Thursday, September 3, 2020

తెలంగాణ ప్రజా అసెంబ్లీ

హైదరాబాద్ : 04/09/2020

2020 సెప్టెంబర్ 4,5,6,7 తేదీలలో zoom లో జరిగే *తెలంగాణ  ప్రజా అసెంబ్లీ*  కి స్వాగతం పలుకుతుంది *ప్రజా సంకల్పం & link Media*.

*మిత్రులారా*,
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7 నుండీ జరగబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశాలు కనీసం 15 రోజులు జరగబోతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు  ఎదుర్కుంటున్న సమస్యలను గొంతెత్తి చాటటానికి *తెలంగాణ ప్రజా అసెంబ్లీ* నిర్వహించటానికి ఇప్పుడొక అత్యవసర నేపధ్యం ఏర్పడింది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు తెన్నులను గమనిస్తే ప్రజల నిజమైన మౌలిక సమస్యలపై అక్కడ ఎక్కువ చర్చ జరుగుతున్నట్లు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీలో *ప్రతిపక్ష పార్టీల గొంతు బలహీన పడిపోతున్నది*. ప్రతిపక్ష పార్టీల శాసన సభ్యులలో , ఎక్కువ మందిని అధికార పక్షం తనలో కలిపేసుకుని ప్రజల సమస్యలను వినిపించే వారి గొంతును మరింత బలహీన పరిచింది. శాసన మండలి పరిస్తితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. 
దేశవ్యాప్తంగా నెలకొని వున్న ఆర్ధిక సంక్షోభం గత కొన్ని సంవత్సరాలుగా మరింత తీవ్రతరమైపోయింది. దీని కారణంగా తెలంగాణలో అత్యంత అణగారిన సెక్షన్ల ప్రజలు వివిధ రూపాలలో  తీవ్ర సమస్యలను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా *సన్న,చిన్నకారు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, ఆదివాసీలు, అసంఘటిత కార్మికులు, మహిళలు,ట్రాన్స్ జండర్లు, నిర్వాసితులు, విద్యార్ధులు* ఈ సమస్యల ప్రధాన బాధితులుగా ఉన్నారు. విద్యా,వైద్య రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిపోతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు దివాళా అంచుకు చేరుకున్నాయి. సర్వత్రా అవినీతి రాజ్యమేలుతున్నది. *ప్రజాస్వామిక, పౌర, మానవ  హక్కులు కనుమరుగై పోతున్నాయి*.  దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి. *మహిళలపై హింస, ఆడపిల్లలపై అత్యాచారాలు పెచ్చుపెరిగిపోయాయి*. 
కోవిద్ -19 కారణంగా లాక్ డౌన్  పైన పేర్కొన్న సంక్షోభాన్ని మరింతగా  తీవ్రతరం  చేసింది.   లాక్  డౌన్  సమయంలోనూ  ఆ తర్వాతా కూడా  రాష్ట్రంలో  వివిధ రంగాలలో పేద, కింది మధ్య తరగతి  సెక్షన్ల  ప్రజలు ఉపాధి కోల్పోయి  తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు  ఎదుర్కుంటున్నారు.  ప్రత్యేకించి *గృహ కార్మికులు, ట్రాన్సజెండర్ వ్యక్తులు, చిరు వ్యాపారస్తులు, ఆటో డైవర్లు, హోటల్ వర్కర్లు ఇంకా  ప్రయివేటు ఉపాధ్యాయులు, జర్నలిస్టులు వంటి  ప్రయివేటు ఉద్యోగులు వేల సంఖ్యలో ఉపాధి  కోల్పోయారు*. మరొక పక్క కొరోనా తీవ్రస్థాయిలో  వ్యాపిస్తున్న తరుణంలో సరిపడిన వైద్య సేవలు అందుబాటులో లేక పేద,  మధ్య  తరగతి  వర్గాల ప్రజలు  చెప్పనలవి కాని కష్టాలు అనుభవిస్తున్నారు. 
చట్ట సభలకు బయట కూడా *ప్రజల,ప్రజా సంఘాల ,ప్రతిపక్ష పార్టీల కదలికలపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి*. ప్రజా సంఘాల  సభలకు , సమావేశాలకు,  శాంతియుత నిరసన ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం అనుమతించక పోవడం మనం చూశాం. *ప్రజల పక్షాన గొంతు వినిపించే కార్యకర్తలపై,నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, కోర్టుల చుట్టూ తిప్పడం, బెయిల్ కు అవకాశం లేని కేసులు బనాయించి జైళ్లకు పంపడం సాధారణమైపోయింది.* 
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి. *ప్రభుత్వ పెద్దలకు విజ్ఞాపన పత్రాలు పంపించినా, నేరుగా మంత్రులను,అధికారులను  కలసి అందించినా, ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు*. మంత్రులూ,  ఎం‌ఎల్‌ఏ లు,  ఎం‌ఎల్‌సి లు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రజలతో, ప్రజా సంఘాలతో చర్చించి,  స్వంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్తితి ఉన్నప్పుడే  ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే  అవకాశం ఉంటుంది. 
ఈ నేపధ్యంలో రానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ ప్రజల నిజమైన సమస్యలను ముందుకు తెచ్చి చర్చించడానికి, ఆయా రంగాల పై నిర్ధిష్ట డిమాండ్లు ఆమోదించడానికి *తెలంగాణ ప్రజా  అసెంబ్లీ* నిర్వహించాలని నిర్ణయించాం. 2020 సెప్టెంబర్ 4,5,6 తేదీలలో *జూమ్* వేదికగా ఈ సమావేశాలు జరుగుతాయి. తెలంగాణ ప్రజా అసెంబ్లీ లో జరిగిన చర్చలు, వచ్చిన ప్రతిపాదనలు ,నిర్ధిష్ట డిమాండ్లు ఆధారంగా  *తెలంగాణ పీపుల్స్ చార్టర్* రూపొందించి  2020 సెప్టెంబర్ 7 న ప్రభుత్వానికి, మీడియా ద్వారా ప్రజలకు , చట్ట సభల ప్రజా ప్రతినిధులకు, అన్ని రాజకీయ పార్టీలకు నేరుగా అందించాలని ఈ ప్రజా అసెంబ్లీ లక్ష్యం. 
*ఈ ప్రజా అసెంబ్లీ లో మీరు/మీ సంస్థ  భాగం పంచుకోవాలని కోరుతూ ఆహ్వానిస్తున్నాము.*

ఈ సమావేశాలలో వేరువేరు అంశాలపై జరిగే చర్చలలో మీ సంస్థ తరపున పాల్గొనవచ్చు. 
ఈ సమావేశాల గురించి మీరు పని చేస్తున్న ప్రాంతాలలో విస్తృత ప్రచారం చేసి జూమ్ ద్వారా, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా మీరు భాగం పంచుకోవచ్చు. 
ప్రజా అసెంబ్లీ లో ఆమోదించే డిమాండ్లకు విస్తృత ప్రచారం కల్పించడంలో,ప్రజల దృష్టికి,ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంలో, డిమాండ్ల సాధనకు జరిగే భవిష్యత్తు ఉద్యమాలలో భాగం పంచుకోవడానికి మీరు కలసి  రావచ్చు. 
    మీ ప్రతిస్పందన కోరుతూ.. 
మీరా సంఘమిత్ర -  ప్రజాఉద్యమాల జాతీయ వేదిక (NAPM)    
ఎస్ . ఆశాలత,  ఎస్.ఉషా సీతాలక్ష్మి -  మహిళా రైతుల హక్కుల వేదిక (MAKAAM)      
పి.శంకర్ - దళిత బహుజన్  ఫ్రంట్ (D BF )                                                                                
*ఎస్. జీవన్ కుమార్ -  మానవ హక్కుల వేదిక (HRF)* 
వై.అశోక్ కుమార్-  తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్  ఫెడరేషన్ (TPTF)          
అంబటి నాగయ్య-  తెలంగాణ  విద్యావంతుల వేదిక (TVV)
కన్నెగంటి రవి, విస్సా కిరణ్ కుమార్ -  రైతు స్వరాజ్య వేదిక (RSV)  
ఎం. వెంకటయ్య -  తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల  యూనియన్ (TVVU)      
కె. సజయ -  కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్ (CCC)  
ఎమ్. రాఘవాచారి  - పాలమూరు అధ్యయన వేదిక (PAV )
సిస్టర్ లిజి -  తెలంగాణ గృహ కార్మికుల యూనియన్(TDWU ) 
సయ్య ద్ బిలాల్ - క్యాంపెయిన్ ఫర్  హౌజింగ్  అండ్ టెన్యూరియల్  రైట్స్ (CHATRI)i
ఆర్.వెంకట్ రెడ్డి -  ఆల్ ఇండియా పేరెంట్స్  అసోయేషన్ (AIPA)

(వివరాలకు : PANDULA .SAIDULU  Ph . 9441661192 ;   KANNEGANTI RAVI,   Ph: 9912928422 )

Bapatla Krishnamohan 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment