Wednesday, September 30, 2020

GHMC ఎన్నికలు - బ్యాలెట్ లేదు EVM ???

హైదరాబాద్ : 01/10/2020

*బ్యాలెట్ తోనే  జిహెచ్ఎంసి పోరు!*

*ఈవీఎంలతో ఎన్నికలు సాధ్యం కాదని భావిస్తున్న ఎస్‌ఈసీ*

*రెండు, మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన!*

*బ్యాలెట్‌వైపే టీఆర్‌ఎస్‌ మొగ్గు.. ఈవీఎంలే మేలంటున్న బీజేపీ*

*ముందే నిర్ణయించాక అభిప్రాయాలడిగి ఏం లాభమన్న కాంగ్రెస్‌*
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతోనే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణకు తగిన సంఖ్యలో వీవీప్యాట్‌ మెషీన్లు అందుబాటులో లేనందున వాటితో సాధ్యం కాకపోవచ్చుననే నిర్ధారణకు ఎస్‌ఈసీ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతీ ఈవీఎం మెషీన్‌కు వీవీప్యాట్‌ను జతచేయాలన్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు అనుగుణంగా బ్యాలెట్‌ పేపర్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు ' ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి.
వీవీప్యాట్‌లను సరఫరా చేయాలంటూ ఇదివరకే ఈసీఐఎల్, బెల్‌ కంపెనీలను ఎస్‌ఈసీ కోర గా, అవి అనుమతి కోసం ఈసీకి రాశాయి. ఈసీ నుంచి అనుమతి లభించి, ఆ కంపెనీలు ఈ ఎన్నికలకు అవసరమైన సంఖ్యలో వీవీప్యాట్‌ యంత్రాలు తయారు చేసేప్పటికి కాలాతీతమౌతుందనే అభిప్రాయంతో ఎస్‌ఈసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే బ్యా లెట్‌ బాక్స్‌లతోనే ఎన్నికలకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే దీనిపై రెండు, మూడ్రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
ముగిసిన గడువు..
త్వరలోనే ఈసీ, జీహెచ్‌ఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అభిప్రాయాలు కూడా ఎస్‌ఈసీ తీసుకోనుంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు ఏ విధానమైతే సులభంగా ఉంటుందన్న దానిపై స్పష్టతనివ్వాలని కోరినట్టు తెలిసింది. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలను ఎస్‌ఈసీ కోరిన గడువు కూడా బుధవారంతో ముగిసింది. టీఆర్‌ఎస్‌తో పలు పార్టీలు బ్యాలెట్‌ పేపర్ల వైపే మొగ్గుచూపగా, బీజేపీ మాత్రం ఈవీఎంలతోనే నిర్వహించాలని సూచించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మాత్రం ఏ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనమో ఎస్‌ఈసీ చెప్పకుండా, ముందుగానే బ్యాలెట్లతో నిర్వహించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరడంలో ఔచిత్యమేంటని ప్రశ్నించింది. ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తే ఓటర్లకు రిస్క్‌ తక్కువగా ఉంటుందన్న దానిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఎస్‌ఈసీ చెబితే దానిపై తమ నిర్ణయం చెబుతామంటూ టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్‌ కమిటీ బుధవారం లేఖను పంపింది.
*రెండింటిలోనూ రిస్కే..*

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈవీఎం లేదా బ్యాలెట్‌ పత్రాలు.. ఏ రకంగా ఎన్నికలు నిర్వహించినా రిస్కేనని, ఈ రెండు పద్ధతుల్లోనూ సానుకూల, వ్యతిరేక అంశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఓటర్‌కు కోవిడ్‌ ఉన్నా లక్షణాలు కనిపించని అసింప్టమేటిక్‌గా ఉంటే ఏ విధానంలో నిర్వహించినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతరులకు సోకే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదీగాకుండా కెమికల్స్‌తో ప్రింట్‌ చేసిన న్యూస్‌ పేపర్‌ లేదా బ్యాలెట్‌ పేపర్‌పై వైరస్‌ ఎక్కువ సేపుండే అవకాశాలు తక్కువనేది ఇప్పటికే స్పష్టమైనందున ఆ పద్ధతి వైపే ఎస్‌ఈసీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
*ఎన్నికలు ఎప్పుడు..?*

ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై ఇంకా ఎస్‌ఈసీ స్పష్టతనివ్వడం లేదు. ప్రభుత్వం నుంచి వార్డుల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల నివేదిక అందగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన వివిధ ప్రక్రియలను పూర్తి చేయడంలో నిమగ్నమైనట్టు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున వచ్చే ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే వీలుంది. దీన్ని బట్టి నవంబర్‌ 2, 3వ వారం నుంచి డిసెంబర్‌ చివరివరకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. సంక్రాంతి పండుగ ముగిశాక వచ్చే మంచి రోజుల్లో ఎన్నికలు జరపాలనుకుంటే మాత్రం జనవరి 15 నుంచి 25వ తేదీల మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టుగా అంచనా వేస్తున్నారు.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment