Monday, November 28, 2022

తెలుగు రాష్ట్రాల్లో రూ.1100 కోట్లు

*_గొలుసుకట్టు బద్మాష్ లు_*
_● తెలంగాణలో రూ 200 కోట్లు_
_● తెలుగు రాష్ట్రాల్లో రూ.1100 కోట్లు_
_● బొట్టుబిళ్లలు, వత్తులంటూ హైదరాబాద్ లో కుచ్చుటోపీ_
_● యంత్రాలు విక్రయించి రూ.కోట్లలో వసూలు_
_● గొలుసు కట్టు పథకాలతో దోపిడీ_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944)000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_ఇద్దరూ అనామకులే.! ప్రజల ఆశలే వారికి పెట్టుబడి. ‘కోటీశ్వరుడయ్యే అవకాశం పిలుస్తోంది రా.. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఇంకా ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ పేదవాడు ధనవంతుడు అవడం కేవలం సంకల్ప్‌ మార్ట్‌తోనే సాధ్యం’ అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో పెట్టుబడిదారులను ఆకర్షించారు సంకల్ప్‌ మార్ట్‌ నిర్వాహకులు. ఏడాది కాలంలోనే దాదాపు రూ.1,100 కోట్లు వసూలు చేశారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా బొట్టుబిళ్లలు, వత్తులంటూ కుచ్చుటోపీ పెట్టాడు._*

బాక్స్1
*_‘సంకల్పసిద్ధి’కి సంకెళ్లు_*
_ఐదుగురు నిందితుల అరెస్టు_

*_ఇప్పటి వరకు 170 కోట్ల వసూలు_*
‘సంకల్పసిద్ధి’ పేరిట ఆర్థిక మోసాలకు తెరదీసిన నిర్వాహకుల చేతులకు విజయవాడ పోలీసులు సంకెళ్లు వేశారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన సంకల్పసిద్ధి ఈకార్ట్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ అధినేత గుత్తా వేణుగోపాలకృష్ణను అరెస్టు చేశారు. ఆయనతోపాటు భార్య గంజాల లక్ష్మి, వేణు చెల్లెలు మావూరి వెంకట నాగలక్ష్మి, చిన్నాన్న కుమారుడు కర్ణాటక రాష్ట్రం బళ్లారి విద్యానగర్‌కు చెందిన గుత్తా కిశోర్‌, గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన డ్రైవర్‌ సయ్యద్‌ జాకీర్‌ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ కాంతిరాణా సోమవారం వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా వేణుగోపాలకృష్ణ కొన్నాళ్ల కిందట కర్ణాటకలోని హోస్పేటకు వలస వెళ్లారు. ఆ తర్వాత విజయవాడకు వచ్చి, హోటల్‌లో సర్వర్‌గా, లారీ క్లీనర్‌గా, స్వీపర్‌గా పనిచేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఎన్‌మార్ట్‌, ఫ్యూచర్‌మార్ట్‌ వంటి మనీ సర్క్యులేషన్‌ కంపెనీల్లో చేరారు. ఇక్కడే మల్టీలెవర్‌ మార్కెటింగ్‌ స్కీంలపై అవగాహన పెంచుకున్నాడు. తర్వాత సొంతంగా ఒక మల్టీలెవర్‌ మార్కెటింగ్‌ సంస్థను నెలకొల్పాలని భావించి, హైదరాబాద్‌కు మకాం మార్చి అక్కడ ‘ప్లాంట్‌ ఎన్రిచ్‌ ఎంటర్‌ప్రైజస్‌’ అనే మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థను నెలకొల్పారు. కొన్నాళ్ల తర్వాత విజయవాడలో సంకల్పసిద్ధి సంస్థను ఏర్పాటుచేశారు. కరోనా సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్న సందేశాన్ని ప్రచారం చేశారు. సంకల్పసిద్ధి సంస్థకు గుత్తా వేణుగోపాలకృష్ణ డైరెక్టర్‌గా, ఆయన చిన్నాన్న కుమారుడు గుత్తా కిశోర్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థలను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీ్‌సలో ఎగుమతులు, దిగుమతులు నిర్వహించే కేటగిరిలో రిజిస్ర్టేషన్‌ చేయించారు.

*_మోసానికి ఐదు మెట్లు:_*
ప్రజల నుంచి డబ్బులు వసూలుకి వేణుగోపాలకృష్ణ 5 మెట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో పథకానికి ఒక్కో పేరుపెట్టి ప్రచారం చేశారు.

■ ‘సూపర్‌ మార్కెట్‌’ పథకంలో ఒక వ్యక్తి రూ.3 వేలు చెల్లిస్తే సంకల్పసిద్ధి మార్ట్‌ నుంచి 28 రకాల నిత్యావసర సరుకులు ఇస్తారు. రోజుకు రూ.10 చొప్పున 300 రోజులపాటు క్యాష్‌బ్యాక్‌ ఇస్తారు.

■ ‘బంగారం’ పథకంలో ఒక వ్యక్తి రూ.లక్షతో 2 సవర్ల బంగారం కొనుగోలుచేస్తే, దీనికి 30ు క్యాష్‌బ్యాక్‌ ఇస్తారు. రోజుకు రూ.100 క్యాష్‌బ్యాక్‌గా వ్యాలెట్స్‌లో జమ చేస్తారు.

■ ‘ఓపెన్‌ ప్లాట్‌’ పథకం కింద ఒక వ్యక్తి రూ.5లక్షలతో ఒక సెంటు భూమి కొనుగోలు చేస్తే దానిని రిజిస్టర్‌ చేయడంతోపాటు 300 రోజులపాటు 30ు సొమ్మును వ్యాలెట్‌లో వేస్తారు.

■ ‘ఎర్రచందనం’ పథకంలో ఒక్కొక్క మొక్కను రూ.6 వేలకు కొనుగోలు చేస్తే, 15ఏళ్ల తర్వాత ఆ మొక్కపై సభ్యుడికి రూ.5 లక్షలు చెల్లిస్తారు. + ‘నగదు’ పథకంలో సభ్యుడు కొంత మొత్తాన్ని చెల్లించి సంస్థలో చేరితే రోజుకు 1ు చొప్పున 300 రోజులపాటు చెల్లిస్తారు. ఆ సభ్యులు ఎవరినైనా చేర్పిస్తే కమీషన్‌ ఇస్తారు.

*_కొద్ది నెలల నుంచి బ్రేకులు:_*
వివిధ పథకాల ద్వారా 300 రోజులపాటు కమీషన్లు, క్యాష్‌బ్యాక్‌లు ఉంటాయని చెప్పిన వేణుగోపాలకృష్ణ మూడు నెలల నుంచి వేగం తగ్గించారు. కొంతమందికి చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో బాధితులు విజయవాడ పోలీసులను ఆశ్రయిస్తే, మరికొందరు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను ఐదు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా ఉంచారు. నిందితుల నుంచి పోలీసులు రెండు కార్లు, 10 సెల్‌ఫోన్లు, 728 గ్రాముల బంగారం, 9.5 కిలోల వెండి వస్తువులు, రూ.51.60 లక్షల నగదు, 4 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను సీజ్‌ చేశారు. బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను స్తంభింపజేశారు. వేణుగోపాలకృష్ణ ఇంట్లో దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినా, మరికొందరు పరారీలో ఉన్నారు.

*_నిందితుడి నేపథ్యమిది..._*
కర్ణాటకకు చెందిన వేణుగోపాలకృష్ణ ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. విజయవాడకు వచ్చి చిన్నచిన్న పనులు చేసేవాడు. లారీ క్లీనర్‌గా పనిచేస్తూనే మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌లలో ఏజెంట్‌గా పనిచేస్తూ దానిపై అవగాహన పెంచుకున్నాడు. 2021 అక్టోబరులో విజయవాడ దుర్గాఅగ్రహారంలో ‘సంకల్ప్‌మార్ట్‌’ను ప్రారంభించాడు. 2022 మే నెలలో ‘సంకల్ప్‌ సిద్ధి ఈకార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో కంపెనీ స్థాపించి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, మార్కెటింగ్‌ వ్యాపారానికి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నుంచి అనుమతి పొందారు. ఆ ముసుగులో చట్టవిరుద్ధమైన మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌ నడిపారు. సభ్యులుగా చేరిన వారు మరికొందరిని చేర్పిస్తే ఆకర్షణీయమైన ఆదాయం వస్తుందని నమ్మించాడు. సూపర్‌మార్కెట్‌, బంగారం, ఓపెన్‌ ప్లాట్లు, ఎర్రచందనం మొక్కల ఆశ చూపుతూ రూ.కోట్లు సేకరించాడు. వ్యాపారం చేయకుండానే రొటేషన్‌ పద్ధతిలో పరిమితంగా తిరిగి చెల్లిస్తూ డబ్బును దారి మళ్లించాడు. చెల్లింపులు ఆలస్యం కావటంతో ఒక వినియోగదారుడి ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల విచారణలో పోలీసులు కొన్ని ఆస్తులను గుర్తించారు. నిందితుల పేరుపై ఉన్న బ్యాంకు ఖాతాలు, కొన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను వారు స్తంభింపజేశారు. నిందితులతోపాటు మరో ఇద్దరు లేదా ముగ్గురు కీలక భాగస్వాములు ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయంపైనా చర్చ సాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు.

బాక్స్ 2:

*_బొట్టుబిళ్లలు, వత్తులంటూ కుచ్చుటోపీ_*
_● యంత్రాలు విక్రయించి రూ.కోట్లలో వసూలు_

 ‘‘బొట్టుబిళ్లలు, దీపం వత్తుల తయారీతో ఇంటి దగ్గరే ఉంటూ నెలకు రూ.30 వేల సంపాదన’’ అంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి తెరలేపాడు. ఏకంగా 1,400 మందితో వాటి తయారీ యంత్రాలు కొనుగోలు చేయించాడు. సరకు కిలోల లెక్కన తనకు విక్రయిస్తే లాభాలు ఇస్తానంటూ నమ్మించి నిండా ముంచాడు. రూ.కోట్లలో మోసానికి పాల్పడి బోర్డు తిప్పేసిన ఆ ఘరానా మోసం ఏఎస్‌రావు నగర్‌లో వెలుగులోకి వచ్చింది. సోమవారం బాధితులు కుషాయిగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

*_ఆర్మీలో పనిచేసినట్లు చెప్పి..:_*
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన రావులకొల్లు రమేశ్‌ ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌(గోయింగ్‌ టుగెదర్‌) పేరుతో ఏఎస్‌రావునగర్‌లో గతేడాది కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించే ఇతడు ఇంటి దగ్గరే ఉంటూ బొట్టు బిళ్లలు, వత్తుల తయారీ ద్వారా రూ.వేలల్లో సంపాదించవచ్చంటూ వీడియోలు పోస్టు చేసేవాడు. ముడి సరకు ఇస్తామని తయారు చేసిన ఉత్పత్తిని తానే కొంటామని నమ్మించాడు. రూ.30 వేల లోపు ఉండే వత్తుల తయారీ యంత్రాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షలకు, బొట్టు బిళ్లల యంత్రాన్ని రూ.2.80 లక్షలకు విక్రయించి.. మూడు సంవత్సరాలకు ఒప్పందం చేసుకునే వాడు. దూది కిలో రూ.250 చొప్పున అమ్మి.. వత్తుల్ని రూ.550కి కొనేవాడు, బొట్టుబిళ్లల సరకును రూ.2 వేలకు ఇచ్చి.. రూ.2,600 కొంటానని ఒప్పందంలో పేర్కొనేవాడు.

*_మొత్తం 1400 మంది_*
ఏడాది కాలంలో రమేశ్‌ 842 మందికి వత్తుల తయారీ, 600 మందికి బొట్టు బిళ్లల యంత్రాలు అమ్మాడు. కొన్నవారిలో నాలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. కొత్తవారిని చేరిస్తే కమీషన్లు ఇచ్చాడు. తొలి రెండు నెలలు ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించిన రమేశ్‌.. ఆ తర్వాత వాయిదా వేస్తూ వచ్చాడు. కొన్ని రోజులుగా ఉత్పత్తులను తీసుకోవడం నిలిపేయడం, చెల్లింపులు ఆపడంతో కొందరు నిలదీశారు. డబ్బు తర్వాత ఇస్తామంటూ కార్యాలయంలో పనిచేసే సుధాకర్‌, రామారావు సర్దిచెప్పేవారు. అనుమానం వచ్చిన బాధితులు ఆదివారం కార్యాలయానికి వెళ్లగా రమేశ్‌ కనిపించలేదు. దీంతో  ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్‌ ఒకరు తన ఆటోపై లోన్‌ తీసుకుని డబ్బు కట్టారు. కొందరు మహిళలు డ్వాక్రా రుణాలను ఇందుకు ఖర్చు చేశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.

No comments:

Post a Comment