హైదరాబాద్ : 13/05/2021
వైద్యారోగ్యశాఖలో మూడు ముక్కలాట.. ఇదేందిది!
వైద్యారోగ్యశాఖను స్వయంగా తానే చూసుకుంటానంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తీరా ఒక్కరోజులోనే తీరు మార్చుకున్నారు. ఓ వైపు అల్లుడు హరీష్ రావు, మరోవైపు తనయుడు కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించి తాను సైడైపోయారు. కట్ చేస్తే.. నిన్న కేంద్ర ఆరోగ్యశాఖతో సమావేశానికి హరీష్ హాజరైతే.. కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖను అసలు ఎవరు చూస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అధికారుల్లో నెలకొంది.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో వైద్యారోగ్యశాఖను అనుక్షణం పర్యవేక్షించే మంత్రి కావాల్సి ఉంది. ఈటలను పక్కనబెట్టిన తర్వాత.. తానే అన్ని చూసుకుంటానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో రాష్ట్ర ప్రజానీకం కొంత ఊపిరి పీల్చుకుంది. స్వయంగా సీఎం ఆ శాఖను పర్యవేక్షిస్తారంటే వేగంగా నిర్ణయాలు జరిగిపోతాయని.. ఆస్పత్రుల్లో సౌకర్యాలు వెంటనే మెరుగవుతాయని అంతా భావించారు. కానీ చివరికి వైద్యారోగ్యశాఖను ముఖ్యమంత్రి మూడు ముక్కలాటగా మార్చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణంగానే ఒక శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో మరో శాఖ మంత్రి జోక్యం చేసుకుంటే ఎవరికీ నచ్చదు. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి చెప్పాలే తప్ప.. నేరుగా ఇతర మంత్రి తలదూరిస్తే ఎవరూ ఒప్పుకోరు. కానీ ఇప్పుడు వైద్యారోగ్యశాఖ విషయంలో అటు హరీష్ ఓ వైపు నుంచి వ్యవహారాన్ని చక్కబెడుతోంటే.. మరోవైపు నుంచి కేటీఆర్ అదే పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఎవరి దగ్గరికి వెళ్లి సమాచారం ఇచ్చుకోవాలన్నది పెద్ద సమస్యే. పోనీ ఇద్దరూ కలిసి ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారా అంటే.. ఈ మాత్రం ఒక్కశాఖ కోసం మళ్లీ ముగ్గురు పనిచేయాలా అని పలువురు పెదవి విరుస్తున్నారు.
No comments:
Post a Comment