Saturday, February 5, 2022
టీమిండియా కుర్రాళ్లు కుమ్మేశారు. 2022 అండర్ 19వరల్డ్(Under 19 world cup) కప్‌ని గెలుచుకున్నారు
Statue Of Equality: రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
Statue Of Equality: రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- బళ్ల సతీశ్
- బీబీసీ ప్రతినిధి

రామానుజాచార్యులకు హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల గ్రామంలో శంషాబాద్ విమానాశ్రయ దగ్గర్లో ఒక విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇది భారతదేశంలో రెండవ పొడవైన విగ్రహం, ప్రపంచంలోని పెద్ద వాటిలో 26వది అవుతుందని దాన్ని నిర్మించిన వారు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయస్తులైన శ్రీ వైష్ణవ పీఠాధిపతి త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి తన ఆశ్రమ ప్రాంగణంలో దీన్ని నిర్మిస్తున్నారు.
2014 నుంచి ఈ ప్రతిపాదనలు ఉండగా, ఇది 2021లో పూర్తయింది.
విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజాచార్య జన్మించి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా రామానుజ సహస్రాబ్ది సమారోహాన్ని నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతున్నట్లు ప్రకటించారు.

విగ్రహం ప్రత్యేకతలు:
ఈ వాస్తవ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. రామానుజాచార్య చేతిలోని త్రిదండం (సాధారణంగా వైష్ణవ పీఠాధిపతుల చేతిలో ఉంటుంది) ఎత్తు 135 అడుగులు.
మొత్తం వేదిక ఎత్తు 54 అడుగులు, పద్మ పీఠం ఎత్తు 27 అడుగులు. ఈ వేదికకు భద్రపీఠం అని పేరు పెట్టారు.
కింద పీఠంతో కలపి 216 అడుగులు ఉంటుందీ విగ్రహం. ఆ విగ్రహం ఉండే పీఠంపై 54 కలువ రేకులు, వాటి కింద 36 ఏనుగు శిల్పాలు, కలువ రేకులపై 18 శంఖాలు, 18 చక్రాలు, విగ్రహం దగ్గరకు ఎక్కడానికి 108 మెట్లు ఉన్నాయి.
వివిధ ద్రవిడ రాజ్యాల శిల్ప రీతుల మేళవింపు ఈ విగ్రహంలో కనిపిస్తుంది. విగ్రహం చేతి వేళ్ల గోర్ల నుంచి 135 అడుగుల భారీ దండం వరకూ ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ నిర్మాణం చేశారు. విగ్రహంలో రామానుజులు ధ్యాన ముద్రలో కనిపిస్తారు.
ఆ భద్రపీఠంలో 120 కేజీల బంగారు విగ్రహం పెడుతున్నారు. రామానుజాచార్య 120 ఏళ్లు జీవించారని, కాబట్టి అన్ని కేజీల బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు ప్రకటించారు.

కేవలం విగ్రహమే కాకుండా, అక్కడ మరో 108 చిన్న దేవాలయాలను నిర్మిస్తున్నారు. శ్రీ వైష్ణవ శాఖలోని వారు విష్ణువు, విష్ణువు అవతారాలకు చెందిన మొత్తం 108 గుళ్లను 108 దివ్య దేశాలుగా భావిస్తారు. ఆ దివ్య దేశాలన్నటినీ పోలిన నమూనా దేవాలయాలను ఇక్కడ నిర్మిస్తున్నారు. వాటిని కూడా ప్రత్యేకంగా అందంగా మలిచారు. హొయసల వాస్తు శైలిలో ఈ నిర్మాణాలు ఉంటాయి. మొత్తం 468 స్తంభాలు ఇక్కడ ఉంటాయి. వివిధ ప్రాంతాల శిల్పులు, నిపుణులు దీనికి పనిచేశారు.
ఈ విగ్రహాలకు అదనంగా అక్కడ రామానుజల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ, వైదిక్ లైబ్రరీ, పండిత సభలకు, సెమినార్లకు ఆడిటోరియం, ఓమ్నీ మాక్స్ థియేటర్ వంటి ఏర్పాట్లు చేశారు. అక్కడే ఒక మ్యూజికల్ ఫౌంటేన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ విగ్రహానికి సమతా మూర్తి, ఇంగ్లీషులో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. ''ప్రపంచాన్ని మరింత సమానత్వంతో జీవించగలిగే ప్రదేశంగా మార్చడానికి అందరికీ స్ఫూర్తినిచ్చేలా, సాంస్కృతికంగా ఈ సమతా మూర్తిని సమున్నత ప్రదేశంగా ఉంచాలనుకుంటున్నాం. వసుధైక కుటుంబం అనే భావాన్ని చాటేలా, రామానుజ సహస్రాబ్దిని జరుపుకుంటున్నాం. లక్షలాది మందిని సామాజిక వివక్ష నుంచి విముక్తి చేసిన వ్యక్తి రామానుజులు'' అని ప్రకటించారు చిన్న జీయర్.
వెయ్యి కోట్ల ప్రాజెక్ట్:
మొత్తం ప్రాజెక్టుకు 1,000 కోట్ల ఖర్చు అవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మొత్తం స్థలం 45 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ఆ స్థలాన్ని ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వర రావు విరాళంగా ఇచ్చినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మీడియాకు తెలిపారు. జూపల్లి రామేశ్వర రావు మై హోమ్స్ గ్రూపు అధినేత. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులు. ఈ వెయ్యి కోట్ల మొత్తాన్ని విరాళాల ద్వారానే సేకరించినట్టు జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమి (జీవా) ప్రకటించింది. వెయ్యి కోట్లలో వాస్త విగ్రహానికి 130 కోట్లు (పన్నులు కాకుండా) అయినట్టు ఆ సంస్థ ప్రకటించింది.
మేడిన్ చైనా:
చైనా దేశంలోని నాన్జింగ్ నగరానికి చెందిన చెంగ్యాంగ్ గ్రూపులో భాగమైన ఏరోజన్ కార్పొరేషన్ అనే కంపెనీ ఈ విగ్రహ నిర్మాణంలో భాగస్వామైంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ అనేక భారీ విగ్రహాలను రూపొందించింది. ఇందులో 7 వేల టన్నుల పంచలోహాలను ఉపయోగించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
బంగారు, వెండి, రాగి, కంచు, జింక్ పదార్థాలు ఉపయోగించారు. ఆరోజన్ కార్పొరేషన్ కీ, జీవా సంస్థకీ మధ్య విగ్రహ నిర్మాణం కోసం 2015 ఆగస్టు 14న ఒప్పందం కుదిరింది. దీనికి ప్రధాన స్థపతిగా డీఎన్వీ ప్రసాద్ వ్యవహరించారు. విగ్రహ నిర్మాణ ఒప్పందంపై జీవా తరపున రామేశ్వర రావు, ఆరోజన్ కార్పొరేషన్ తరపున జనరల్ మేనేజర్ మి జావో హుయా (MI ZHAO HUA) సంతకాలు చేశారు. భారతదేశానికి చెందిన ఒక కంపెనీతో పాటూ, వేర్వేరు దేశాలకు చెందిన అనేక కంపెనీలు పోటీ పడగా, చైనా కంపెనీకి ఈ పని అప్పగించారు.
ఎవరీ రామానుజులు:
''అందరి దుఃఖాలూ దూరం చేయడానికి నేనొక్కడినే నరకంపాలైనా ఆనందంగా అంగీకరిస్తాను. మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే. అతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది. ఆతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ''.. ఇవి రామానుజులు వేర్వేరు సందర్భాల్లో చెప్పిన మాటలు.
రామానుజాచార్య హిందూమతానికి చెందిన భక్తి ఉద్యమకారులు, సిద్ధాంతకర్త. క్రీస్తు శకం 1017లో పుట్టి 1137లో సమాధి అయ్యారు. తమిళనాడులో శ్రీపెరంబుదూరులో బ్రాహ్మణ కులంలో పుట్టారు. కాంచీపురంలో చదువుకున్నారు. అక్కడి వరదరాజ స్వామిని పూజించారు. శ్రీరంగం వీరి ప్రధాన కేంద్రం. ఆయన సమాధి (బృందావనం లేదా తిరుమేని) ఇప్పటికీ శ్రీరంగం రంగనాథ స్వామి గుడిలో ఉంది.
విశిష్టాద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని పాటించేవారినే శ్రీ వైష్ణవులుగా గుర్తిస్తారు. నుదుటన నిలువు నామం పెట్టుకుని భుజాలపై శాశ్వతంగా, శంఖ చక్రాల ముద్రలు వేసుకోవడం ఈ శాఖ/మతం లక్షణం. ఈ మత శాఖకు చెందిన సన్యాసాశ్రమం తీసుకున్న వారిని జీయర్లు అంటారు. ఇలయ పెరుమాళ్, ఎంబెరుమానార్, యతిరాజ, భాష్యకార వంటి పేర్లున్నాయి. వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా భాష్యం వంటి గ్రంథాలు రాశారు. శంకరాచార్యుల అద్వైతాన్ని సిద్ధాంతపరంగా తీవ్రంగా విభేధించారు.
శ్రీవైష్ణవుల మాటల్లో చెప్పాలంటే..‘‘ గోష్ఠీపూర్ణుడనే గురువు చెప్పిన రహస్య అష్టాక్షరీ మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ, గుడి గోపురం ఎక్కి గట్టిగా అందిరికీ వినిపించేలా చెప్పారు. ఎవరికైనా చెబితే విన్న వారు పుణ్యాత్ములు, చెప్పిన వారు పాపాత్ములు అవుతారన్న నిబంధనను కావాలని అతిక్రమించారు. అందరికీ పుణ్యం వచ్చినప్పుడు తనకు పాపం వచ్చినా పర్వాలేదనేది ఆయన సిద్ధాంతం. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయ పూజా విధానాన్ని వ్యవస్థీకృతం చేసి, పర్యవేక్షణకు అక్కడ జీయంగార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కులోత్తుంగ చోళుడు శైవ మత భక్తితో వైష్ణవులను హింసిచినప్పుడు అక్కడ నుంచి తరలించిన ఉత్సవ మూర్తులతో తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి కట్టించారు. కొన్ని దేవాలయాలలో దళితుల ఆలయ ప్రవేశానికి కృషి చేశారు. కింది కులాల వారిని వైష్ణవులుగా (మతం) మార్చారు. కొందరికి ఆలయంలో అర్చకత్వ అవకాశం కూడా కల్పించారు’’.
భారీ యజ్ఞం:
ఆధునిక ప్రపంచ చరిత్రలో పెద్దదిగా చెబుతోన్న ఒక యజ్ఞం కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేస్తున్నారు. 144 హోమశాలలు, 1035 యజ్ఞ కుండాలు, 5 వేల మంది వేద పండితులతో శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం చేస్తున్నారు. 14 రోజుల పాటు సాగే ఈ యజ్ఞంలో నాలుగు వేదాల్లోని 9 శాఖల మంత్రాలు చదువుతారు. నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని కోటి సార్లు జపించనున్నారు. దీని కోసం లక్షన్నర కేజీల స్వచ్ఛమైన నెయ్యి దేశీ ఆవుల పాల నుంచి సేకరించారు. రాజస్థాన్ పత్మెద (Pathmeda) ప్రాంతం నుంచి ఈ నెయ్యి సేకరించారు. ఇందుకు ఆరు నెలల సమయం పట్టింది. యజ్ఞాల కోసం మాత్రమే వాడే నాలుగు రకాల చెట్లకు చెందిన సమిధలు సేకరించారు.
ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ 216 అడుగుల విగ్రహం, 108 దివ్యదేశాలను ఆవిష్కరిస్తారు. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామనాథ కోవింద్ 120 కేజీల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 14 రోజుల పాటూ జరిగే ఈ ఉత్సవాల్లో వీరే కాకుండా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారు.
