Sunday, November 20, 2022

నకిలీ జీఎస్టీ అధికారులు.... అరెస్ట్

*నకిలీ జీఎస్టీ అధికారులు.... అరెస్ట్*

రూ. 28 కోట్ల మోసం

నిందితులపై పీడీ యాక్ట్‌

హైదరాబాద్/జీడిమెట్ల: జీఎస్టీ, కస్టమ్స్‌ అధికారులమంటూ నకిలీ ఐడీ కార్డులు సృష్టించి పలువురు వ్యాపారులను మోసం చేసి రూ.28 కోట్ల వసూళ్లకు పాల్పడిన ముఠాను బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.20 వేల నగదు, మూడు సెల్‌ ఫోన్లు, కారు, బంగారం కొనుగోలు చేసిన రసీదులు, ఏటీఎం కార్డులు, నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్‌ డీసీపీ గోనే సందీప్‌ శనివారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బురుజుకింది నారాయణగౌడ్‌(57) నగరంలోని బోడుప్పల్‌లో ఉంటున్నాడు. ఇతడు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకుడు. నాంపల్లిలోని జీఎస్టీ కార్యాలయంలో కార్లను అద్దెకు నడుపుతోన్నాడు. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న అధికారుల ఐడీ కార్డులు దొంగిలించి, నకిలీ ఐడీ కార్డులు తయారు చేయించాడు.

వరంగల్‌ జిల్లాకు చెందిన మేరుగు శైలజ (37) ప్రైవేట్‌ ఉద్యోగి. కాప్రాలో నివాసముంటోంది. ఆమె పేరు మీద కూడా జీఎస్టీ కమిషనర్‌గా ఐడీ కార్డు సృష్టించాడు. ఇద్దరూ బంగారం, స్టీలు, సిమెంట్‌ దుకాణ యజమానులు, బిల్డర్లతో మాట్లాడి జీఎస్టీ లేకుండా చూస్తామని నమ్మించి మోసం చేశారు. అనంతరం మొఖం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. నకిలీ అధికారులుగా గుర్తించి నారాయణగౌడ్‌, శైలజను అరెస్ట్‌ చేశారు. వీరిపై పేట్‌బషీరాబాద్‌, దుండిగల్‌, పహాడీషరీఫ్‌, ఎల్‌బీనగర్‌, నర్సాపూర్‌, మీర్‌పేట్‌, మేడిపల్లి, ఉప్పల్‌, కరీంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 13 కేసులు ఉన్నాయి. వీరు దాదాపు 50మంది నుంచి రూ.28 కోట్ల మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. నిందితులపై పీడీయాక్ట్‌ పెట్టనున్నట్టు డీసీపీ సందీప్‌ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్‌వోటీ సైబారాబాద్‌ ఏడీసీపీ పి.నారాయణ, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ జేమ్స్‌బాబు, సిబ్బందిని అభినందించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment