హైదరాబాద్ : 19/05/2021
కరోనా ఎఫెక్ట్: దేశంలో రెండింతలైన గ్రామీణ నిరుద్యోగం
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ప్రతి రోజు వేల మందిని పొట్టన పెట్టుకుంటుండగా, చాలా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉన్నది. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉపాధి కోల్పోతున్నవారి సంఖ్య అధికమవుతున్నది. లాక్‌డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ సంఖ్యలో ప్రజలు నిరుద్యోగులుగా మారుతున్నారు. లాక్‌డౌన్‌కుతోడు వ్యవసాయ పనులు మందగించడంతో గ్రామాల్లో చేసేందుకు పనులులేక ఖాళీగా ఉంటున్నవారు క్రమంగా పెరిగిపోతున్నారు.
దీంతో గ్రామీణ భారతంలో మే 16తో ముగిసిన వారంలో నిరుద్యోగల సంఖ్య రెండితలయ్యిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే 9తో ముగిసిన వారంలో గ్రామీణ నిరుద్యోగుల సంఖ్య 7.29గా ఉండగా.. ఈ 16 నాటికి అది 14.34 శాతానికి పెరిగిందని సీఎంఐఈ పేర్కొంది. గ్రామీణ భారతంలో నిరుద్యోగిత ఇంత భారీగా పెరగడం గత 50 వారాల్లో ఇదే మొదటి సారని తెలిపింది. గతంలో 2020, జూన్ 7న నిరుద్యోగుల సంఖ్య అత్యధికానికి చేరింది.
కాగా, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయిన వారు కూడా పెరిగిపోయారని నివేదిక వెల్లడించింది. అర్బన్ ఏరియాలో గత వారం 14.7 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇది మే 9తో ముగిసిన వారంలో దీనికి 3 శాతం తక్కువగా ఉందని వెల్లడించింది. అదేవిధంగా గతవారంలో సరాసరి నిరుద్యోగిత 8.76 శాతం నుంచి 14.45 శాతానికి చేరిందని పేర్కొంది. లాక్‌డౌన్‌లతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడమే దీనికి కారణమని అభిప్రాయపడింది. దీంతో ఏప్రిల్‌లో శ్రామిక శక్తి 11 లక్షలు తగ్గిపోగా, మొత్తం ఉద్యోగ శ్రమశక్తి 70.35 లక్షలకు పడిపోయిందని తెలిపింది.
No comments:
Post a Comment