*ఎదురు చెప్పే వాళ్ళను నేను పట్టించుకోను.... నన్ను ఎవరూ అడ్డుకోలేరు.... గవర్నర్ తమిళ సై*
హైదరాబాద్: తెలంగాణ మహిళలు ఇబ్బందులు పడుతుంటే తాను చూస్తూ ఊరుకోనని.. వారి కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు.వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ఒక బలమైన శక్తిగా ముందుంటానని చెప్పారు. తమిళిసై ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్‌లో భాగంగా మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేజ్ మీద ఓ వృద్ధురాలిని కూర్చోబెట్టుకుని మహిళల సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా దర్బార్‌కు వచ్చిన మహిళలను ఉద్దేశిస్తూ తమిళిసై తెలుగులో ప్రసంగించడం విశేషం.
''గవర్నర్ ప్రజలను కలుస్తారా? అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ప్రజల కోసమే అని గుర్తుంచుకోవాలి. సెక్యూరిటీ వాళ్లు వద్దన్నా కొవిడ్ సమయంలో రోగులను పరమర్శించాను. మహిళలు సమాజంలో ఎక్కువగా బాధింపబడుతున్నారు. ఒక మహిళగా బాధిత మహిళలకు అండగా ఉండి, ఆదరించాలని ఆశిస్తున్నాను. నా తెలంగాణ మహిళలకు తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. మహిళలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాను. ఈ విషయంలో ఎదురు చెప్పే వాళ్లను నేను పట్టించుకోను. నిరసనకారుల గురించి నేను ఆందోళన పడటం లేదు. తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలి. ఒక సోదరిలా తెలంగాణ మహిళల వెన్నంటి ఉంటాను. నన్ను ఎవరూ అడ్డుకోలేరు. బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తాను. వాటికి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. విధానం ఏదైనా ప్రజల కోసమే పని చేయాలి. వినిపించని మహిళల స్వరం కూడా వినిపించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఇలాంటి మద్దతు చాలా అవసరం. మనం గెలుస్తాం.. మన గెలుపును ఎవరూ ఆపలేరు'' అని మహిళలకు గవర్నర్ భరోసా ఇచ్చారు.
*ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు....*
24 గంటల క్రితమే మహిళలను కలవాలని నిర్ణయం తీసుకున్నాను. మంచి స్పందన వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముందుగా మహిళా దర్బార్ నిర్వహించాను. మహిళలకు అండగా ఉండాలనే మహిళా దర్బార్ నిర్వహించాను. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. కొందరు రాజ్‌భవన్‌లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజ్‌భవన్‌కు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉంది. ఇది పొలిటికల్ కార్యాలయం కాదు.. నేను చేయదగిన కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నా. మహిళా దర్బార్‌ను భవిష్యత్తులోనూ కొనసాగిస్తాను. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల కోసమే ఉన్నాయి. రాజ్‌భవన్‌ను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ప్రభుత్వానికి పంపిస్తాను. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నా. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఎన్నికైన ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను. ప్రభుత్వం కూడా అలాగే స్పందించాలి. ప్రభుత్వం ప్రొటోకాల్ సరిగా పాటించడం లేదు. అది నన్ను ఆపలేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో పని చేస్తున్నా'' అని గవర్నర్ పేర్కొన్నారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment