Saturday, November 12, 2022

బీజేపీ కార్యకర్తల పోరాటం అభినందనీయం.... నన్ను తిట్టినా పర్వాలేదు కానీ,... ప్రధాని మోదీ....!

*బీజేపీ కార్యకర్తల పోరాటం అభినందనీయం.... నన్ను తిట్టినా పర్వాలేదు కానీ,... ప్రధాని మోదీ....!*

హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.అయితే తెలంగాణలో చీకట్లు తొలగిపోవాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. శనివారం రామగుండం పర్యటనకు బయలుదేరే ముందు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ బయట బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

భారత్‌ మాతా కీ జై.. నినాదంతో తన ప్రసంగం ప్రారంభించారు ప్రధాని మోదీ. ''రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయబోతున్నాం. హైదరాబాద్‌లో కార్యకర్తలతో మాట్లాడాలని బండి సంజయ్‌ కోరారు. నేను కూడా మీలాగే బీజేపీకి చెందిన ఓ చిన్న కార్యకర్తను. తెలంగాణలో బీజేపీ కార్యకర్తల తీరు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎవరికీ భయపడకుండా పని చేస్తున్నారు. మీరు ఎంత గట్టిగా పోరాడారో మునుగోడు ఉప ఎన్నికను చూస్తే అర్థమవుతుంది.

తెలంగాణ పేరుతో పార్టీ పెట్టినవాళ్లు.. పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేదు. తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మునుగోడు బైపోల్‌ కోసం.. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వచ్చారు. ఒక్క ఉప ఎన్నిక కోసం ప్రభుత్వమే తరలివచ్చింది.

అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు యత్నిస్తున్నారు. కానీ, ఆన్‌లైన్‌ పేమెంట్స్‌తో అవినీతికి చెక్‌ పడుతోంది. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఐటీ హబ్‌ అయిన హైదరాబాద్‌లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. కేబినెట్‌లో ఎవరినీ ఉంచాలో.. ఎవరిని తొలగించాలో ఆ మూఢనమ్మకాలే నిర్ణయిస్తున్నాయి. తెలంగాణలో జరిగే ఈ వ్యవహారం దేశానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ ఫస్ట్‌ కాదు.. పీపుల్స్‌ ఫస్ట్‌ అనేది బీజేపీ నినాదం.

22 ఏళ్లుగా నన్ను తిట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. మోదీని తిట్టేవాళ్లను మీరు(కార్యకర్తలను ఉద్దేశించి..) పట్టించుకోవద్దు. వాళ్లకు నన్ను తిట్టడం తప్ప వేరే పనిలేదు. తిట్లు తింటూనే బీజేపీ పెరిగి.. పెద్దైంది. ప్రతీరోజూ రెండు, మూడుకేజీల తిట్లను తింటాను. అందుకే అలిసిపోను. ఆ తిట్లు ప్రోటీన్లుగా మారడంతో ప్రజాసేవ చేస్తాను. నన్ను, బీజేపీని తిడితే తెలంగాణకు లాభం ఉంటుందంటే తిట్టండి. కానీ, తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం సహించం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ఊరుకోం.

దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీ(బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి) పని తీరు చూస్తుంటే తెలంగాణలో చీకట్లు తొలగిపోయి.. కమలం వికసించడం ఖాయమనిపిస్తోంది అని కార్యకర్తల్లో జోష్‌ నింపారు ప్రధాని మోదీ.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment