సైలెంట్ కిల్లర్... హ్యాపీ హైపోక్సియా
ఆక్సిజన్ శాతం తగ్గినా ప్రభావం కనిపించడం లేదు..
గమనించని పిన్నవయసు వారిలో హఠాన్మరణాలు
ఒక్కసారిగా కుప్పకూలి విషాదాంతం
ఈనాడు - అమరావతి
కరోనా రెండో దశ యువతను ఎక్కువగా బలి తీసుకుంటోంది. స్వల్ప లక్షణాలే ఉండి అప్పటివరకు చూడటానికి ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నవారూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది మరణానికి కారణం ‘హ్యాపీ హైపోక్సియా’! వైద్య పరిభాషలో ‘సైలెంట్ హైపోక్సియా’గా కూడా పిలిచే ఈ లక్షణం నిజంగానే ఓ సైలెంట్ కిల్లర్. ఆరోగ్యవంతులైన మనుషుల రక్తంలో ఆక్సిజన్ 95 శాతానికిపైగా ఉండాలి. అది తగ్గే కొద్దీ మెదడుకు అందే ఆక్సిజన్ శాతం తగ్గి క్రమంగా వివిధ అవయవాలపై ప్రభావం కనిపిస్తుంది. కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతింటే రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోతూ ఉంటుంది. అది 90కంటే తగ్గితే శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులేర్పడతాయి. ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా సోకిన కొందరిలో ఆక్సిజన్ శాతం పడిపోయినా.. శ్వాసలో ఎలాంటి ఇబ్బందులూ ఉండటం లేదు. వీరిలో కొందరు కొంత అలసటకు గురయ్యే పనిచేసినా అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. దీన్నే వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా అంటున్నారు. కరోనా మొదటి దశలో ఆక్సిజన్ 90 శాతంకంటే కొంచెం తగ్గినా రోగులకు ఈ విషయం తెలియక హ్యాపీగా తిరిగేస్తుంటే హ్యాపీ హైపోక్సియాగా పేర్కొనేవారు. యువతలో సహజంగా రోగనిరోధకత, శారీరక దారుఢ్యం ఎక్కువగా ఉంటున్నందున కొందరిలో ఆక్సిజన్ శాతం పడిపోయినా తెలియడం లేదని వైద్యులు వివరిస్తున్నారు. అప్పటికే అంతర్గతంగా చాలా నష్టం జరుగుతోందని చెబుతున్నారు.
పిన్న వయస్కులు ఎక్కువగా ఎందుకు చనిపోతున్నారు?
కరోనా మొదటిదశ ఉద్ధృతి తగ్గేసరికి చాలా మందిలో, ముఖ్యంగా పిన్న వయస్కుల్లో తమకు కరోనా సోకదని.. వచ్చినా ఏమీ కాదన్న భరోసా వచ్చింది. మాస్కు పెట్టుకోవడం, ఎడం పాటించడం వంటి జాగ్రత్తలను పెద్దగా పాటించలేదు. దీంతో వారిపై వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటోంది. జ్వరం వంటి లక్షణాలు కనిపించినా మాకేమీ కాదన్న భరోసాతో పరీక్షలు చేయించుకోకుండా తిరిగేస్తున్నారు. జ్వరం వస్తే ఏ పారాసిటమాల్ వేసుకుంటూ.. తగ్గిపోయిందని ఊరుకుంటున్నారు. వారి ఊపిరితిత్తులకు వైరస్ చేస్తున్న నష్టాన్నిగానీ, రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోతున్న విషయాన్ని గానీ గుర్తించలేకపోతున్నారు. అలాంటివారు ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ‘ఉబ్బసం ఉన్నవారికి ఆక్సిజన్ 95 శాతానికి పడిపోయినా పిల్లికూతలు వస్తాయి. రోగికీ, చూసేవాళ్లకీ కూడా అతడి అవస్థ తెలుస్తుంది. కానీ కరోనా సోకిన వారందరికీ ఆయాసం ఉండాలని లేదు. లోపల మాత్రం నష్టం జరిగిపోతుంది. వ్యాధి ముదిరాక ఆసుపత్రికి వెళ్లడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు’ అని సీనియర్ ఫిజీషియన్ ఒకరు వివరించారు.
94 శాతానికి తగ్గితే జాగ్రత్త పడాలి
‘పిన్న వయస్కుల్లో మరణాలకు వారికి వ్యాక్సినేషన్ కాకపోవడం కూడా ప్రధాన కారణం. నేను చూస్తున్న రోగుల్లో ఆక్సిజన్ శాతం 40-50 శాతానికి పడిపోయి ప్రమాదకర స్థితిలో ఆసుపత్రికి వస్తున్న వారున్నారు. అలాంటివారికి చికిత్స చేయడం కష్టమవుతోంది. హ్యాపీహైపోక్సియా లక్షణం ఉన్నవాళ్లు అప్పటివరకు బాగానే కనిపిస్తున్నారు. టాయిలెట్‌కు వెళ్లినా, వేగంగా మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం, బైక్ మీద వెళ్లడం.. ఇలా కాస్త ఒత్తిడి, ఆయాసం కలిగించే పనులు చేస్తే ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. కాబట్టి కరోనా లక్షణాలుంటే ఎప్పటికప్పుడు పల్స్‌ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ శాతం పరీక్షించుకోవాలి. 94 శాతంకంటే తగ్గితే జాగ్రత్తపడాలి. కొందరికి కరోనా సోకినా జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. బాధితులమన్నదే తెలియకపోవచ్చు. టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఆయాసంగా అనిపించడం, పెదవులు నీలం రంగులోకి మారడం, చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టడం వంటివి హ్యాపీ హైపోక్సియా లక్షణాలు. ప్రస్తుతం కరోనా ఉద్ధృతంగా ఉన్నందున ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి’’.
-డాక్టర్ సుధీర్, పల్మనాలజిస్ట్, ఒమ్ని హాస్పిటల్, విశాఖపట్నం
చూస్తుండగానే చేయిదాటిపోతోంది
‘‘కరోనా మొదటి దశలో హ్యాపీ హైపోక్సియా లక్షణం ఉన్నవారు ఆక్సిజన్ శాతం 98 ఉన్నప్పుడు ఎలా ఉండేవారో, 90కి పడిపోయినప్పుడూ అలాగే ఉండేవారు. ఇప్పుడు 80-85 శాతంకంటే పడిపోయినా సాధారణంగానే ఉంటున్నారు. వారిలో వ్యాధి లక్షణాలూ పెద్దగా కనిపించడం లేదు. హఠాత్తుగా నష్టం జరుగుతోంది. కాబట్టి కరోనా సోకినవాళ్లు వ్యాధి లక్షణాలకంటే పల్స్ ఆక్సీమీటర్‌పైనే ఎక్కువ ఆధారపడాలి. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండటంతో 85-90 శాతానికి పడిపోయినవారిని చేర్చుకోవడానికి ఆసుపత్రులూ భయపడుతున్నాయి. కాబట్టి ముందే జాగ్రత్త పడాలి. కొందరిలో అప్పటికి ఆక్సిజన్ శాతం సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ చూస్తుండగానే పడిపోతోంది. 72 గంటల్లో పరిస్థితి చేయిదాటిపోతోంది. కరోనా కొత్త ఉత్పరివర్తనం వల్ల ఇలా జరుగుతోంది. లోగడ ఆక్సిజన్ శాతం కాస్త తగ్గితే హోంఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోమనేవారు. ఇప్పుడు సీటీస్కాన్ పర్సంటేజీని బట్టి ఇంట్లో ఉండాలో, ఆసుపత్రిలో చేరాలో వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం హ్యాపీహైపోక్సియా యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. మరణాలూ వారిలో ఎక్కువ ఉంటున్నాయి’’.
- డా.కొడాలి జగన్మోహన్‌రావు, ఉదరకోశ వ్యాధుల నిపుణులు నాగార్జున ఆసుపత్రి, విజయవాడ.
హ్యాపీ హైపోక్సియాకు కారణాలివీ
హ్యాపీ హైపోక్సియాకు రెండు ప్రధాన కారణాలున్నాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వైరస్ కలిగించే ఇన్‌ఫ్లమేషన్ రియాక్షన్ వల్ల ఊపిరితిత్తుల నుంచి రక్తం సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లోను గడ్డలు ఏర్పడుతున్నాయి. ఊపిరితిత్తులు దెబ్బతినడం, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో ఆక్సిజన్ శోషించుకునే గుణం తగ్గుతోంది. మెదడుకు అవసరమైనంత రక్తం సరఫరా కాదు. బృహద్ధమనికిపైన ఉండే కరోటిడ్ బాడీస్‌ను వైరస్ దెబ్బతీయడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిందని రోగి గ్రహించలేడు.రెండో కారణం.. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు దాన్ని గాలి నుంచి ఎక్కువగా గ్రహించేందుకు మనిషి అసంకల్పితంగానే ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఆ క్రమంలో రక్తంలో ఉండే కార్బన్‌డైఆక్సైడ్ ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. సాధారణంగా రక్తంలో కార్బన్‌డైఆక్సైడ్ 40 మిల్లీమోల్స్ ఉండాలి. మనిషి మెదడులో శ్వాసకోశ వ్యవస్థను నియంత్రించే భాగాన్ని స్టిమ్యులేట్ చేసేది కార్బన్‌డైఆక్సైడే. అది ఉండాల్సిన దానికంటే తగ్గిపోవడం వల్ల, మనిషి మెదడులో స్టిమ్యులేషన్ జరగక ఆక్సిజన్ శాతం తగ్గిన విషయాన్ని రోగి గ్రహించలేడు.
No comments:
Post a Comment