాల్లో ఆయన ఒక 'టైగర్'. ABVP నగర కార్యదర్శిగా విద్యార్థి సమస్యలపై, అదురు బెదురు లేకుండా నిర్మాణాత్మక పోరాటాలు నడిపిన నికార్సైన యోధుడు.ఆయనతో కలిసి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా పనిచేసిన రోజులు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనివి. నాడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కు ఆయన వచ్చిండంటే చాలు, మేమంతా ఏనుగంత అండగా ఫీల్ అయ్యేవాళ్ళం.ఆ రోజుల్లో ప్రత్యర్థుల, గూండాల చేతుల్లో దారుణమైన దాడికి గురై, తీవ్రంగా గాయపడి, ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనపై కొంతమంది దుండగులు హత్యయత్నం చేస్తే, వంతులవారీగా ఆయనకు రక్షణగా ఉండేవాళ్లం. ఒకానొక రోజు, RSU కి చెందిన కొంతమంది తపంచలు, కత్తులతో దాడి చేస్తే, ప్రస్తుత స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణా రావు, సైదాబాద్ విజయ్, అడ్వొకేట్ పాండన్న, నేను ఆ దాడిని తట్టుకొని, భాస్కరన్న ప్రాణాలు కాపాడుకున్నం.

**ఉన్నతమైన కుటుంబం, తండ్రి ఐఏఎస్ ఆఫీసర్, తాను మాత్రం రాజీలేని విద్యార్థి ఉద్యమాలు చేసిన విద్యార్థి పరిషత్ నాయకుడు.**

తన  ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా, భాస్కర్ అన్న ఏనాడూ వెనకడుగు వేయలేదు; సిద్ధాంతాన్ని వీడలేదు. అంతటి నిఖార్సైన నిబద్ధత కలిగిన ధైర్యశాలి ఆయన.కానీ కాలం క్రూరమైనది.. అందరికీ అన్నీ అవకాశాలను, తగిన గుర్తింపును ఇవ్వకపోవచ్చు. 
జీవితాంతం కష్టనష్టాలు, అవమానాలు చిరునవ్వుతో భరిస్తూ నమ్మిన సిద్ధాంతానికే అంకితమైనప్పటికీ, ఆయనకు ఆశించిన స్థాయిలో తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం దక్కకపోవడం నిజంగా విచారకరం. కానీ పదవులు, పార్టీల గుర్తింపు కంటే మిన్నగా సమకాలీనుల, తోటి కార్యకర్తల గుండెల్లో భాస్కర్ అన్న అంటే ఏనుగంత బలం, అపారమైన విశ్వాసం, ఆయన ఒక టైగర్; అపారమైన ప్రేమను పంచే ఒక స్వచ్ఛమైన నిష్కల్మషమైన నాయకుడు.ఈ రోజు ఆయన ఇక లేరనే వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణం తీరని లోటు. అశ్రునయనాలతో మా ప్రియతమ భాస్కర్ అన్నకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
జోహార్ భాస్కర్ అన్న!🙏

No comments:

Post a Comment