*ఎన్నికల్లో ఓడినా బీజేపీకీ బిగ్ ప్లస్.... ఎందుకో తెలుసా....?*
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడినా తమకు ఓట్లను గణనీయంగా పెంచుకోగలిగింది. దీంతో నియోజకవర్గంలో బీజేపీ బలం పెరిగింది.2018 ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి 12,725 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ప్రస్తుత ఉప ఎన్నికల్లో మాత్రం భారీగా ఓట్లు పెరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రాజగోపాల్‌రెడ్డికి 86,697 ఓట్లు లభించాయి. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోల్చితే 73,972 ఓట్లు పెరిగాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో ప్రత్యామ్నాయం బీజేపీ అనే అంశం ప్రజల్లోకి వెళ్లినట్లయింది. ఉప ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం చేసిన బీజేపీ తమ బలాన్ని పెంచుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో సహా పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఉధృతంగా ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, కమిటీ సమన్వయకర్త గంగిడి మనోహర్‌రెడ్డి దగ్గరుండీ ప్రచారాన్ని పర్యవేక్షించారు. అన్ని మండలాలకు ఇన్‌ఛారీ్జలను నియమించి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ సభతో పాటు, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైనా నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలోకి నెట్టింది. ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. భారీ మెజారిటీతో గెలుస్తామని టీఆర్‌ఎస్ భావించినా మెజారిటీని తగ్గించగలిగింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయినప్పటికీ మునుగోడులో ఆ పార్టీ మరింత పుంజుకుంది. వచ్చే అసెంబ్లీ అన్నికల్లో మరింతగా దూసుకెళ్లవచ్చన్న అంచనాకు వచ్చింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment