హైదరాబాద్ : 12/05/2021
మోదీకి 9 డిమాండ్లు.. 12 విపక్ష పార్టీల లేఖాస్త్రం
న్యూఢిల్లీ: ప‌్రధాని నరేంద్ర మోదీకి 12 విపక్ష పార్టీలు సంయుక్తంగా లేఖాస్త్రం సంధించాయి. కరోనా సంక్షోభంలో దేశ ప్రజలను ఆదుకునేందుకు 9 డిమాండ్లను ప్రస్తావించాయి. ఉద్యోగం లేని వారికి నెలకు ఆరు వేలు, పేదలకు ఉచిత రేషన్, దేశప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్, బడ్జెట్‌లో కేటాయించిన 35 వేల కోట్ల నిధులు దీనికి వాడటం, వ్యాక్సిన్ తయారీ లైసెన్సింగ్ విధానాన్ని పెంచడం, సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ పనులు నిలుపుదల, ఆ నిధులు ఆక్సిజన్, వ్యాక్సిన్ల కోసం వినియోగం, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం వంటి డిమాండ్లను మోదీ ముందు ఉంచారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టడానికి, అమలు చేయడానికి ఈ డిమాండ్లు “ఖచ్చితంగా అత్యవసరం” అని భావిస్తున్నామని, పదే పదే ప్రధాని మోదీ దృష్టికి తెచ్చినా ఫలితం లేదని 12 విపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. “దురదృష్టవశాత్తు, మీ ప్రభుత్వం ఈ సూచనలన్నింటినీ విస్మరించింది, తిరస్కరించింది. ఇది మానవ నాశనానికి దారితీసే విషాద పరిస్థితిని మరింత పెంచుతున్నది ”అని ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేకేపీఏ నేత ఫరూక్ అబ్దుల్లా, టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమత, శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్, జేడీయూ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ, డీఎంకే చీఫ్, తమినాడు సీఎం ఎంకే స్టాలిన్, జేఎంఎం చీఫ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరీ, సీపీఐ నేత డీ రాజా, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ లేఖపై సంతకం చేశారు.
No comments:
Post a Comment