Saturday, May 15, 2021

పాలతో పాటే మద్యం… జనం కష్టాన్ని కాసులుగా మార్చుకున్న గులాబీ దళం

హైదరాబాద్ : 15/05/2021

పాలతో పాటే మద్యం… జనం కష్టాన్ని కాసులుగా మార్చుకున్న గులాబీ దళం

తొలివెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)

పాల‌తో పాటే మ‌ద్యం సీసా అన్న ప‌థ‌కాన్ని కేసీఆర్ స‌ర్కార్ ప్ర‌వేశపెట్టిందా అన్న‌ట్లుగా త‌యారైంది ప‌రిస్థితి. ఉద‌యం లేవ‌గానే ఇంత‌కు ముందు మిల్క్ బూత్ వ‌ద్ద ఉండే క్యూ లైన్… ఇప్పుడు వైన్స్ ముందు క‌న‌ప‌డుతుంది. లాక్ డౌన్ అన్న ఒకే ఒక్క మాట‌తో ఐదు గంట‌ల్లో 250కోట్ల వ్యాపారం చేసిన స‌ర్కార్… ఇప్పుడు టీఆర్ఎస్ నేత‌ల జేబులు నింపుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

ఉద‌యం 6గంట‌ల నుండి 10గంట‌ల వ‌ర‌కే వైన్స్ ఓపెన్ ఉంటుంది. అప్పుడు మిస్ అయితే త‌ర్వాత రోజు వ‌ర‌కు వెయిట్ చేయాల్సిన ప‌నిలేకుండా గ్రామ స్థాయిలో టీఆర్ఎస్ లీడ‌ర్లు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే మ‌ద్యం పాల‌సీ తీసుకొచ్చిన‌ట్లున్నారు. ఇప్ప‌టికే బెల్ట్ షాపుల‌ను పెంచి పోషిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లుండ‌గా… ఇప్పుడు లాక్ డౌన్ స‌మ‌యంలో ఆ షాపుల నుండి జోరుగా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదాయం కావాలి. వైన్స్ మూసేసి ఉన్న‌ప్ప‌టికీ మ‌ద్యం అమ్ముడైపోవాలి. సో… బెల్ట్ షాపులే ఆ ప‌ని చేసి పెడ‌తాయి. అందుకే వైన్ షాపుల‌కు వ‌చ్చే స్టాక్ ఎక్కువ‌గా బెల్ట్ షాపుల‌కు త‌ర‌లుతుంద‌ని… ఇది అటు ప్ర‌భుత్వానికి ఆదాయం తెచ్చిపెట్ట‌డంతో పాటు ఇటు స్థానిక నేత‌ల‌కు కూడా ఆదాయ మార్గంగా మారుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

మ‌ద్యం తెగ తాగేస్తున్నారు అనేందుకు అమ్మ‌కాల లెక్క‌లే మంచి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 2210 వైన్స్ లుండ‌గా, ఏప్రిల్ 30 వరకు 2270 కోట్ల అమ్మకాలు జరిగాయి. కానీ మే నెలలో ఈ 14 రోజుల్లోనే ఏకంగా 1020 కోట్లు దాటాయి. అంటే… మరో రెండు నెలల వరకు అమ్మాల్సిన మ‌ద్యాన్ని బెల్ట్ షాపులకు త‌ర‌లించి ఇప్ప‌టికే అమ్మేశారు.

ప‌నిచేస్తేనే పూట గ‌డిచే వారంతా ఇప్పుడు లాక్ డౌన్ తో ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. కానీ మ‌ద్యం అలవాటున్న వీరిలో చాలా మంది ఇప్పుడు అప్పులు చేస్తూ బెల్ట్ షాపులకు వెళ్తున్నారు. అక్క‌డ ఎమ్మార్పీ క‌న్నా 30 నుండి 300రూపాయ‌లు అధికంగా తీసుకొని మ‌ద్యం అమ్ముతున్నారు. రేటు పెంచినా స‌రే… సాయంత్రం అయ్యిందంటే చాలు వైన్సుల ముందు ఉండే దృష్యాలు ఇప్పుడు బెల్ట్ షాపుల వ‌ద్ద క‌నిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అండ‌దండ‌లున్నందునే అబ్కారీ శాఖ ప‌ట్టించుకోవ‌టం లేద‌ని… మొద్దు నిద్ర న‌టిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లకు కార‌ణం అవుతుంది.

క‌రోనా స‌మ‌యంలో ప్ర‌భుత్వం పేద‌ల‌తో అధిక రేట్ల‌కు మ‌ద్యం కొనిపించేలా చేస్తుంద‌ని, తాగండి… ఊగండి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. లాక్ డౌన్ లోనూ మందుబాబులు ఇటు ప్ర‌భుత్వాన్ని అటు టీఆర్ఎస్ నేత‌ల ఖ‌జానా భారాన్ని మోస్తున్నారు.

No comments:

Post a Comment