Monday, May 17, 2021

కరోనా ముప్పు నుంచి చిన్నారులను కాపాడుకోవాలి

హైదరాబాద్ : 18/05/2021

కరోనా ముప్పు నుంచి చిన్నారులను కాపాడుకోవాలి

కరోనా ముప్పు నుంచి చిన్నారులను కాపాడుకోవాలి
  • వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి
  • బయటకెళ్లే పెద్దలు పిల్లలకు దూరంగా ఉండాలి
  • ఇంటిని ఎప్పుటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలి
  • కఠిన జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు
  • ఇమ్యూనిటీ పెంచే ఆహారం అందించాలి

కరోనాకు పెద్దలే కాదు.. పిల్లలూ గజగజ వణికిపోతున్నారు. వయసుతో తారతమ్యం లేకుండా అందర్నీ చుట్టేస్తున్నది. మహమ్మారి విజృంభణ వేళ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెద్దలతో పోల్చితే పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువని, వైరస్‌ త్వరగా సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగం లేదా వ్యాపారం, ఇతర పనుల మీద బయటకెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని కోరుతున్నారు. ఇంట్లో కరోనా బారిన పడిన వారు పిల్లలను దూరంగా ఉంచాలని, వారు మహమ్మారి బారిన పడకుండా కఠిన నియమాలు పాటించడంతోపాటు ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. చిన్నారులకు ప్రధానంగా రోగ నిరోధకశక్తి(ఇమ్యూనిటీ) పెంచే ఆహారమందించాలని, పాలిచ్చే తల్లులు కొవిడ్‌ బారిన పడినా తగిన జాగ్రత్తలు పాటిస్తూ పాలివ్వడం ఎంతో మేలని సూచిస్తున్నారు.

కరోనా వయసుతో తారతమ్యాలు లేకుండా ముచ్చెమటలు పట్టిస్తున్నది. ముఖ్యంగా చిన్నారులను కూడా వదలకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలల సంరక్షణపై మరింత శ్రద్ధ అవసరమని, వారు కొవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు కఠిన నియమాలు పాటించడంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

పిల్లలపై కరోనా పంజా విసరకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి కుటుంబ సభ్యులదే. శిశువు నుంచి 12 ఏండ్ల లోపు పిల్లలను ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు పంపకూడదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ద్వారానే ఎక్కువగా చిన్నారులకు వైరస్‌ సోకుతున్నది. కొవిడ్‌ నిబంధనలను సరిగా పాటించకపోవడం, రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో పిల్లలు బాధితులవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ మిగతా వారితో పోల్చితే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. అదనంగా పలు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా చిన్నారులు వైరస్‌ బారిన పడకుండా ఉండేలా చూసుకోవచ్చు.

పాటించాల్సిన జాగ్రత్తలు..

  • చిన్నపిల్లలు ఉంటే కుటుంబసభ్యులంతా కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి. బయటకు వెళ్లిన ప్రతి సందర్భంలో మాస్కు ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి.
  • ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం స్నానం చేయనిదే లోపలికి రాకూడదు. పిల్లలను తాకరాదు.
  • సాధ్యమైనంత వరకు పిల్లలను ముద్దుపెట్టుకోవడం, పూర్తిగా దగ్గరికి తీసుకోవడం చేయరాదు. కొంత భౌతిక దూరం పాటిస్తే మంచిది.
  • మూడేండ్ల లోపు పిల్లలకు తినిపించేటప్పుడు ముందుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆపై వయసు వారికి స్వతహాగా తినడం నేర్పించాలి.
  • తినే ప్లేటు నుంచి టవల్‌, బాత్‌సోప్‌ వంటివి పిల్లలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
  • సన్నిహితులు ఎవరైనా ఇంటికి వస్తే.. పిల్లలను దూరంగా ఉంచాలి.
  • పండ్లు, పాలు తదితర వాటిని వేడినీటితో శుద్ధి చేసిన తర్వాతే ఇవ్వాలి.
  • ఇంటిని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలి. తద్వారా కొవిడ్‌ వైరస్సే కాదు. ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కూడా చిన్నారులను కాపాడుకోవచ్చు.
  • వేడుకలు, శుభకార్యాలు, ప్రయాణాలకు దూరంగా ఉంచాలి. ఒకవేళ తప్పనిసరి అయితే వ్యక్తిగత వాహనాలనే ఉపయోగించుకోవాలి. మాస్కులను తప్పనిసరిగా ధరించేలా చూడాలి.
  • అనారోగ్యానికి గురైతే వైద్యశాలలకు పరుగులు తీయకూడదు. ముందుగా ఆన్‌లైన్‌ మెడికల్‌ కన్సల్టెన్సీ ద్వారా వైద్యులను సంప్రదించాలి. వారు సూచిస్తేనే వైద్యశాలకు తీసుకెళ్లాలి.
  • ఐదేండ్లు పైబడిన పిల్లలకు మాస్కు ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడంపై అవగాహన కల్పించాలి.

ఇమ్యూనిటీ పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..

  • సాధారణ వ్యక్తులతో పోల్చినప్పుడు చిన్నారులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు కనీసం ఐదేండ్లు వచ్చేంత వరకు తరచుగా అంటు వ్యాధులకు, వైరస్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంటారు. అందుకే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • తల్లిపాల ద్వారానే ఎక్కువగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొవిడ్‌ బారిన పడినా.. తగిన జాగ్రత్తలను పాటిస్తూ పిల్లలకు తల్లిపాలను అందిస్తూనే ఉండాలి.
  • ఐదేండ్ల్లు వచ్చేంత వరకు పోలియో, న్యూమోనియా తదితర వ్యాక్సిన్లను వేస్తుంటారు. వీటి ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంటుంది. నిర్ణీత సమయంలో టీకాల ప్రక్రియ పూర్తి చేయాలి.
  • ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పులు, చేపలు, పాలు, గుడ్డు, ఆకుకూరలు ఇలా సమతుల ఆహారాన్ని ఎక్కువగా అందించాలి. ఇది ఇమ్యూనిటీ పెరుగుదలకు దోహదపడుతుంది.
  • పిల్లలకు తేనే, బెల్లం, వివిధ రకాల పండ్ల జ్యూస్‌లను అందించాలి. తద్వారా పోషకాలు ఎక్కువగా అందుతాయి. వేసవిలో డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు. చిరుతిళ్లు, జంక్‌ ఫుడ్‌లకు దూరంగా ఉంచాలి.

ఏసీఈ-2 తక్కువ ఉండటం వల్లే..

తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లలపై వైరస్‌ ప్రభావం తక్కువే. వారిపై వైరస్‌ అంతగా ఎఫెక్ట్‌ చూపకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి వారికి ఇచ్చే టీకాలు. దీనివల్ల సహజంగానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక రెండోది ‘ఆంజియోటెన్సీన్‌-2’(ఏసీఈ) అనే ఎంజైమ్‌ తక్కువగా ఉండటం. ప్రతి మనిషిలో వివిధ రకాల ఎంజైమ్స్‌ ఉంటాయి. వాటిలో ఆంజియోటెన్సీన్‌-2 అనేది ప్రధానం. కరోనా సోకడానికి ఈ ఎంజైమే ప్రధాన ప్లాట్‌ఫామ్‌. ఇది పిల్లల్లో చాలా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల కరోనా ప్రభావం వారిపై స్వల్పంగానే ఉంటున్నది. అయితే ఈ రెండు అంశాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.- డాక్టర్‌ రమేశ్‌ దాంపురి, కరోనా నోడల్‌ అధికారి, నిలోఫర్‌ దవాఖాన

ఆ నియమాలు కచ్చితంగా పాటించాలి..

థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే అది పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది కచ్చితంగా చెప్పలేం. ఇప్పటి వరకైతే ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లో మాత్రం చిన్నారులపై ప్రభావం తక్కువగానే ఉంది. రికవరీ రేటు కూడా అధికమే. వారిలో ఏసీఈ-2 తక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి కొంచెం రిస్క్‌ ఎక్కువ. ఫస్ట్‌వేవ్‌లో లాక్‌డౌన్‌ కారణంగా పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇండ్ల నుంచి బయటకు వెళ్లలేదు. దీంతో పిల్లలు వైరస్‌కు ఎక్కువగా ప్రభావితం కాలేదు. రెండోదశ వచ్చేసరికి పాఠశాలలకు వెళ్లడం, పెద్దలు నియమాలు పాటించకపోవడంతో వైరస్‌ వ్యాప్తి వేగం పుంజుకున్నది. ఈ క్రమంలో పిల్లలు సైతం బాధితులయ్యారు. అయినా విషమ పరిస్థితి రాలేదు. రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్‌ ఇలా మూడు నియమాలు కచ్చితంగా పాటిస్తే థర్డ్‌వేవ్‌ను మనం జయించి.. పిల్లలను కాపాడుకోవచ్చు. – డాక్టర్‌ దినేశ్‌కుమార్‌ చీర్ల, ఇంటెన్సివ్‌కేర్‌ డైరెక్టర్‌, రెయిన్‌బో హాస్పిటల్‌

