Wednesday, May 26, 2021

వాహనాల క్యూ 100 మీటర్లకు మించకూడదు,మించితే.. టోల్‌రుసుం లేకుండానే చలోచలో !!

Hyderabad : 27/05/2021

*టోల్ గేట్లవద్ద.....అనుమతి 10 సెకెన్లే.......!*

*వాహనాల క్యూ 100 మీటర్లకు* *మించకూడదు*
*మించితే.. టోల్‌రుసుం లేకుండానే చలోచలో*
*రహదారి నిర్వాహకులకు మార్గదర్శకాల జారీ*

: జాతీయ రహదారుల్లో రద్దీ గరిష్ఠంగా ఉన్న సమయంలోనూ టోల్‌గేట్ల వద్ద ఒక్కో వాహనం పది సెకన్లకు మించి వేచి ఉండటానికి వీల్లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా వాహనాలు సాగిపోవడానికి చర్యలు తీసుకోవాలని రహదారి నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. టోల్‌గేట్ల వద్ద వాహనాల వరుస వంద మీటర్లకు మించి ఉండకూడదని స్పష్టం చేసింది.వందశాతం ఫాస్టాగ్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీ పూర్తిగా తగ్గినప్పటికీ, కొన్నిచోట్ల మాత్రం విభిన్న కారణాల వల్ల వంద మీటర్లకు మించి వాహనాలు వరుసలో ఉంటున్నట్లు గుర్తించారు. ఇలాంటి సమయాల్లో క్యూ వంద మీటర్ల లోపునకు వచ్చేంతవరకు ముందున్న వాహనాలను టోల్‌ఫీజు లేకుండానే వేగంగా వదిలేయాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు అన్ని టోల్‌బూత్‌ల వద్ద వంద మీటర్ల దూరంలో ఒక పసుపుపచ్చ లైన్‌ గీయనున్నారు. వాహనాలు ఎప్పుడు ఆ లైన్‌ దాటి నిల్చున్నా ముందున్న వాహనాలను టోల్‌ లేకుండా వేగంగా పంపేసి మిగతా వాహనాలు ఆ లైన్‌లోపు ఉండేలా చూసుకోవాలి.

టోల్‌ప్లాజా సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జాతీయ రహదారుల్లో వందశాతం నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఫాస్టాగ్‌ వినియోగం సగటున 96 శాతానికి చేరింది. కొన్ని టోల్‌గేట్ల వద్ద ఇది 99 శాతం వరకూ ఉంటోంది. ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూళ్లు పెరిగిన దృష్ట్యా వచ్చే పదేళ్లకాలంలో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త డిజైన్లలో టోల్‌ప్లాజాలను నిర్మించాలని నిర్ణయించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది.

*link Media SVPP🖋️*

prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment