Thursday, June 30, 2022

ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుల.... నమోదులో జాప్యమొద్దు

*ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుల.... నమోదులో జాప్యమొద్దు....*

*రాష్ట్రాలకు కేంద్రం లేఖ*

దిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదుల నమోదులో జాప్యం చేయవద్దని కోరుతూ కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.అదేవిధంగా ఈ కేసుల్లో విచారణ రెండు నెలలు దాటినా కొనసాగుతూ ఉంటే అటువంటి కేసులపై నిశిత దృష్టి సారించాలని కోరింది. ప్రాసిక్యూషన్‌ తరఫు సాక్షులు సకాలంలో హాజరయ్యేలా చూసి, వారికి తగిన రక్షణ కల్పించే బాధ్యతను జిల్లా ఎస్పీలు తీసుకుంటే విచారణలు శరవేగంతో ముగుస్తాయని పేర్కొంది. ఈ కేసుల్లో ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదయ్యాక రెండు నెలలు దాటినా విచారణలు కొనసాగుతున్న సందర్భాల్లో ప్రతి మూణ్నెళ్లకు ఒకసారి జిల్లా, రాష్ట్రస్థాయి నివేదికల్లో పేర్కొనాలని సూచించింది.

ఈ నివేదికలను జిల్లా సెషన్స్‌ జడ్జి అధ్యక్షతన జరిగే సమావేశాల్లో జిల్లా ఎస్పీ, పబ్లిక్‌ ప్రాసిక్యూటరు సమీక్షిస్తారు. అవసరమైతే ప్రత్యేకంగా డీఎస్పీలను నియమించి విచారణ వేగవంతంగా సాగేలా చూడాలని హోం మంత్రిత్వశాఖ కోరింది. ఎస్సీ, ఎస్టీల జాతీయ కమిషన్‌తోపాటు పలు మార్గాల నుంచి వచ్చే వేధింపుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు సమీక్షించి తగువిధంగా స్పందించాలని కోరింది. ఇటువంటి వేధింపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. ఎస్సీ, ఎస్టీల ప్రాణాలతోపాటు ఆస్తుల పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. ఆయా ప్రాంతాల్లో తగినంతగా పోలీసు సిబ్బంది ఉండేలా నియామకాలు జరపాలని సూచించింది.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment