- నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
నమస్తే తెలంగాణ మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
జీవ వైవిధ్యం దెబ్బతింటే పర్యావరణానికే ముప్పు ఏర్పడుతుంది. జీవుల మధ్య ఆహారగొలుసు దెబ్బతిని ప్రాణులన్నింటికీ ప్రమాదం వాటిల్లుతుంది. భూమిపై ఆహారపంటలు, ఫలాలు, ఔషధాలు ఇచ్చే 90 శాతం మొక్కలకు కీటకాలు, పక్షులు పరాగ సంపర్క సహకారాలుగా ఉంటాయి. మొక్కలు నశిస్తే వాటిమీద ఆధారపడిన జంతువులు నశిస్తాయి. పక్షులు నశిస్తే మొక్కలు పెరగడం, పంటలు పండటం ఆగిపోతుంది. అంతిమంగా ఏ జీవికైనా ఆహారోత్పత్తి దెబ్బతిని మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.
నాగరికత నేర్చిన మానవుడి విచక్షణారాహిత్యం వల్ల ఈ జీవ వైవిధ్యం ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నది. ఏటా కీటక జనాభాలో 2.5 శాతం క్షీణత కలుగుతున్నది. ఫలితంగా అనేకచోట్ల పంటల దిగుబడి తగ్గుతున్నదని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత అంటే ప్రకృతి వనరులనే కాకుండా, అమూల్యమైన జంతుజాలాన్ని కాపాడుకోవడం. జీవ వైవిధ్యం జాతీయ సంపదకు సూచిక వంటిది. మానవ వికాసానికి చోదకశక్తిగా పనిచేస్తుంది. ప్రపంచంలో 2.3 శాతం భూభాగంలో 12 శాతం జీవ వైవిధ్య జాతులకు నిలయంగా ఉన్న భారత్‌లో కూడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 60 శాతం ఉభయచరాలు, 47 శాతం సరీసృపాలు ప్రమాదపుటంచుకు చేరుకున్నాయి.
కొన్ని జీవరాసులు నశించినా వాటి ప్రభావం అన్ని జీవుల మీద పడుతుంది. దాంతో పర్యావరణం దెబ్బతిని ఆ దుష్ఫలితం మనుషుల మీద పడుతుంది. ఏ దేశంలోనైతే జీవ వైవిధ్యం కాపాడబడుతుందో ఆ దేశం సమృద్ధిగా ఉంటుంది. జీవ వైవిధ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం అడవులపై మనిషి దృష్టిపడటమే. అడవుల్లో అణువిద్యుత్ కేంద్రాలు, ఖనిజాల తవ్వకం జరగటం వల్ల జంతుజాలం కనుమరుగవుతున్నది. ప్రతి జీవికి జీవించే హక్కున్నది. కానీ ఇష్టానుసారంగా చేపలు, ఇతర జంతువుల వేట, మితిమీరిన ప్లాస్టిక్ వాడకం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం యంత్రాల వాడకం, శిలాజ ఇంధనాలను మండించడం, గనుల తవ్వకం, కర్బన ఉద్గారాలు జీవ వైవిధ్య విధ్వంసానికి ప్రధాన కారణాలు.
సుందర్‌లాల్ బహుగుణ నిర్వహించిన చిప్కో ఉద్యమం, పర్యావరణ పరిరక్షణకు సాగిన ఉద్యమాలన్నింటికీ తలమానికమైనది. స్వీడన్ బాలిక గ్రేటా తంబెర్గ్ ‘వాయిస్ ఫర్ ది ప్లానెట్ అండ్ ది స్ట్రెక్ ఫర్ ైక్లెమెట్’ నినాదంతో నిర్వహించిన జీవ వైవిధ్య రక్షణ ఉద్యమం ఆ దేశంలో పర్యావరణ అనుకూల విధానాలు అమలయ్యేలా చేసింది. గ్రెటా తంబెర్గ్, వందనా శివ, మేథాపాట్కర్, వనజీవి రామయ్య దారిలో పౌర సమాజం జీవ వైవిధ్య రక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచమంతటా ఏటా 10 వేల జాతులు లేదా రోజుకు 27 జాతులు అంతరించిపోతున్నాయని విల్సన్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. వృక్ష, జంతు, పక్షిజాతులు అంతరించిపోతే మానవ మనుగడకు ప్రమాదం. ఇప్పటికే ఋతువులు గతితప్పుతున్నాయి. జీవనదులు ఎండిపోతున్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయటం ద్వారా పర్యావరణాన్ని తద్వారా భూగోళాన్ని రక్షించుకోవాలని నిపుణులు పిలుపునిస్తున్నారు. ప్లాస్టిక్‌ను దూరం పెట్టి, మన ఆరోగ్యంతో పాటు పుడమి తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కృషిచేయాలి. 2030 నాటికి కనీసం 30 శాతం భూమి ఉపరితలాన్ని రక్షించాలని పథకాలు రూపొందిస్తున్నారు. భూమి ఉపరితలం రక్షించబడితే దీని మీద ఆధారపడిన వృక్ష, జంతుజాతులు కూడా రక్షించబడతాయి. ఇందులో భాగంగానే అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. వాటి సంతతిని వృద్ధిచేసి జీవ వైవిధ్యానికి పాటుపడుతున్నారు.
జీవ వైవిధ్య దినోత్సవం జరుపాలని ఐరాస తీర్మానించింది. మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. ఏటా ఒక్కొక్క నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ‘మేం కూడా పరిష్కారంలో భాగమే’ అనే థీమ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. మానవ భవిష్యత్తుకు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తారు. మన దేశంలో 1,00,696 జంతు జాతులున్నాయి. 48,653 జాతుల మొక్కలున్నాయి. ఇవి కనుమరుగు కాకుండా 2002లోనే దేశంలో ప్రత్యేక జీవవైవిధ్య చట్టం వచ్చింది. దీంతో విచక్షణారహితంగా చెట్లను నరకటం, క్రిమి సంహారాల ఇష్టానుసార వినియోగం, అడవుల్లోని వన్యప్రాణులను, సముద్ర జలాల్లో జలచరాల వేటను కట్టడి చేశారు. మనిషి మనుగడకు ఇతర జీవరాసుల అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఈ విషయం తెలియజేయడమే జీవ వైవిధ్య దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
No comments:
Post a Comment