హైదరాబాద్‌కి కొత్త ఆకర్షణ:
హైదరాబాద్ లో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలతో పాటు ఈ విగ్రహం కూడా ఒక కొత్త ఆకర్షణ కానుంది. యాదాద్రి దేవాలయంతో పాటు రామానుజ విగ్రహం కూడా విష్ణు భక్తులను, ఇతరులను ఆకర్షించి, హైదరాబాద్ పర్యటనలను పెంచే అవకాశాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో చర్చ:
అయితే ఇంత భారీ విగ్రహం ఏర్పాటుపై, ఆ విగ్రహానికి సమతా మూర్తి అని పెట్టిన పేరు తీవ్రమైన చర్చ జరిగింది. రామానుజులు కొంత అభ్యుదయ భావాలు బోధించి ఉండవచ్చు కానీ, అవి కుల వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపినవి కావు అంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెట్టారు. అదే సమయంలో, ఈ విగ్రహాన్ని నిర్మిస్తోన్న చిన్న జీయర్ స్వామి గతంలో ‘‘కులాలు పోకూడదు, కులాలు ఉండాలి, ఎవరి పని వారు చేసుకోవాలి’’ అని చెప్పిన మాటలు కూడా విమర్శలకు దారి తీసాయి. ఇంత ఖర్చుతో భారీ విగ్రహం పెట్టడంపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

Friday, February 4, 2022
బీజేపీ మాజీ ఎంపీ జగ్గారెడ్డి కన్నుమూత.......!
*బీజేపీ మాజీ ఎంపీ జగ్గారెడ్డి కన్నుమూత.......!*
హనుమకొండ: బీజేపీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు.శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంలో ఆయనకు ఇబ్బందికలగడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.
జంగారెడ్డి పార్థివదేహానికి హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు పార్టీ కార్యకర్తలు నాయకులు నివాళులర్పిస్తారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చందుపట్ల జంగారెడ్డి మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.ఆయన స్వస్థలం హన్మకొండ. చందుపట్ల జంగారెడ్డి ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, హనుమకొండ ఎంపీగా గెలుపొదారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ఓడించిన ఘనత జంగారెడ్డిది. 1984లో దేశ వ్యాప్తంగా బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉంటే అందులో ఒకరు జంగారెడ్డి. జంగారెడ్డి మృతిపట్ల బీజేపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
*link Media ప్రజల పక్షం🖋️*
ముచ్చింతల్ లో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్ డీజిపీ మహేందర్ రెడ్డి!
*ముచ్చింతల్ లో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్ డీజిపీ మహేందర్ రెడ్డి!*
హైదరాబాద్: ముచ్చింతల్ లో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహా కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు శుక్రవారం ముచ్చింతల్ లో సమీక్షించారు.అడిషనల్ డీజీలు జితేందర్, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్, సైబరాబాద్ సి.పీ స్టీఫెన్ రవీంద్ర , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి ముచ్చింతల్ శ్రీరామ నగరాన్ని సందర్శించారు.ఈ నెల 14 వ తేదీ వరకు జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టిన ఏర్పాట్లను సీఎస్, డీజీపీ లు పరిశీలించారు.
ముందుగా, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. మొత్తం ముచ్చింతల్ ప్రాంతాన్ని, ఇక్కడికి వచ్చే మార్గాలన్నింటిని కవర్ చేసిన సి.సి. టీవీలను పరిశీలించే ప్రత్యేక కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. ఈ సందర్బంగా వివిధ సామాజిక మాధ్యమాలు, వార్తా ఛానెళ్లలో వచ్చే అనుకూల, ప్రతికూల వార్తల ను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు ఆదేశాలు అందచేసే విభాగాన్ని సీఎస్, డీజీపీ పరిశీలించారు. అనంతరం 1035 యాగ కుండలిలు ఏర్పాటు చేసిన యాగశాలను, అక్కడ అగ్నిమాపక శాఖ, విద్యుత్, శానిటేషన్ విభాగాలు చేసిన ఏర్పాట్లను కూడా వారు పరిశీలించారు. ప్రధాని, ఇతర ప్రముఖులు దిగే హెలిపాడ్ ను, ప్రధాని స్వల్ప సమయం బస చేసే గెస్ట్ హౌస్ ను పరిశీలించారు.
ప్రపంచంలొనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజుల విగ్రహ స్థలాన్ని సోమేశ్ కుమార్, మహేందర్ రెడ్డి లు పరిశీలించారు. ప్రధాని ఆవిష్కరించనున్న సమతా మూర్తి విగ్రహ పరిసర ప్రాంతాలు, ప్రధాని వచ్చే మార్గాలను పరిశీలించారు. ప్రధానితో పాటు పాల్గొనే వారి జాబితాను కచ్చితంగా ఎస్పీజి అనుమతించాల్సి ఉంటుందని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఇక్కడే ఏర్పాటుచేసిన లేజర్ షో ప్రాంతంలో బందోబస్తును సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం, ప్రధాన యాగశాలకు చినజీయర్ స్వామి నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం, ప్రధాని దిగనున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఏర్పాట్లను సి.ఎస్., డీజీపీ పరిశీలించారు.
*link Media ప్రజల పక్షం🖋️*
జడ్, కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ....!
*జడ్, కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ....!*
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనకు కేటాయించిన 'జడ్' కేటగిరీ భద్రతను తిరస్కరించారు.ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయనకు 'జడ్' కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జడ్ కేటగిరీ కింద 22 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కేటాయించనుంది. వీరిలో నలుగురు నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు. అయితే కేంద్ర నిర్ణయాన్ని అసదుద్దీన్ తిరస్కరించారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో తనపై జరిగిన దాడి అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన జెడ్ కేటగిరి భద్రతను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. నేను చావుకు భయపడే వాడిని కాను. నాకు ప్రజలే రక్షకులు. నాపై దాడి చేసిన వారిపై ఉపా యాక్ట్ వర్తింపజేయాలి' అని అసదుద్దీన్ ఓవైసీ కోరారుఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్-ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.
*link Media ప్రజల పక్షం🖋️*
Thursday, February 3, 2022
NEET: 'సీఎం సార్.. హెల్ప్ మీ'.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కి తూర్పు గోదావరి విద్యార్థి వేడుకోలు
NEET: 'సీఎం సార్.. హెల్ప్ మీ'.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కి తూర్పు గోదావరి విద్యార్థి వేడుకోలు - ప్రెస్ రివ్యూ

స్టాలిన్‌ను కలిసి నీట్ రద్దుకు ప్రయత్నించాలని కోరుతున్న విద్యార్థి
‘‘తమిళనాడు సీఎం స్టాలిన్ సచివాలయానికి వెళ్తుండగా.. ఎన్.సతీష్ అనే విద్యార్థి 'సీఎం సార్.. హెల్ప్ మీ' అనే ప్లకార్డుతో రోడ్డు పక్కన నిల్చున్నాడు.
సీఎం.. కాన్వాయ్ ఆపి ఆ విద్యార్థిని దగ్గరకు పిలిచారు. 'సార్.. నేను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా వాసిని. ప్లస్‌టూలో మంచి మార్కులు సాధించినా, నీట్ ప్రవేశ పరీక్ష కారణంగా వైద్య కోర్సులో చేరలేకపోయాను.
నీట్ రద్దు కోసం మీ ప్రభుత్వం ఎంతో పోరాడుతోంది. మీ మద్దతు మా రాష్ట్రానికీ కావాలి. నీట్ నుంచి ఒక్క తమిళనాడుకే కాకుండా దేశం మొత్తానికి విముక్తి కల్పించండి సార్' అంటూ చేతులెత్తి మొక్కాడు.
అయితే, తమిళనాడు ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ తిప్పిపంపడం గమనార్హం
Wednesday, February 2, 2022
ప్రత్యక్ష తరగతుల తో పాటు ఆన్ లైన్ భోధన కొనసాగించాలి.... టి. హైకోర్ట్*
*ప్రత్యక్ష తరగతుల తో పాటు ఆన్ లైన్ భోధన కొనసాగించాలి.... టి. హైకోర్ట్*
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పేర్కొంది. సమ్మక్క జాతరలో కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని స్పష్టం చేసింది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి హైకోర్టు తెలిపింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. ఈ అంశాలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం కరోనా పరిస్థితులపై విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది
*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com