హైదరాబాద్ : 02/05/2021
ఈటల వైపే తెలంగాణవాదులు- కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొత్త వేదిక!
మంత్రి ఈటలపై వస్తున్న ఆరోపణలు, రాష్ట్ర రాజకీయవర్గాల్లో విచిత్రమైన పరిస్థితిని తీసుకొచ్చాయి. ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరిపై అయినా అవినీతి ఆరోపణలు వస్తే.. విపక్షాలు లేదా ఇతర వర్గాల నుంచి స్పందన వేరేలా ఉంటుంది. తక్షణమే ఆ మంత్రిని అరెస్ట్ చేయాలనో.. వెంటనే పార్టీ నుంచి తొలగించాలనో డిమాండ్లు వెల్లువెత్తుతుంటాయి. కానీ ఆశ్చర్యంగా ఈటల విషయంలో అలాంటిదేం జరగడం లేదు. ఎవరూ ఆ తరహా వ్యాఖ్యలు చేయడం లేదు. పైగా పూర్తిగా కేసీఆర్‌నే తప్పుబడుతూ ఈటలపై సానుభూతి చూపిస్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు ఈటలకు పెద్ద బలంగా మారడంతో పాటుగా.. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక కొత్త పార్టీ పెట్టాలా లేక ఇతర పార్టీలో చేరాలా అని తెలియక సతమతం అవుతున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అయితే.. ఈటల కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈటల బయటకు వస్తే ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధమని గతంలోనే ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ యువసేన పార్టీ అధ్యక్షుడు అడప సురేందర్, ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న వంటి వారితో ఓ గట్టి కూటమిని తయారు చేయాలని అనుకుంటున్నట్టు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు కొండా. తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్, రెడ్డి ,మున్నూరుకాపు వంటి సామాజిక వర్గాలకు వీరు ప్రతినిధులుగా ఉండటం, వీరికి తోడు ఇప్పుడు ఈటల కూడా తోడయ్యే అవకాశం ఉండటంతో.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అయితే ఈటలనే ఇంకా ఏదీ తేల్చుకోలేదు. బహుశా సర్కార్ తీసుకునే నిర్ణయం, కేసీఆర్ తీరును బట్టి ఆయన తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశముంది.
No comments:
Post a Comment