సకాలంలో లక్షణాలు గుర్తించాలి…

థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందనేది ఒక అంచనా మాత్రమే. దాని తీవ్రత వచ్చే వైరస్‌ మ్యుటేషన్స్‌పై ఆధారపడి ఉంటుంది. చాలా మంది పిల్లలు కరోనా తర్వాత మల్టీ సిస్టం ఇన్‌ఫ్లామెటరీ సిండ్రోమ్‌(ఎంఐఎస్‌-సీ)కు గురవుతున్నారు. దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. కరోనా సోకిన నెలరోజుల తరువాత జ్వరం, గొంతుకింద వాపురావడం, కళ్లు ఎర్రబడడం, వాంతులు, విరేచనాలు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే 98 శాతం రికవరీ ఉంటుంది. ఐదురోజుల్లోపు జ్వరం, వాంతులు, విరేచనాలు వంటివి తగ్గుముఖం పట్టకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పరిస్థితి విషమిస్తే ప్రమాదకరం. థర్డ్‌వేవ్‌ నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే ముందుగా పెద్దవారు కరోనా నియమాలు కచ్చితంగా పాటించాలి. -డాక్టర్‌ సురేశ్‌కుమార్‌, చిన్నపిల్లల వైద్యనిపుణులు అపోలో క్రెడల్‌ హాస్పిటల్‌

తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి

థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందంటున్నారు. అది ఎలా ఉంటుందనేది కచ్చితంగా చెప్పలేం. కరోనా ఏ దశ అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే. పిల్లలు సురక్షితంగా ఉండాలంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. బయట తిరిగేసి పిల్లల దగ్గరకు వస్తే వారికి వైరస్‌ సోకే అవకాశముంటుంది. ఇప్పుడొస్తున్న కేసులన్నీ కుటుంబసభ్యుల ద్వారా వచ్చినవే. పిల్లల్లో వైరస్‌ సోకినా పెద్దగా తెలియదు. చిన్నారులకు కరోనా టీకాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. -డాక్టర్‌ ఉషారాణి, చిన్నపిల్లల విభాగాధిపతి, నిలోఫర్‌ దవాఖాన

జాగ్రత్తగాఉంటున్నాం

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటి పక్కనున్న ఫ్రెండ్స్‌తోనూ ఆడుకోవడం లేదు. ఇంట్లో ఉంటున్నా శానిటైజ్‌ చేసుకుంటున్నాం. ఏడాది నుంచి స్కూల్‌కెళ్లకుండా ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండాలి. – చింతల సుదీక్ష

చాలా జాగ్రత్తగా ఉంటున్నాం

కరోనా నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉంటున్నాం. బయటకు వెళ్లివస్తే చాలు.. స్నానం చేయనిదే ఇంట్లోకి అడుగుపెట్టడం లేదు. ఇక వేడుకలు, శుభకార్యాలకు, షాపింగ్‌లకు పిల్లలను దూరంగా ఉంచుతున్నాం. పౌష్టికాహారాన్ని ఇంట్లోనే తయారు చేసి పెడుతున్నాం. – సూర్యవేని మహేందర్‌రావు, హైదరాబాద్‌

బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నాం..

ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నాం. బయట నుంచి వస్తే.. పిల్లలను సాధ్యమైనంత మేరకు దూరంగానే ఉంచుతున్నాం. అన్నిరకాలుగా వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఎక్కడికి పంపడం లేదు. బంధువులు, స్నేహితులను కూడా రానివ్వడం లేదు.- వెంకీ, హైదరాబాద్‌

ఇంట్లోనే ఆడుకుంటున్నాం

అపార్ట్‌మెంట్‌ దాటి బయటకు వెళ్లడం లేదు. ఇంట్లోనే క్యారమ్స్‌, చెస్‌ ఆడుకుంటున్నాం. అమ్మానాన్న చెప్పినట్లు శానిటైజ్‌ చేసుకుంటున్నాం. డాడీ.. షాపింగ్‌కు కూడా తీసుకెళ్లడం లేదు. – రోషిణి

No comments:

Post a Comment